బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - May 31, 2020 , 02:22:12

ప్రమాద రహిత ఓసీగా జేకే5 గుర్తింపు

ప్రమాద రహిత ఓసీగా జేకే5 గుర్తింపు

  • లాక్‌డౌన్‌లో సైతం బొగ్గు ఉత్పత్తి
  • రవాణా సదుపాయం లేక నిలిచిన నిల్వలు

ఇల్లెందు: జేకే (జవహర్‌ ఖని) 5 ఓపెన్‌ కాస్ట్‌ తిరుగులేని విధంగా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నది. ఇల్లెందు ఏరియాకు గత కొన్ని సంవత్సరాలుగా ఆయువుపట్టుగా నిలుస్తోంది. ఇల్లెందు ఏరియాలో ప్రస్తుతం కేవోసీ, జేకే5 ఓసీలు పని చేస్తున్నాయి. 21 ఇైంక్లెన్‌ అండర్‌ గ్రౌండ్‌ ఉన్నా నామమాత్రమే. త్వరలో దానిని మూసివేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జేకే5 ఓసీ మాత్రం లాక్‌డౌన్‌లో సైతం ఉత్పత్తి సాధించింది. కానీ రవాణా లేకపోవడంతో ఉత్పత్తి ఇక్కడే నిలిచింది.. ప్రస్తు తం ఓసీలో 2.90 లక్షల టన్నుల ఉత్పత్తి చేసిన బొగ్గు నిల్వలు ఉన్నాయి. రోజుకు 14 వేల టన్నులు సరఫరా చేయాల్సి ఉన్నా లాక్‌డౌన్‌ నిబంధనలు అడ్డుగా మారాయి. ఉత్పత్తిలో త నకు తానే సాటి అని ఓసీ నిరూపించింది. కోయగూడెం ఓసీలో బొగ్గు ఉత్పత్తి లేని సమయంలో ఏరియా భారాన్ని మోస్తూ టార్గెట్‌ను మించి బొగ్గు ఉత్పత్తి చేసింది. ప్రమాదరహిత ఓసీగా పలుమార్లు అవార్డులు సొంతం చేసుకుంది.అదే విధంగా తక్కు వ కార్మికులతో ఎక్కువ ఉత్పత్తి చేసిన ఓసీగా రికార్డు సృష్టించింది.

ఇదంతా ఒక ఎత్తైతే ఇటీవల లాక్‌డౌన్‌లో ప్రైవేట్‌, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ  మూతపడిన విషయం తెలిసిందే. సింగరేణి కార్మికులకు సైతం లాక్‌డౌన్‌ నిబంధనలను వర్తింపజేశారు. అయినప్పటికీ ఉత్పత్తి విషయంలో ఓసీ వెనుకడుగు వేయలేదు. ఈ ఏడాది మార్చి 21 నుంచి లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ నెలలో పది రోజులు మిగిలి ఉండగానే 3.06 లక్షల టన్నుల లక్ష్యానికి  3.60 లక్షల టన్నులు ఉత్పత్తి సాధించి రికార్డు సృష్టించింది. పది రోజుల పాటు కార్మికులు అంతంత మాత్రంగానే విధులకు హాజరైనప్పటికీ ఉత్పత్తి విషయం లో ఓసీ వెనుకడుగు వేయలేదు. ఏప్రిల్‌లో కాస్త వెనుకడుగు వేసింది. పూర్తిగా లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులోకి రావడంతో కార్మికులు విధులకు హాజరుకాలేకపోయారు. అయినప్పటికీ ఏప్రిల్‌ నెల 2.85 లక్షల టన్నులకు 1.30 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసి ఏరియాలో సత్తా చాటింది. మే లో 2.85 లక్షల టన్నుల లక్ష్యానికి  1.60 లక్షల టన్నులు ఉత్పత్తి సాధించింది. 

నిలిచిన రవాణా..

మూడు నెలలు పూర్తిగా లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో రవాణా నిలిచిపోయింది. అందువల్ల  రేకులకు అనుమతి లేదు. ఓసీ నుంచి రోజుకు 9000 టన్నులు , కేవోసీ నుంచి 5 వేల టన్నులు ఇతర ప్రాంతాలకు రవాణా కావాల్సి ఉంది. లాక్‌డౌన్‌లో రైళ్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఫలితంగా మార్చిలో యథావిధిగా రవాణా కొనసాగించారు. ఏప్రిల్‌, మే లో 2.90 లక్షల టన్నుల బొగ్గును ఇల్లెందు ఏరియాలో నిల్వ ఉంచారు. ఇప్పుడు లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో రోజుకు ఇల్లెందు ఏరియా నుంచి 4 రేకులు సరఫరా చేసేందుకు యాజమాన్యం సన్నద్ధమవుతున్నది. ఇదిలా ఉంటే రోడ్డు మార్గం నుంచి రోజుకు 1000 టన్నులు సరఫరా చేయాల్సి ఉంది. ప్రకృతి విపత్తులు ఎన్ని వచ్చినా జేకే5 ఓసీలో ఉత్పత్తికి ఆటంకం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వారం రోజుల పాటు రోజంతా వర్షం కురిసిన నీటి నిల్వలు ఉండకుండా గ్యాలరీలు ఏర్పాటు చేసిన ఏకైక ఈ ఓసీయేనని చెబుతున్నారు. 

యథావిధిగా ఉత్పత్తి.. 

జేకే5 ఓసీలో ఏడాది పొడవునా ఉత్పత్తి ఉంటుంది. ప్రకృతి విపత్తులు ఎన్ని ఎదురైనా ఉత్పత్తిలో ఆటంకం ఉండదు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించినప్పటికీ ఇక్కడ ఉత్పత్తి యథావిధిగా కొనసాగింది. మ్యాన్‌పవర్‌ తగ్గినా ఉత్పత్తి సాగింది. వానకాలంలో వారం రోజుల పాటు వర్షం కురిసినప్పటికీ ఉత్పత్తికి ఆటంకం కలుగదు. ప్రమాద రహిత ఓసీగా చరిత్ర సృష్టించింది. రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడమే యాజమాన్యం ముం దున్న కర్తవ్యం.

 -బొల్లం వెంకటేశ్వర్లు, ఏజెంట్‌ , ఇల్లెందు ఏరియా