శనివారం 05 డిసెంబర్ 2020
Badradri-kothagudem - May 29, 2020 , 00:45:36

పరిశుభ్రతకు ప్రాధాన్యం

పరిశుభ్రతకు  ప్రాధాన్యం

రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ 

ఖమ్మం, నమస్తే తెలంగాణ : అంటువ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన మున్సిపల్‌ డైరెక్టర్‌ సత్యనారాయణతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి, ఖమ్మం నగర పాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపల్‌ కమిషనర్లనుద్దేశించి ఆయన మాట్లాడారు. జూన్‌ 1 నుంచి 8వ తేదీ వరకు అన్ని మున్సిపాలిటీల్లో స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఖమ్మం నగరంతో పాటు మున్సిపాలిటీల్లో కూడా మురికి కాలువల్ని శుభ్రం చేసి మురుగు నీరు, వర్షపునీటి ప్రవాహాలకు ఆటంకం తలెత్తకుండా చూడాలన్నారు. అదే విధంగా రోడ్ల వెంబడి ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించాలని సూచించారు. యాంటీ లార్వా కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టి వర్షాకాల సీజన్‌లో అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దోమలను వ్యాప్తి  చేసే లార్వాను నివారించేందుకు  నివాసిత ప్రాంతాల్లో తప్పనిసరిగా స్ప్రేయింగ్‌, ఫాగింగ్‌ చేపట్టాలన్నారు. ఖాళీ ప్రదేశాల్లో చెత్తను, పొదలను, పిచ్చి మొక్కలను, భవన నిర్మాణ వ్యర్థాలను యుద్ధ ప్రాతిపాదికన తొలగించాలని ఆయన సూచించారు. నగరపాలక సంస్థలతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ప్రత్యేక బృందాలను నియమించి అవసరమైన మానవ వనరుల, వాహనాలు, సామగ్రిని ముందస్తుగానే సమకూర్చుకోవాలని ఆదేశించారు. హాట్‌స్పాట్‌ల వద్ద బ్లీచింగ్‌ స్ప్రేయింగ్‌ పనులను మరింత ముమ్మరం చేయాలన్నారు. ఇంటితో పాటు ఇంటి పరిసరాలు ప్రభుత్వ ఆసుపత్రులు, బస్‌స్టేషన్లు, మార్కెట్లు, పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ప్రతి ఆదివారం పది గంటల పది నిముషాల కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లను భాగస్వాములు చేస్తూ ఇండ్లతో పాటు ఇంటి పరిసరాలను శుభ్రం చేయించాలని చెప్పారు. ఇప్పటికే అనుమతించిన పనులకు ఎల్‌ఆర్‌ఎస్‌ నిధుల నుంచి 70 శాతం వరకు వినియోగించుకోవచ్చునని సూచించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి, ఖమ్మం నగర పాలక సంస్థ కమిషనర్‌ అనురాంగ్‌ జయంతి మాట్లాడుతూ.. జిల్లాలో ఆస్తి పన్నుల వసూళ్లలో మరింత పురోగతి సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇంకా ఆస్తి పన్ను చెల్లించని నివాసితులు, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాదారులను బాధ్యులతో కలిసి ఆస్తి పన్ను వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.