ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - May 29, 2020 , 00:45:51

ఆయిల్‌ఫెడ్‌లోఅవినీతి కుట్ర

ఆయిల్‌ఫెడ్‌లోఅవినీతి కుట్ర

ప్రైవేట్‌ కంపెనీలతో అధికారుల కుమ్మక్కు..?

ఆయిల్‌ రికవరీ తగ్గుదలపై రైతుల అనుమానం

ముందే హెచ్చరించినా ఫలితం శూన్యం

విజిలెన్స్‌ విచారణకు ఉద్యోగుల సంఘాల డిమాండ్‌ 

అశ్వారావుపేట: ఆయిల్‌ఫెడ్‌లో అవినీతికి అధికారులు మరో కుట్రకు తెరలేపారు. ప్రైవేట్‌ కంపెనీలతో కుమ్మక్కైన కొందరు అధికారులు ఆయిల్‌పాం రైతుల పొట్టకొట్టేందుకు వ్యక్తిగత ప్రణాళికలను అమల్లోకి తెచ్చారు. ఆయిల్‌ రికవరీని తగ్గించడం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థ అయిన తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌పై పర్యవేక్షణను ఆంధ్రాలోని ప్రైవేట్‌ కంపెనీల చేతుల్లోకి తీసుకెళ్తున్నారు. గమనించిన రైతు సంఘం నాయకులు అవినీతి అధికారుల తీరుపై పోరుకు సిద్ధమవుతున్నారు. రైతు సంఘం నాయకుల్లో సమన్వయం లేకపోవడంతో అవినీతి అధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతున్నదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రైవేట్‌ కంపెనీలతో అధికారులు కుమ్మక్కైనట్లు గమనించిన రిటైర్డ్‌ అధికారులు ఆయిల్‌ రికవరీ తగ్గుదలపై ముందుగానే హెచ్చరిస్తూ ఆయిల్‌ఫెడ్‌కు లేఖ రాశారు. అయినా స్పందన లేకపోవడంతో అనుకున్నట్లుగా ఆయిల్‌ రికవరీ శాతం తగ్గింది. ఈ వ్యవహారం వెలుగులోకి రావటంతో కలెక్టర్‌ ఎంవీ రెడ్డి విచారణకు ఆదేశించారు. ట్రైనీ కలెక్టర్‌ అనుదీప్‌ను విచారణాధికారిగా నియమించారు. కొద్దిరోజులకే ఆయిల్‌ఫెడ్‌ నుంచి ఉన్నతాధికారుల బృందం కూడా వచ్చి విచారణ చేపట్టింది. అయితే అవినీతి బహిర్గతం కావాలంటే విజి లెన్స్‌ విచారణ చేపట్టాలని పబ్లిక్‌ సెక్టార్‌ ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేసింది. ఆయిల్‌ఫెడ్‌ ఎండీకి లేఖ రాసింది. 

అసలేం జరిగిందంటే..

ఆయిల్‌పాం గెలల ధరను సంస్థ క్రూడాయిల్‌ రికవరీ, ఉప ఉత్పత్తుల ఫార్ములా ప్రకారం నిర్ణయిస్తారు. గెలల ధరలో ఆంధ్రా, తెలంగాణ మధ్య టన్నుకు సుమారు రూ.600 నుంచి రూ.800 వరకు వ్యత్యాసం ఉంది. ఆంధ్రాలో ధర తెలంగాణ కంటే తక్కువగా ఉండడంతో ఆ రాష్ట్ర రైతులు తెలంగాణలో ఇచ్చే కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ప్రైవేట్‌ కంపెనీలు వందల కోట్ల ఆదాయం కోల్పోతున్నాయి. ఈ ఆదాయాన్ని కోల్పోకుండా కుట్ర పన్నాయి. టీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌ను మభ్యపెట్టి సంస్థ ఫ్యాక్టరీల్లో ఆయిల్‌ రికవరీని తగ్గిస్తే తమ ఆదాయాన్ని కాపాడుకోవచ్చనే ఆలోచనకు వచ్చాయి. వెంటనే టీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌లోని కొందరు అధికారులను ప్రలోభాలకు గురిచేశారనే ప్రచారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మార్చి నెలకు గాను ఆయిల్‌ రికవరీ శాతం ఏకంగా 2.5 శాతానికి తగ్గింది. దీంతో తెలంగాణ రైతుల అనుమానాలకు బలం చేకూరింది. ఇప్పటికే రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు జూపల్లి రమేశ్‌ నేతృత్వంలో రైతులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఫ్యాక్టరీని సందర్శించి క్రషింగ్‌ తీరు, ఆయిల్‌ రికవరీ తగ్గుదల అంశాలపై అధ్యయనం చేశారు. 

పొంతన లేని అధికారుల వివరణ

ఆయిల్‌ రికవరీ తగ్గుదలపై ఆయిల్‌ఫెడ్‌ ఉన్నతాధికారుల వివరణలకు పొంతన ఉండడం లేదు. పచ్చి గెలలు, కాండం ఎక్కువ, లేత తోటల వల్ల ఆయిల్‌ రికవరీ తగ్గిందంటూ సంస్థ జీఎం సుధాకర్‌రెడ్డి సమాధానమిచ్చారు. దీనిని రైతులు తోసిపుచ్చారు. గెలలను తెల్ల దోమ ఆశిస్తున్నదంటూ ఉన్నతాధికారులు మరో కారణం చెప్పారు. దీనిపైనా రైతులు సందేహాలు వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ కంపెనీలతో కుమ్మక్కైన అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఆయిల్‌ రికవరీ శాతాన్ని తగ్గించారని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో అవినీతి కుట్రను ఛేదించేందుకు విజిలెన్స్‌ విచారణ జరపాలని తెలంగాణ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బీ.రాజేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ నెల 13న లేఖ రాశారు. ఈ విషయాలపై ఆయిల్‌ఫెడ్‌ జీఎం సుధాకర్‌రెడ్డిని వివరణ కోరగా ఆయిల్‌ రికవరీ తగ్గుదలపై వస్తున్న ఆరోపణలన్నీ అపోహలేనంటూ కొట్టిపారేశారు.