సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - May 28, 2020 , 01:01:41

ఆశల సం‘పత్తి’

ఆశల సం‘పత్తి’

  • ‘కాటన్‌'పై రైతుల ఆసక్తి
  • భద్రాద్రి జిల్లాలో ఏటికేడు పెరుగుతున్న విస్తీర్ణం
  • సీసీఐ ఆధ్వర్యంలో ఈ ఏడాది 2.77 లక్షల క్వింటాళ్ల కొనుగోళ్లు 
  • వానకాలంలో 1.83 లక్షల ఎకరాల్లో సాగుకు సన్నాహాలు

నియంత్రిత సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి       సారించింది.. డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేసి లాభాలు అర్జించాలని ప్రణాళికలు రూపొందించింది.. ఈ వానకాలం నుంచి పత్తి సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించింది.. అందుకు అనుగుణంగా భద్రాద్రి జిల్లా రైతులు సన్నద్ధమవుతున్నారు.. వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకు దుక్కులు  సిద్ధం చేసుకుంటున్నారు..    

కొత్తగూడెం: నియంత్రిత పంటల సాగుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడంతో రైతులు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది  ఎక్కువగా పత్తి సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూ పుతున్నారు. గత ఏడాది సాధారణ విస్తీర్ణం కంటే 127 శాతం అత్యధికంగా పత్తి వేశారు. 2019లో 1,16,193 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా 1,53,328 ఎకరాల్లో పంట సాగు చేయగా 2,77,650 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. 

 కొనుగోలు చేసిన సీసీఐ...

      పత్తి విస్తారంగా సాగు చేయడంతో రైతులకు అదే స్థాయిలో దిగుబడి వచ్చింది. పండిన పంటను విక్రయించేందుకు ప్రభు త్వం సీసీఐ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది 2.77 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. ఇప్పటికీ రైతుల వద్ద మిగిలిన పత్తిని కొనుగోలు చేసేందుకు జిల్లా కేంద్రం పరిధిలోని సుజాతనగర్‌ జిన్నింగ్‌ మిల్లులో విక్రయాలు జరిపేందుకు అనుమతించింది. 9,639 మంది రైతులు పత్తిని విక్రయించగా రూ.151.59 కోట్ల నగదును సీసీఐ రైతులకు వారి ఖాతాల్లో జమ చేసింది. వానకాలం సీజన్‌లో భారీ స్థాయిలో పత్తిసాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటి నుంచే పంట పొలాలను సిద్ధం చేసుకొని విత్తనాలు రెడీ చేసుకుంటున్నారు. 

48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ

     సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి విక్రయించి రైతులకు 48 గంటల్లోనే వారి వారి బ్యాంకు ఖాతాల్లో అధికారులు నగదు జమ చేస్తున్నారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి పారదర్శకంగా వే బ్రిడ్జి కాంటాతో పత్తిని తూకం వేసి రైతులకు గిట్టుబాటు ధర లభించే విధంగా అధికారులు కొనుగోలు చేస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని విషయాలను వివరిస్తూ వారి వద్ద నుంచి బ్యాంకు పాస్‌బుక్‌ జిరాక్సులను తీసుకొని నగదును వారి ఖాతాల్లోకి జమ  చేస్తున్నారు. మద్దతు ధర రూ.5 వేలు ఉండటంతో రైతుల కష్టాలు తీరాయి. ఇప్పటికే మిగిలిన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయాలు చేస్తున్నారు. 

  మరింత సాగు చేస్తాం ..

       ఎన్ని పంటలు వేసినా చీడపీడలు, తెలియని వ్యాధులు సోకి నష్టం వస్తోంది. పత్తి పంటను మం చిగా కాపాడుకుంటే లాభాలు బాగా నే ఉంటున్నాయి. అందువల్లనే ఈ ఏడాది కూడా పత్తి పంట వేయాలని నిర్ణయించుకున్నాం. కొనుగోలు కేం ద్రాలు దగ్గరలోనే ఉన్నాయి. ఎవ రూ కొనుగోలు చేయాల్సిన అవసరం లేకపోయినా నేరుగా సీసీఐ కొ నుగోలు చేయడం వల్ల మార్కెట్‌ ధర కంటే ఎక్కువగానే సీసీఐ కొనుగోలు చేస్తుంది. అందువల్ల సీసీఐ కేంద్రంలోనే ప్రతి ఏటా విక్రయిస్తాం.

-భూక్యా రాములు, రైతు, సర్వారం

పంట మార్పిడితో అధిక దిగుబడులు

      పంటలు మార్చడం వల్ల అధిక ది గుబడులు వస్తాయి. ఒక్కో సారి మిర్చి, మరో సారి పత్తి, మొక్కజొన్నలు, జొన్న పంటలు వేయడం వల్ల దిగుబడులు పెరుగుతున్నాయి. అందువల్ల ఈ సారి పత్తి పంట వేయాలని అనుకుంటున్నాను. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనల మేరకు పత్తి పంటను వేసి లాభాలు సాధిస్తాను. ప్రతి రైతు పంట మార్పిడి విధానాన్ని అలవాటు చేసుకోవాలి. అధికారులు సూచించిన పంటలు వేయడం వల్ల దిగుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ సారి వ్యవసాయ అధికారులు ఏది చెప్తే అదే సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.

- భూక్యా భీముడు, రైతు, సీతంపేట

పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి..

లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లను తిరిగి ప్రారంభించాం. జిల్లా కేం ద్రం సమీపంలోని మంజిత్‌ కాటన్‌ జి న్నింగ్‌ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రం ద్వారా కొనుగోలు చేస్తున్నాం. రైతుల వద్ద మిగిలిన పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది అత్యధికంగా రూ.151.59 కోట్ల విలువైన పత్తిని కొనుగోలు చేశాం. రైతుల ఖాతాల్లో సొమ్ము జమ అయ్యింది. గత ఏడాది కంటే మూడు రెట్లు దిగుబడి వచ్చింది. 

- నరేందర్‌,  జిల్లా మార్కెటింగ్‌ అధికారి