శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - May 28, 2020 , 00:57:14

గలగలా గోదావరి

గలగలా గోదావరి

  • మేడిగడ్డ నుంచి కుమ్మరిగూడేనికి గోదారమ్మ
  • పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు నీటి విడుదల
  • దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద పెరిగిన నీటిమట్టం
  • 1.5 టీఎంసీల నీటి నిల్వ

ఎండాకాలం వచ్చిందంటే ఎడారిని తలపించే ఇసుక మేటలు..  అక్కడక్కడా పిల్ల కాలువలు.. తాగునీటికి ఇబ్బందులు.. పారిశ్రామిక  వాడలకు నీటి కష్టాలు.. నీటి జాడ కోసం వెతుకులాటలు.. దినదిన గండంగా పరిశ్రమల నిర్వహణ.. ఎప్పుడు వేసవి పోతుందా అని  ఎదురుచూపులు.... అయితే ఇది ఒకప్పుడు..!ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. ‘కాళేశ్వరం’ తెలంగాణ గొంతు తడుపుతున్నది.. నేలతల్లి దాహార్తి తీరుస్తున్నది.. ఈ వేసవికి మేడిగడ్డ నుంచి దుమ్ముగూడెం ఆనకట్టకు వడివడిగా గోదారమ్మ తరలివచ్చింది.. పారిశ్రామిక వాడల సమస్యలను పరిష్కరించింది.. తాగునీటి అవసరాలు తీరుస్తున్నది.. నిండు వేసవిలో నిండు కుండలా గోదారి తొణికిసలాడుతున్నది..

భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : వరదలా వచ్చిన గోదావరి తెలంగాణలో సుమారు 400 కిలోమీటర్లు పయనించి సముద్రం పాలవుతున్నా ఏనాడూ సమైక్య పాలకులు వాటిని ఒడిసిపట్టే ఆలోచన చేయలేదు. తలాపున గోదావరి పారుతున్నా సాగునీటికి వినియోగించుకునే పరిస్థితి లేకపోవడంతో వృథాగా సముద్రం పాలయ్యాయి. ఈ క్రమంలో స్వరాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టిన సీఎం కేసీఆర్‌ తెలంగాణ రైతాంగానికి మేలు చేసే దిశగా ఆలోచించి రాష్ట్రంలో కోటి ఎకరాలను సస్యశ్యామలం చేసే దిశగా అడుగులు వేసి బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి కృతకృత్యులయ్యారు. ప్రాజెక్టు ద్వారా వివిధ రిజర్వాయర్లకు నీటిని మళ్లించి తెలంగాణలోని వందలాది చెరువులను నింపి వేసవి కాలంలోనూ నిండుకుండల్లా మార్చారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కొన్ని క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసి పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. ఎన్నడూ లేని వి ధంగా మండుటెండలో దుమ్ముగూడెం వద్ద నీటి మట్టాన్ని పెంచుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు తాగునీటి కొరతను తీర్చారు. 

వరదను ఒడిసిపట్టిన తెలంగాణ సర్కార్‌..

మహారాష్ట్ర రాష్ట్రంలోని త్రయంబకేశ్వరం వద్ద పుట్టి వేలాది కిలో మీటర్లు ప్రయాణించి తెలంగాణలో అడుగిడిన గోదావరి నీటిని సముద్రంలో కలవకుండా ఒడిసిపట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలోని లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ వస్తోంది తెలంగాణ సర్కార్‌. ఇదే ఒరవడిలో ముందుకు సాగుతూ కాళేశ్వరానికి దిగువన దుమ్ముగూడెం వద్ద సీతమ్మ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించి పనులను చేసేందుకు సంసిద్ధమయ్యారు. వరదలా వస్తున్న గోదావరి నీటిని ఒడిసిపట్టి తాగు, సాగునీటి, పారిశ్రామిక అవసరాలకు వినియోగించడమే లక్ష్యంగా తెలంగాణ స ర్కార్‌ ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే కాళేశ్వరం నుంచి దిగువకు 1.5 టీఎంసీల నీటిని విడుదల చేశారు. దీంతో ఎప్పుడూ లేని విధంగా జిల్లాలోని దుమ్ముగూడెం వద్ద నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. 

దుమ్ముగూడెం వద్ద పెరిగిన నీటి మట్టం..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో దుమ్ముగూడెం వద్ద నీటి లభ్యత పెరిగింది. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద ఎన్నో ఏళ్ల క్రితం సర్‌ ఆర్దర్‌ కాటన్‌ నిర్మించిన దుమ్ముగూడెం ప్రాజెక్టుకు కాళేశ్వరం నుంచి విడుదల చేసిన నీరు చేరుకుంది. దీనిని అక్కడ ఉన్న భారజల కర్మాగారం (హెచ్‌డబ్ల్యూపీ) ఉపయోగించుకొనేందుకు అధికారులు నీటిని విడుదల చేశారు. మిషన్‌ భగీరథ పథకాన్ని వేసవి కాలంలో విజయవంతంగా నడిపి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు దుమ్ముగూడెం వద్ద అడుగంటిపోతున్న గోదావరి నీటి మట్టాన్ని పెంచేందుకు అధికారుల అభ్యర్థన మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు 1.5 టీఎంసీల నీటిని విడుదల చేశారు.

పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు వినియోగం..

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించకముందు గోదావరి పాయలుగా జీవనదిలా పారుతూ సముద్రంలో కలిసేది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దిగువకు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న నీటిని ఆనకట్ట ద్వారా ఒడిసిపట్టి దిగువకు వచ్చే నీటిని ఎగువకు లిఫ్ట్‌ల ద్వారా తీసుకెళ్తున్నారు. కోటి ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్నారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని దిగువకు విడుదల చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలైన సింగరేణి, భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌, కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌, సారపాకలోని ఐటీసీ తదితర పరిశ్రమలకు నీటిని అందిస్తున్నా రు. పది రోజులుగా మేడిగడ్డ నుంచి 6, 7 వేల క్యూసెక్కుల నీటి ని దిగువకు వదులుతూ మొత్తం 1.5 టీఎంసీల నీటిని దుమ్ముగూడెం వద్ద నిల్వ చేశారు. దీంతో జిల్లాకు సంబంధించిన మిషన్‌ భగీరథ పథకంతో సహా అన్ని పరిశ్రమలకు నీరు సమృద్ధిగా అందుతోంది.