గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - May 25, 2020 , 00:16:28

భూసారం పంటకు లాభం

భూసారం పంటకు లాభం

గ్రామాల్లో మట్టి నమూనాలు సేకరిస్తున్న అధికారులు

సారవంతమైన నేలలపై రైతులకు అవగాహన

పంటల సాగుపై పలు సూచనలు..

కొత్తగూడెం: భూమి సారవంతంగా లేకుంటే ఎంత మేలైన విత్తనాన్ని ఎంపిక చేసుకున్నా ఆశించిన దిగుబడులు రావు. రైతులు నేలల్లో ఉన్న వివిధ రకాలైన పోషకాల మోతాదును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా పంటల సాగు చేపట్టడంతో మంచి దిగుబడులు సాధించవచ్చని, భూసార పరీక్షల ద్వారా లోపస్థాయిలో ఉన్న పోషకాలన్నింటినీ గుర్తించి భూ ఉత్పాదకతను పెంచవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఒక్కసారి భూసార పరీక్షల ఫలిత పత్రం అందిన తరువాత 2నుంచి 3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని, దానికి అనుగుణంగా ఏటా పంటల మార్పుతో అధిక దిగుబడులు సాధించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే భూసార పరీక్షలపై గ్రామాల్లో అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వానకాలం పంటల సాగుకు సమయం దగ్గర పడుతుండడంతో మట్టి సేకరణ త్వరగా పూర్తి చేసి ఫలితాలను అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

సూచనలు తప్పక పాటించాలి ..

రైతులు భూసార పరీక్షలు చేయించుకొని అందుకు అనుగుణంగా శాస్త్రవేత్తలు సిఫార్సుల మేరకు ఎరువులు వాడితే మంచి దిగబడులు సాధించవచ్చు. భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా పోషకాలు తక్కువ మోతాదులో ఉంటే పైరుకు సిఫార్సు చేసిన మోతాదులో 30శాతం అధికంగా, అదే పోషకాలు ఎక్కువ మోతాదులో ఉంటే పైరుకు సిఫారసు చేసిన మోతాదులో 30 శాతం తక్కువగా ఎరువులు వాడాల్సి ఉంటుంది.

  -జీ.వీరన్న, కేవీకే కో ఆర్డినేటర్‌

మట్టి నమూనా సేకరణలో సూచనలు..

  •  భూసార పరీక్షలో తీసిన మట్టి పొలమంతటిని ప్రతిబింబించేదిగా ఉండాలి. 
  •  పొలంలో పంటలేని వేసవి సమయం మట్టి నమూనా సేకరణకు అనుకూలం.
  •  నేల స్వభాగం, వేసే పంట, నీటి వసతి, వాలు తనంలో ఉన్న తేడాలను బట్టి ప్రతి పొలానికి వేర్వేరు నమూనాలు సేకరించాలి. 
  •  పొలంలో వీ ఆకారంలో నాగలి చాలులా 15 సెంటీ మీటర్లు లోతు వరకు పారతో గుంత తీసి అందులో పై నుంచి కింది వరకు పొరలా ఒక పక్కకు మట్టిని సేకరించాలి. 
  •  ఎకరా విస్తీర్ణంలో 8 నుంచి 10 చోట్ల మట్టిని సేకరించి టార్పాలిన్‌పై కుప్పగా పోసి సమానంగా పరిచి నాలుగు భాగాలు చేయాలి. 
  •  అందులో ఎదురెదురు భాగాలు తీసుకొని మిగతా భాగాలను తీసివేయాలి. 
  •  అరకిలో మట్టి వచ్చే వరకు ఇలా భాగాలు చేయాలి. 
  •  రసాయన ఎరువులు వేసిన మూడు నెలల్లోపు నమూనాలు సేకరించరాదు. 
  •  పండ్ల తోటల్లో పోషక లోపాల గుర్తింపునకు, ఎకరానికి రెండు చోట్ల పంటను బట్టి 3 నుంచి 6 అడుగుల లోతు గుంత తవ్వి ప్రతి అడుగు నుంచి అరకిలో మట్టిని సేకరించి భూసార పరీక్షకు పంపాలి. 
  •  సేకరించిన మట్టి నీడలో ఆరిన తరువాత, పాలిథిన్‌ సంచిలో లేదా గుడ్డ సంచిలో నింపి, తమ సమీపంలోని భూసార పరీక్షా కేంద్రానికి పంపించాలి.