గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - May 25, 2020 , 00:16:30

ఈద్‌ ముబారక్‌..

ఈద్‌ ముబారక్‌..

నేడు  ఈద్‌-ఉల్‌-ఫితర్‌  

 ముగిసిన ఉపవాసాలు  

 ఇళ్లలోనే ఈద్‌ నమాజ్‌లు 

 భౌతిక దూరాన్ని పాటిస్తూ పండుగ చేసుకోవాలని మత పెద్దల పిలుపు

కొత్తగూడెం/ఖమ్మం కమాన్‌బజార్‌: ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెల, వరాల మాసం రంజాన్‌. చూస్తుండగానే అది గడిచిపోయింది. ఆకాశంలో ‘షవ్వాల్‌' నెల వంక కనిపించగానే ముస్లిం సోదరులు పులకించిపోయారు. సంబ్రమాశ్చర్యాలతో అల్లాహ్‌కు దువా చేశారు. సోమవారం ఉదయాన్నే రంజాన్‌ పండుగను పురస్కరించుకొని ‘ఈదుల్‌ ఫితర్‌' నమాజును జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని ముస్లింలు రాత్రి ఇళ్లల్లో ‘ఇషా’ నమాజు తర్వాత ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అత్యంత మహిమాన్విత నెల రంజాన్‌ తమకు ప్రసాదించినందుకు అల్లాహ్‌కు 

కృతజ్ఞతలు తెలిపారు. రంజాన్‌ మాసం తిరిగి తమ జీవితాల్లోకి వస్తుందో లేదో, తాము రానున్న రోజుల్లో రంజాన్‌ పవిత్రమాసాన్ని ఆస్వాదిస్తామోలేదోనని కన్నీటితో దువా చేశారు. మత పెద్దలు, ముఫ్తీ, మౌలీ, హాఫీజ్‌ మసీదుల్లో సుదీర్ఘంగా ప్రార్థనలు చేశారు. రంజాన్‌ మాసానికి బాధాతప్త హృదయాలతో ‘అల్‌విదా’ (వీడ్కోలు) పలికారు. భక్తిభావంతో మసీదుల్లో ఎత్తెకాఫ్‌ పాటించిన ముస్లింలు దానిని విరమించి తమ ఇళ్లకు చేరుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పండుగను చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. గతనెల 25 వ తేదీ నుంచి ప్రారంభమైన ఉపవాసాలు (రోజా) 30 రోజుల తర్వాత ముగిశాయి. రంజాన్‌ మాసంలోనే ముస్లింల అత్యంత పవిత్రగ్రంథం ఖురాన్‌ అవతరించినందువల్లనే ఈ నెలకు ఇంతటి ప్రాముఖ్యత వచ్చింది. ఉపవాసం (రోజా) మత ధర్మానికి నాలుగో స్తంభం వంటిది. ఈ మాసంలో రోజాతో పాటు ఎత్తెకాఫ్‌, ఫిత్రా, జకాత్‌ వంటివి పాటించారు. ఆకలి దప్పుల బాధలేమిటో తెలుసుకొని తమకు చేతనైనంత వరకు పేదలకు దాన ధర్మాలు చేస్తారు. వేయి నెలల రాత్రుల కన్నా మిన్న అయినటువంటి షబ్‌-ఎ-ఖద్‌న్రి సొంతం చేసుకున్నారు. దివ్య ఖురాన్‌ పఠనంతో పాటు ప్రతిరోజూ తరావీహ్‌ నమాజ్‌ను ఆచరించారు. మహిళలు నమాజ్‌లు చేసి రోజాను పాటించారు. 

దుస్తుల దుకాణాల్లో సందడి 

రంజాన్‌ పండుగ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పట్టణాల్లో సందడి వాతావరణం కన్పించింది. ఖమ్మంలోని కమాన్‌బజార్‌, స్టేషన్‌రోడ్‌, కస్బాబజార్‌లోని అన్ని బట్టల దుకాణాలు కొనుగోలుదారులతో నిండిపోయి సందడిగా మారాయి. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు, భద్రాచలం, సత్తుపల్లి, మధిరలో కూడా పండుగ వాతావరణం నెలకొంది. పెద్దలు, పిల్లలు కొత్త బట్టల కోసం ఉత్సాహాన్ని కనబరిచారు. సేమియా, డ్రైప్రూట్స్‌ లాంటి షాపుల్లో రద్దీ కనిపించింది. 

ఇళ్లలోనే నమాజ్‌లు 

ఉమ్మడి జిల్లాలోని ముస్లిం సోదరులు ఈద్‌-ఉల్‌- ఫితర్‌ నమాజ్‌ను ఇండ్లలో చేసుకోవాలని ఢిల్లీలోని జామా మస్జీద్‌ షాహీ ఇమామ్‌ అహ్మద్‌ షా బుఖారీ తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ఈద్‌ నమాజ్‌, పండుగ వేడుకలను ఇళ్లలోనే జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాంతో పాటు ముస్లింలు ఈద్‌ నమాజ్‌ తరువాత ఆలింగనం కూడా చేసుకోకుండా భౌతిక దూరం పాటించాలని సూచించారు. 30 రోజుల పాటు ఉపవాసాలు పాటిస్తూ ఐదు పూటలా నమాజ్‌లు, 20 రకాల తరావి నమాజ్‌లు ఇళ్లలోనే చేసుకున్నారని ఆయన తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వం విధించిన ఆదేశాలను తప్పకుండా పాటించాలని కోరారు.

ఇంటి వద్దనే ప్రత్యేక ప్రార్థనలు  

రంజాన్‌ ఉపవాసాలు మనిషిలో మానవత్వ విలువలను పెంపొందిస్తాయి. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడితే యావత్‌ మానవాళి ప్రాణాన్ని కాపాడినట్లే. ఒక మనిషి ప్రాణాన్ని తీస్తే యావత్‌ మానవాళి ప్రాణం తీసినట్లే అని ఖురాన్‌ బోధిస్తోంది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ఈ సమయంలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి ఎవరికైనా ప్రాణహాని కలిగిస్తే యావత్‌ మానవాళికీ హాని చేసిన పాపం కలుగుతుంది. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ ఇంటివద్దనే దైవ ఆరాధన విశ్వమానవాళిని కరోనా కబంధ హస్తాల నుంచి కాపాడాల్సిందిగా దేవుణ్ని కోరుకుంటున్నాం. - అబ్దుల్‌ బాసిత్‌, జేఐహెచ్‌ అధ్యక్షుడు, కొత్తగూడెం