శనివారం 06 జూన్ 2020
Badradri-kothagudem - May 22, 2020 , 00:05:57

నిప్పుల కొలిమి

నిప్పుల కొలిమి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

రోజురోజుకూ పెరుగుతున్న పగటి పూట వేడి..

బయటికు రావడానికి భయపడుతున్న ప్రజలు

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి

కర్ఫ్యూను తలపిస్తున్న పట్టణ రహదారులు, ప్రధాన కూడళ్లు

భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ఖమ్మం: ఉమ్మడి      ఖమ్మం జిల్లా నిప్పుల కుంపటిని తలపిస్తుంది. వేసవి ప్రారం భం నుంచే దంచికొడుతున్న ఎండలు మే నెల మూడోవారం వచ్చేసరికే భగ్గుమంటున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో చాలా మంది ఉదయం నిత్యావసర వస్తువులకు మినహా ఎవ్వరూ 11 గంటలు దాటిన తర్వాత  బయటికి రాలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు తిరుగుతున్నా వేడిగాలి కారణంగా ఉక్కపోతతో ప్రజలు నీరసించిపోతున్నారు. ఎండల తీవ్రతతో రహదారులు నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. 

ఉదయం 7 గంటల నుంచే సూర్యభగవానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు అంతకంతకూ  పెరుగుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు 38-40 డిగ్రీల వరకు ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 43, 44 డిగ్రీలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఉష్ణోగ్రతల దాటికి జనం బెంబేలెత్తుతున్నారు. ఎండ వేడిమి నుంచి కాపాడుకునేందుకు ప్రజలు స్థోమతను బట్టి ఏసీలు, కూలర్లు, శీతల పానియాలను ఆశ్రయిస్తున్నారు. అత్యవసర పనులకు తప్ప ప్రజలు బయటకు రావడం లేదు.పనుల మీద బయటకు వస్తున్న వారు టోపీలు, హెల్మెట్లు, చేతిరుమాలు కట్టుకుని ఎండవేడిమి నుంచి రక్షణ పొందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి బొగ్గుగనులు ఉండడంతో ఇక్కడ  అధికంగా ఉష్ణోగ్రతలు  నమోదవుతున్నాయి.

అల్లాడిపోతున్న జనం...

రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. పెరిగిన ఎండలను దృష్టిలో ఉంచుకుని చిన్నారులు, పెద్దలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఉదయం 6గంటలకే ప్రారంభమవుతున్న ఎండ ప్రతాపం 10 గంటలకే మిట్ట మధ్యాహ్నాన్ని తలపిస్తుంది. 12, ఒంటిగంట కల్లా భానుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుండడంతో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం పట్టణాల్లో సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ గనులు ఉండడం ఆయా ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగా ఉన్నాయి.  పల్లెలు, పట్టణాలు కాంక్రీట్‌ జంగిల్స్‌గా మారాయి. గ్రామీణ ప్రాంతాలలో చెట్ల నరికివేత కారణంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఎక్కడా కానరావడం లేదు. అడవులు అంతరించటం, బీడు భూములన్నీ వ్యవసాయ భూములుగా మార్చేందుకు చెట్లను నరికివేయడంతో గ్రామాల్లోనూ ఎండ తీవ్రత అధికంగానే ఉంటుంది. వారం రోజుల నుంచి గ్రామాల్లో వ్యవసాయ, ఉపాధిహామీ  పనులన్ని మధ్యాహ్నం లోపే జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు పొలాలకు, ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలు మధ్యాహ్నం 12 గంటలకే ఇల్లు చేరుతున్నారు. భానుడి ఉగ్ర రూపానికి పశుగ్రాసం ఎండిపోయి పశువులకు మేత దొరికే పరిస్థితులు దాపురించాయి. 

నిరంతర కరెంట్‌తో ఉపశమనం..

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఎలాంటి కోతలు లేకుండా 24గంటలు కరెంట్‌ను సరఫరా చేస్తోంది. ఫలితంగా సూర్యభగవానుడి కురిపిస్తున్న నిప్పుల వర్షం నుంచి జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. పట్టణ, గ్రామీణ ప్రజలు వారిస్థాయికి తగ్గట్లుగా కూలర్లు, ఏసీలను కొనుగోలు చేసుకుని ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు. పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకునే నిరు పేదలు రాత్రిపూట ఫ్యాన్‌ వేసుకుని కంటి నిండా నిద్రపోతున్నారు. 

 పాల్వంచలో 47 డిగ్రీలు.. 

జూలూరుపాడు/పాల్వంచ:పాల్వంచ పట్టణంలో గురువారం 47 డిగ్రీలు,జూలూరుపాడు మండలంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

జాగ్రత్తలు పాటించాలి..

ఎండల తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దంటు న్నారు. వడదెబ్బ లేదా ఇతర జబ్బులకు గురైతే ప్రాణాలు సైతం కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. వడదెబ్బ తగిలితే ఎండవేడిమితో శరీరం డిహైడ్రేషన్‌కు గురై వాంతులు, విరేచనాలు, జ్వరం, ఫిట్స్‌, తలతిరగటం లక్షణాలు కనిపిస్తాయని, వెంటనే గుర్తించి ప్రాథమిక చికిత్స చేయించుకోవాలని, ఆతర్వాత ప్రధాన వైద్యులకు చూపించాలని సలహా ఇస్తున్నారు. వడదెబ్బ తగులకుండా ఉండేందుకుగాను రోజుకు మూడు నుంచి ఆరు లీటర్ల నీళ్లు తాగాలని, ప్రధానంగా మధ్యాహ్నం ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని, ఒకవేళ తప్పనిసరి పరి స్థితుల్లో వెళ్లాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని సూచి స్తున్నారు. శరీరంపై ఎండ పడకుండా చూసుకోవాలని, నెత్తికి టోపీ, కాటన్‌ బట్టలు, కళ్లకు అద్దాలు పెట్టుకుంటే వడదెబ్బ నుంచి తద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చంటున్నారు. శీతల పానీ యాలకు బదులు పండ్ల రసాలు, కొబ్బరి బొండాలు తాగితే ఉపయోగకరంగా ఉంటుందని సలహా ఇస్తున్నారు. 


logo