మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - May 21, 2020 , 03:12:10

భద్రాచలం..వలస జీవుల సంగమం

భద్రాచలం..వలస జీవుల సంగమం

 మూడు రాష్ర్టాల కూడలిగా భద్రాద్రి

 లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రాకు వెళ్తున్న కూలీలు

 అనేక రవాణా మార్గాల ద్వారా స్వరాష్ర్టాలకు..

 పక్కాగా థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ భద్రాచలం : కరోనా వైరస్‌ నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌తో స్వస్థలాలకు పయనమైన వలస కార్మికులకు ఆంధ్రప్రదేశ్‌ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అనుమతి ఉన్నప్పటికీ చెక్‌పోస్ట్‌ వద్ద ఆంధ్రా అధికారులు రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అంగీకరించటంలేదు. ఆంధ్రప్రదేశ్‌ మీదుగా ఇతర రాష్ర్టాలకు వెళ్లే వలస కార్మికులను మాత్రం పంపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను అను మతించకుండా నేరుగా క్వారంటైన్‌కు అంగీకరిస్తే తరలిస్తున్నారు. క్వారంటైన్‌లో 14రోజులు ఉన్న తర్వాత ఇంటి వద్దకు పంపి మరో 14రోజులు హోం క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. 5వ తేదీ నుంచి నేటి వరకు 512 వాహనాల్లో 6,620 మంది తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, కర్నాటక నుంచి ఆం ధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌, జార్ఖండ్‌ వెళ్లేందుకు అశ్వారావుపేటలోని తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్ట్‌కు చేరుకున్నారు. వీరిలో 249 వాహనాల్లో 5,482 మంది వలస కార్మికులు ఒడిశా, జార్ఖండ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌కు వెళ్లారు. లాక్‌డౌన్‌కు ముందు 263 వాహనాల్లో బయలుదేరిన 1,138 మంది వలస కార్మికులు 36 ప్రాంతాల్లోనే నిలిచిపోయారు. అదేవిధంగా 205 వాహనాల్లో 742 మంది ఇతర రాష్ర్టాల నుంచి అశ్వారావుపేట మీదుగా తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ర్టాలకు చేరుకున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లటానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం తెలంగాణ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అయినా ఆంధ్రాలోని అక్కడి అధికారులు అనుమతించకుండా క్వారంటైన్‌కు అంగీకరించిన ప్రయాణికులను ఐసోలేషన్‌కు తరలిస్తున్నారు. అంగీకరించని ప్రయాణికులను తిరిగి వెనక్కి పంపుతున్నారు. తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్ట్‌ వద్ద వలస కార్మికులు, ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేసి పంపుతున్నారు.

అన్ని రాష్ర్టాల వారికి ఆదరణ..

భద్రాచలం మూడు రాష్ర్టాలకు కూడలిగా ఉండటంతో అధికారులు రెండు ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పట్టణానికి చేరుకునే ముందు బ్రిడ్జి సెంటరు వద్ద ఏపీ సరిహద్దు ప్రాంతంలో మరో చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఆయా చెక్‌పోస్టుల వద్ద రాకపోకలు సాగిస్తున్న వారి వివరాలు నమోదు చేసి థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టులు చేస్తున్నారు. ఈ చెక్‌పోస్టుల్లో రెవెన్యూ, వైద్య, పోలీసు శాఖకు చెందిన ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఆటోలు, లారీలు, మినీ వ్యాన్‌లు తదితర వాహనాల ద్వారా వలస కూలీలు తమ స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. ఇప్పటి వరకు 13 వేల మంది ఈ మార్గం ద్వారా వెళ్లినట్లు చెక్‌పోస్టు అకారులు తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు ప్రారంభం కావడంతో పెద్ద మొత్తంలో వలస కూలీలు భద్రాచలం మీదుగా ఆయా రాష్ర్టాలకు తరలివెళ్లే అవకాశం ఉంది. వలస కూలీలకు భద్రాచలంలో స్వచ్ఛంద సంస్థలు సేవలు అందిస్తున్నారు. భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆదేశాలతో భద్రాచలం పట్టణంలో ప్రత్యేక అధికారులు వలస కూలీల వివరాలు సేకరించడమే కాకుండా వారిని సురక్షితంగా  గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

గోవా నుంచి కాలినడకన భద్రాద్రికి..

ఒడిశాకు చెందిన వలస కూలీలు గోవాలో బిల్డింగ్‌ వర్క్‌ పనుల నిమిత్తం వెళ్లారు. కరోనా లాక్‌డౌన్‌తో అక్కడే చిక్కుకుపోయారు దీంతో ఎనిమిది మంది గోవా నుంచి వలస కూలీలు కాలినడకన మంగళవారం ఉదయం భద్రాచలం చేరుకున్నారు. తమది ఒడిశాలోని జింజరగూడెం గ్రామమని తెలిపారు. బిల్డింగ్‌ పనుల నిమిత్తం గోవా వెళ్లామని లాక్‌డౌన్‌తో చేసే గత్యంతరం లేక, వేరే మార్గం లేక గోవా నుంచి ఈనెల 4న కాలినడకన బయలుదేరి 12 రోజుల పాటు నడిచి భద్రా చలం చేరుకున్నామన్నారు. మార్గంమధ్యలో ఎందరో దాతలు తమకు ఆహారం అందజేశారన్నారు. భద్రాచలం చేరుకున్న వలస కూలీలకు బ్రిడ్జి సెంటర్లో చెక్‌పోస్టు వద్ద వైద్యాధికారులు థర్మల్‌ స్త్రీనింగ్‌ పరీక్షలు చేశారన్నారు. పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయంలో ఆహారం అందించారన్నారు. అనంతరం ఆటోలో స్వరాష్ర్టానికి బయల్దేరారు.