మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - May 21, 2020 , 03:12:11

వేసవి అదును సాగుకు పదును

వేసవి అదును సాగుకు పదును

దుక్కులనుసిద్ధం చేసుకుంటున్న రైతులు

వేసవి దుక్కులతో తేమ, భూసారం అభివృద్ధి

కలుపు నివారణకు మరింత దోహదం 

కొత్తగూడెం/ఖమ్మం వ్యవసాయం: వానకాలం సాగుకు రైతన్నలు సమాయత్తమవుతున్నారు. వా నలు రాకముందే  దుక్కులు  సిద్ధం చేసుకునే  పని లో పడ్డారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా పొలాలకు పెంట తోలడం, దుక్కులు దున్నడం కనిపిస్తోంది.  అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకుని తెల్లవారగానే పొలంబాట పడుతున్నారు. పొలాలన్నీ రైతన్నలు,కూలీలతో సందడిగా కన్పిస్తున్నాయి.వ్యవసాయశాఖ ఇప్పటికే  విత్తనాలను కూడా సిద్ధం చేసింది.  లాభసాటి వ్యవసాయం చేయాలని ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేయడంతో రైతులు కూడా అదే పద్ధతిలో సాగుచేసేందుకు సిద్ధం అవుతున్నారు. నియంత్రిత సాగుతో  ఈ ఏడాది రైతన్న ఇంట సిరుల పంట పండనుంది. అన్నదాత లోగిళ్లు ఆనందమయంకానున్నాయి.. వానకాలం సీజన్‌ ప్రారంభం కాబోతున్న సమయంలో పంటను వేసే ముందు వేసవి దుక్కులను దున్నుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు వ్యవసాయశాఖ అధికారులు. చాలా మంది రైతు లు వానకాలం, యాసంగిలో  పంట వచ్చాకా మ ళ్లీ వర్షాకాలం వరకు భూమిని దున్నకుండా వదిలివేయటంతో కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి సత్తువలేకుండా పోతుంది. మరికొద్ది రోజుల్లోనే సీజన్‌ ప్రారంభం కాబోతున్నందున వేసవి దుక్కులను దున్నుకున్నైట్లెతే భూసారం పెంచుకోవడమే కాకుండా తెగుళ్లు,కలుపు నివారణకు ఉపయోగకరంగా ఉంటుంది.

కలిగే ప్రయోజనాలు ...

చాలా మంది రైతులు పంటకోత అనంత రం పొలాన్ని అలానే వదిలివేస్తుంటారు. దీంతో తొలకరి వర్షాలు పడగానే నీరు భూమిలోకి ఇంకిపోకుండా బయటకు వెళుతుంది.  వర్షాలకు ముందే భూమిని దున్నటం వల్ల తొలకరి వర్షాలు పడగానే నీరు భూమిలోకి ఇంకి భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. లోతు దుక్కుల వల్ల భూమిపై పొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. ఇలా చేయటం వల్ల భూమిలో తేమశాతం పెరిగి, భూసార అభివృద్ధి, పురుగులు, కలుపు మొక్కల నివారణ వగైరా ప్రయోజనాలు సమకూరుతాయి. వేసవి దుక్కులు దున్నే ముందు పశువులు పెంటపోగు, కంపోస్టు ఎరువు, మట్టిని వెదజల్లడం ద్వారా సారవంతమైన పంట దిగుబడితో పాటు తేమశాతం  పెరుగుతుంది.

భూసారాభివృద్ధిలో  కీలకపాత్ర... 

వేసవిదుక్కులు లోతుగా, వాలుకు అ డ్డంగా దున్నుకోవాలి. వాలుకు అడ్డంగా దున్నుకోవడం వల్ల వాన నీరు భూమిలోకి ఇంకేందుకు అనుకూలంగా ఉంటుంది. భూ మికి ఎక్కువ తేమను గ్రహించి నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. దీని ప్రభావం పంట దిగుబడిపై కనిపిస్తుంది. వేసవి దుక్కు లు దున్నేముందు పొలంలో గొర్రెలను, పశువుల మందలు తోలటం వల్ల అవి విసర్జించే వ్యర్థాలు భూమిలోకి చేరి సేంద్రియ ఎరువు  తయారవుతుంది. సాధారణంగా రైతులు పంట చేతి కందగానే పంటల నుంచి వచ్చే ఎండు ఆకులు, చెత్త, చెదారం కాల్చివేస్తారు. అలా కాల్చడం వలన భూసారం తగ్గే అవకాశం ఉంది. లోతు దుక్కులు చేయటం వల్ల  చెత్తాచెదారం నేల పొరల్లో కలిసి పోయి చీకి ఎరువుగా మారి భూసారం పెరిగి పంటకు కావాల్సిన పోషక పదార్థాలు లభిస్తాయి.

తెగుళ్ల నివారణలో కీలకపాత్ర..

వేసవికాలంలో చాలా వరకు భూమి ఖాళీగా ఉంటుంది. ఈ క్రమంలో పంటలను ఆశించే అనేక రకాల పురుగులు నేల, చెత్తాచెదారం, కొయ్య కాడల్లో జీవిస్తాయి. తెగుళ్లను కలుగజేసే శిలీంధ్రాలు భూమిలోపల ఆశ్రయం పొందుతాయి. వీటి శిలీంధ్ర బీజాలు భూమిలో నిల్వ ఉంటాయి. వేసవి లోతు దుక్కుల వల్ల నిద్రావస్థ దశలో భూమిలో ఉన్న చీడ పురుగుల కోశాలు, గుడ్లు, లార్వాలు, గుడ్లను పక్షులు, కొంగలు, కాకులు, తిని నాశనం చేస్తాయి. అదే విధంగా వేసవి దుక్కల వల్ల భూమిలోపల పొరల్లో ఉన్న శిలీంధ్ర బీజాలు మట్టితోపాటు నేలపైకి వస్తాయి. ఇవి అధిక ఉష్ణోగ్రతతో వ్యాధి కలుగజేసే శక్తిని కోల్పోతాయి.

వేసవి దుక్కులతో కలుపు నివారణ..

రైతులు సాధారణంగా  సీజన్‌కు ముందు గా వేసవి దుక్కులను తయారు చేసుకోకపోవడంతో కలుపు నివారణకు అదనపు భారం పడుతుంది.పంటలేని సమయంలో కలుపు మొక్కలు పెరుగుతాయి. ఈ కలుపు మొక్క లు నేలలోని నీరు, పోషకాలను ప్రత్యక్షంగా గ్రహించి పంట దిగుబడిని తగ్గిస్తాయి. అంతే కాకుండా  అనేక రకాల పురుగులకు, శిలీంధ్రాలకు ఆశ్రయాన్ని కల్పించటం ద్వారా పరోక్షంగా పంటనష్టానికి కారణమవుతాయి. కాబట్టి వేసవి లోతు దుక్కుల వల్ల లోతుకు పాతుకుపోయిన కలుపుమొక్కలు వాటి విత్తనాలు నేలపై పొరల్లోకి చేరటం వల్ల అధిక ఉష్ణోగ్రతకు గురై నశిస్తాయి. దీనివల్ల తదుపరి పంటలో కలుపుతాకిడి తక్కువగా ఉంటుంది. రైతుకు కూలీల ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది.

లాభాలు ఎక్కువ.. మంచి దిగుబడి

     వానకాలం పంటకు ముందుగానే ప్రతి రైతు వేసవి దుక్కులు చేయాలి. దీని వల్ల భూమిలో గుళ్లశాతం పెరిగి వాన కురిసిన తరువాత భూమి మెత్తగా అవుతుంది. దీనివల్ల ఏ పంట వేసిన, వేసవి దుక్కిన చేసిన పొలాల్లో మంచి దిగుబడి వస్తాయి. ప్రతి ఏడాది రైతులు దీనిని ఆచరిస్తున్నారు. ఇలాంటి పద్ధతి ఆచరించడం మంచిది. దుక్కులు దున్నేముందు తప్పనిసరిగా ఏదో ఒక రకమైన ఎరువు వేయాలి. సేంద్రియ ఎరువు అయినా, యూరియా అయినా వేసి దుక్కులు చేసుకోవాలి. రైతులకు లాభం వచ్చే పంటలు వేసేందుకు

పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం

ఏ రైతు ఎలాంటి పంట సాగు చేయాలి అనేది స్పష్టమవుతుంది. రైతుబంధు సమితులు సమన్వయంతో వ్యవసాయ అధికారులు ఆయాప్రాంతాలను బట్టి పంటల సాగుపై కార్యాచరణ చేస్తున్నాము. అందరూ ఒకే రకం పంట వేయడం వల్ల రైతులు నష్ట పోతారు. అందువల్ల లాభసాటి పంటలు వేయాలని ప్రభుత్వం చెబుతుంది. దానికనుగుణంగా పంటలు వేయాల్సి ఉంటుంది. అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు వస్తాయి.

-కొర్సా అభిమన్యుడు,ఏ ఝాన్సీలక్ష్మీకుమారి, భద్రాద్రి కొత్తగూడెం,ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ అధికారులు