ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - May 21, 2020 , 03:12:12

పట్టాలెక్కిన జన జీవనం

పట్టాలెక్కిన జన జీవనం

 సాధారణ జీవన శైలిలోకి సామాన్యుడి అడుగు

 తెరుచుకున్న వ్యాపార సముదాయాలు

 సుదీర్ఘ విరామం తర్వాత పనులు షురూ

 ఖమ్మం జిల్లా అంతటా సందడి

ఖమ్మం, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌తో జనజీవనం స్తంభించింది. కరోనా నియంత్రణ చర్యలను ప్రభుత్వం పకడ్బందీగా చేపట్టడంతో జిల్లాలోని ఆర్థిక వ్యవస్థ నిలిచిపోయింది. వ్యాపార వర్గాలు కుదేలయ్యాయి. సుమారు నెలన్నరకు పైగా క్రయవిక్రయాలు, రవాణా వ్యవస్థ స్తంభించడంతో పాటు ప్రజలు స్వీయనిర్బంధంలోకి వెళ్లడంతో అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలతో కూడిన సడలింపు ప్రకటనతో తిరిగి జన జీవనం పట్టాలెక్కింది. సోమ, మంగళ, బుధవారాల్లో జిల్లాలోని అన్ని వ్యాపార సముదాయాలు వినియోగదారుల రాకతో సందడిగా దర్శనమిచ్చాయి. సడలింపుల తర్వాత నిర్మాణ రంగానికి సంబంధించిన సామగ్రి కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఇసుక, ఇటుక, సిమెంటు, ఇతర గృహ అవసర సామగ్రి కొనుగోలు చేసి నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఇంటి యజమానులు, రియల్టర్లు, బిల్డర్లు పోటీపడుతున్నారు. మరోవైపు నిర్మాణ రంగంలో పనిచేసే కూలీలకు కూడా ఉపాధి దొరుకుతున్నది. నాలుగో విడత లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూనే ప్రభుత్వం కొన్ని విభాగాలకు సడలింపులు ఇచ్చింది. జిల్లాలోని ఫెర్టిలైజర్స్‌, పెస్టిసైడ్స్‌, కిరాణం, ఆటోమొబైల్స్‌ రంగా లు తిరిగి జీవం పోసుకున్నాయి. ఖ మ్మం నగరంలోని గాంధీచౌక్‌, కమాన్‌బజార్‌, కస్బాబజార్‌, వైరా రోడ్లు కొనుగోలు దారుల రాకతో సందడిగా దర్శనమిస్తున్నాయి. గాంధీ చౌక్‌లో బంగా రు, వెండి నగల దుకాణ ప్రాంతాలు వినియోగదారులతో రద్దీగా కనిపించాయి.

వైద్యసేవలకు లోటు లేదు..

ఆసుపత్రులు,ల్యాబరేటరీల్లో వైద్యసేవలు అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం జిల్లాలోని ఆసుపత్రులన్నీ రోగులతో దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఇన్నాళ్లూ చికిత్సకు దూరంగా ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఆసుపత్రులు తెరచి ఉంటుండటంతో వైద్యసేవలు అందుబాటులోకి వచ్చినట్లయ్యింది. దీంతో ప్రజానీకం నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

వేడుకల కోసం ఎదురుచూపులు..

లాక్‌డౌన్‌ ప్రభావంతో జిల్లా అంతటా శుభకార్యాలు నిలిచిపోయాయి. మార్చి నుంచి జూన్‌ వరకు వేల సంఖ్యలో వివాహాలు జరగాల్సి ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం అనివార్యంగా బహిరంగ వేడుకలు, సభలను నిషేధించింది. అయితే..మరోవైపు కల్యా ణ మండపాలు, డెకరేషన్‌, ట్రావెల్స్‌, షామియానా, మ్యూజిక్‌ బ్యాండ్స్‌, వస్త్ర దుకాణాలపై ఆధారపడి బతుకుతున్న కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. వేడుకలు జరిపించే పూజారులకు కూడా ఉపాధి లేకుండా పోయింది. ధూప, దీప నైవేద్యాలకు అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు.

కదిలిన రవాణా వ్యవస్థ..

లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం రేషన్‌కార్డు దారులు ఉన్న ఒక్కో కుటుంబానికి రెండు నెలల పాటు రూ.1,500 చొప్పున నగదు అందజేసింది. కుటుంబంలో ఒక్కొక్కరికీ 12 కిలోల చొ ప్పున బియ్యం అందజేసింది. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత వ్యాపార సముదాయాలు, కంపెనీలు, పరిశ్రమలు తెరుచుకోవడంతో తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ సేవలు కూడా ప్రారంభం కావడంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలిగాయి. రాజకీయ సభలు, క్రీడా పోటీలు, సినిమా హాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక ప్రార్థనలను ప్రభుత్వం నిషేధించింది. వాటిపై కూడా సడలింపు రావాలంటే మరికొంతకాలం ఆగాల్సిం దే. కాగా ప్రజలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్‌ వినియోగించాలని అధికారులు పేర్కొంటున్నారు. 

సడలింపుతో మరింత ప్రయోజనం..

లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారులకు ప్ర యోజనం లేకపోయింది. సడలింపుల త ర్వాత ఫెర్టిలైజర్స్‌, పెస్టిసైడ్స్‌, కిరాణం, ఆటోమొబైల్స్‌ రంగాలకు ఊపిరి పోసినట్లయ్యిం ది. మూతపడిన వ్యాపార సముదాయాలు తెరుచుకున్నాయి. రవాణా సౌక ర్యం కూడా ఉండటంతో ప్రజలకు ఊరట లభించింది. వ్యాపార రంగం పుంజుకుంటుందని ఆకాంక్షిస్తున్నా.

-చిన్ని కృష్ణారావు, వర్తక సంఘం అధ్యక్షుడు

ఉపాధి లభిస్తున్నది..

ఏటా వేసవిలో నేను కొబ్బరి బోండాలు అమ్ముతుంటా. ఈ ఏడాది కరోనా ప్రభావం తో అమ్మకాలు చేపట్టే అవకాశం లేకపోయిం ది. దీంతో కుటుంబమంతా ఇబ్బంది పడ్డాం. లాక్‌డౌన్‌ సడలింపులతో తిరిగి వ్యాపారం ప్రారంభించా. రోజూ వచ్చే ఆదాయంతో అప్పులు తీర్చుకునే వెసులుబాటు కలుగుతుందని ఆశిస్తున్నా. 

-జల్లిపల్లి దుర్గయ్య, కొబ్బరిబోండాల వ్యాపారి, తల్లంపాడు

సీజన్‌ వ్యాపారం చేస్తున్నా..

ఏటా సీజన్‌ను బట్టి నేను పండ్ల వ్యా పారం చేస్తుంటా. ఈ ఏడాది లాక్‌డౌన్‌తో వ్యాపారం లేక, ఉపాధి లేక ఇబ్బంది ప డ్డా. మొన్నటివరకు తోటలకు వెళ్లి పండ్లు తెచ్చుకునే అవకాశం లేకుండా పోయింది. నిబంధనలు సడలించిన తర్వాత వీధుల్లోకి పండ్లు విక్రయిస్తున్నా. గతంలో కంటే ఆదా యం తగ్గినప్పటికీ వ్యాపారం కొనసాగిస్తున్నా. 

- శ్రీకాంత్‌ అనిసింగ్‌, పండ్ల వ్యాపారి, బొమ్మన సెంటర్‌, ఖమ్మం