బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - May 20, 2020 , 02:06:10

ముగ్గురిని మింగిన చెరువు

ముగ్గురిని మింగిన చెరువు

స్నానం చేసేందుకు చెరువులోకి దిగిన యువకుడు

అతడిని కాపాడబోయి మరో ఇద్దరు నీటిలోకి..

నీట మునిగి ముగ్గురూ మృతి

లక్ష్మీపురంలో ఘటన

బూర్గంపహాడ్‌: చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందిన సంఘటన బూర్గంపహాడ్‌ మండలం లక్ష్మీపురంలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీపురం గ్రామానికి చెందిన నల్లమోతు అప్పారావు(40), కుమారుడు తేజస్‌(22), అప్పారావు మేనల్లుడు ఏన్కూరు మండలం జిన్నారం గ్రామానికి చెందిన జాగర్లమూడి వినయ్‌కుమార్‌(18) ఉదయం పొలం పనులకు వెళ్లారు. పొలంలో పురుగు మందు పిచికారీ చేశారు. మేనల్లుడు వినయ్‌కుమార్‌ శరీరం మంటగా ఉందని తేజస్‌తో కలిసి స్నానం చేసేందుకు పక్కనే ఉన్న రేపాక చెరువులోకి దిగారు. స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వినయ్‌ మునిగిపోవడంతో కాపాడే ప్రయత్నంలో తేజస్‌ కూడా మునిగిపోయాడు. వారి కేకలు విన్న అప్పారావు చెరువు వద్దకు వెళ్లి చూడగా ఇద్దరూ మునిగిపోతున్నారు. 

వారిని రక్షించేందుకు తాను చెరువులో దూకాడు. ముగ్గురిలో ఎవరికీ ఈత రాకపోవడంతో చెరువులో మునిగిపోయారు. అక్కడే ఉన్న అప్పారావు తండ్రి నల్లమోతు కృష్ణయ్య వారిని రక్షించేందుకు చెరువులో దిగగా అతను కూడా మునిపోతుండగా చుట్టుపక్కల వారు వచ్చి కాపాడారు. గ్రామస్తులు వచ్చి చెరువులో మృతదేహాలను బయటకు తీశారు. విషయం తెలుసుకున్న ఎస్సై బమ్మెర బాలకృష్ణ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బూర్గంపహాడ్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పారావుకి భార్య కరుణ, కుమార్తె చందన ఉన్నారు. వినయ్‌ పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. మూడురోజుల క్రితం కుటుంబంతో కలిసి అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. 

లక్ష్మీపురంలో విషాదచాయలు 

చెరువులో పడి మృతి చెందిన అప్పారావు, తేజస్‌, వినయ్‌ మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. 

ఆదుకుంటాం: ప్రభుత్వ విప్‌ రేగా 

చెరువులో పడి ముగ్గురు మృతి చెందిన విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్‌ కాంతారావు మృతుల నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రభుత్వం నుంచి సహాయం అందే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట జడ్పీటీసీ శ్రీలత రామకొండారెడ్డి, సొసైటీ చైర్మన్‌ బిక్కసాని శ్రీనివాసరావు, మణుగూరు జడ్పీటీసీ నర్సింహారావు, టీఆర్‌ఎస్‌ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జలగం జగదీశ్‌, టీఆర్‌ఎస్‌ గ్రామాధ్యక్షుడు పోతిరెడ్డి గోవిందరెడ్డి, సర్పంచ్‌ సోంపాక నాగమణి, ఉపసర్పంచ్‌ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు శ్రీహరిబాబు, పాలెం దివాకర్‌రెడ్డి, చింతా వెంకట్రామిరెడ్డి తదితరులున్నారు.