బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - May 20, 2020 , 01:57:05

పది పరీక్షలకు లైన్‌ క్లియర్‌

పది పరీక్షలకు లైన్‌ క్లియర్‌

భౌతికదూరం పాటించేందుకు కేంద్రాల రెట్టింపు

మాస్క్‌లు, థర్మల్‌ స్క్రీనింగ్‌ మెషిన్ల కోసం ప్రతిపాదనలు

ఆన్‌లైన్‌లో విద్యార్థులను సన్నద్ధం చేస్తున్న ఉపాధ్యాయులు

రేపు ఎంఈఓలు, పధానోపాధ్యాయులతోఆన్‌లైన్‌ సమావేశం

పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతున్న విద్యాశాఖ

కరోనా నేపథ్యంలో పది పరీక్షల్లో వాయిదా పడిన సబ్జెక్టుల నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.. పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.. ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలించడంతో భౌతికదూరం పాటించేందుకు గతంలో ఉన్న పరీక్షా కేంద్రాలను రెట్టింపు చేసింది.. కేంద్రాల్లో నిబంధనలు పాటించేందుకు అవసరమైన వాటి కోసం   ప్రతిపాదనలు పంపింది.. విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తోంది.. ఉమ్మడి జిల్లాలో ఉన్నతాధికారుల మార్గదర్శకాలకు అనుగుణంగా రేపు ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులత జూమ్‌ ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు. 

-ఖమ్మం/ కొత్తగూడెం ఎడ్యుకేషన్‌ 

 లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాయి దా పడిన పదో తరగతి పరీక్షలు మళ్లీ నిర్వహించేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. మార్చి 19వ తేదీ న పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగు, హిందీ పరీక్షలు నిర్వహించిన అనంతరం లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డాయి. మంగళవారం హైకోర్టు పరీక్షలను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖాధికారులు సన్నద్ధమవుతున్నారు. ఉన్నతాధికారుల సూ చనల మేరకు జిల్లాలో 178 కేంద్రాలను గుర్తించారు. వాటిల్లో అవసరమైన బెంచీలు, మౌలిక సదుపాయా లు కల్పించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు థర్మ ల్‌ స్క్రీనింగ్‌, మాస్క్‌లు అందించేందుకు, శానిటైజ్‌ చేసేందుకు అవసరమైన వాటిని కొనేందుకు అనుమతుల కోసం డీపీసీకి ఫైల్‌ను పెట్టారు. పరీక్షల నిర్వహణపై ఈ నెల 21వ తేదీన ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులతో డీఈఓ జూమ్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించనున్నారు.

రెట్టింపైన కేంద్రాలు...

ప్రభుత్వ పాఠశాలల్లోనే పది పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రాలను గుర్తించారు. 2020 మార్చిలో జరిగిన పరీక్షలకు 89 రెగ్యులర్‌, 5 ప్రైవేట్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా పరీక్షా కేంద్రాలను రెట్టింపు చేశారు. రెగ్యులర్‌ కేంద్రాలను 178కి పెంచారు. సాధారణంగా ఉన్న 89 కేంద్రాలు ఉన్నత పాఠశాలలు కాగా, ఇప్పుడు ప్రస్తుతం అదనంగా ఎంపిక చేసినవి ఆయా ఉన్నత పాఠశాలల్లో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో నిర్వహించనున్నారు. సాధారణ పరిస్థితుల్లో పరీక్ష గదిలో బెంచీల సంఖ్య ఆధారంగా బెంచీకి ఇద్దరిని కేటాయించేవారు. ప్రస్తుతం బెంచీకి కేవలం ఒక్కరే కూర్చునేలా, గదిలో 10 నుంచి 15మంది మా త్రమే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా ఎంపిక చేసిన 89 కేంద్రాల్లో 31 కేంద్రాలు మాత్రం ప్రస్తుతం ఉన్న కేంద్రానికి అర కిలోమీటరు దూరంలో ఉన్నాయి. వీటిల్లో కూసుమంచి మండలంలో ఉన్నత పాఠశాలకు అదనంగా జూనియర్‌ కళాశాలను కేంద్రంగా ఎంపిక చేశారు.

సిబ్బంది నియామకం...

 కేంద్రాల సంఖ్య పెరగటంతో విధులు నిర్వర్తించే సిబ్బంది సంఖ్య పెరగనుంది. ప్రభుత్వం పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని ఆదేశించిన సమయంలోనే ఇన్విజిలేటర్లు, కస్టోడియన్లను గుర్తించింది. గతంలో 1907 మంది ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా గుర్తించగా వీరితో పాటు అదనంగా మరో 500 మంది ఉపాధ్యాయులను విధులకు ఎంపిక చేశారు. 

కొనుగోలుకు డీపీసీకి ఫైల్‌...

 విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించేందుకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసేందుకు యంత్రాలు, మాస్క్‌లు, శానిటైజర్లను కొనుగోలు చేసేందుకు డిస్ట్రిక్‌ పర్చేజ్‌ కమిటీకి ఫైల్‌ పెట్టారు. డీపీసీకి చైర్మన్‌గా అడిషనల్‌ కలెక్టర్‌, కన్వీనర్‌గా డీఈఓ మదన్‌మోహన్‌, సభ్యులుగా డీఎంహెచ్‌ఓ తదితరులున్నారు. రెండు రోజు ల్లో వీరు సమావేశమై మాస్క్‌లు ఎక్కడ నుంచి తెప్పించాలి, సామగ్రికి కావాల్సిన నిధులపై చర్చించి అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈ నెల చివరిలోగా తెప్పించనున్నారు. 18,664 మంది విద్యార్థులకు,4వేలకు పైగా సిబ్బందికి మాస్క్‌లతో పాటు గ్లౌవ్స్‌లు ఇవ్వాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు సూచించారు.

విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు.. 

జిల్లాలో విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. డీసీఈబీ సూర్యాపేట, బ్లాగ్‌ స్పాట్‌ వెబ్‌సైట్‌ రూపొందించి దానిలో రోజు ప్రశ్నాపత్రాలు పొందుపరుస్తున్నారు. ఈ సైట్‌లోని ప్రశ్నాపత్రాలను ఎంఈఓ,పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చేరవేస్తున్నారు. పాఠశాలల ఆధారంగా రూపొందించిన వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. రోజుకు రెండు సార్లు ఇలా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉద యం 8 నుంచి 9 గంటల వరకు, ఉదయం 10 గంటల నుం చి 11గంటల వరకు నిర్వహిస్తున్నారు. సాయంత్రం  అదే గ్రూప్‌లో ప్రశ్నాపత్రాలకు సంబంధించిన కీ ని విడుదల చేస్తున్నారు. 

వీటితో పాటు మధ్యాహ్నం 1.30గంటల నుంచి 3గంటల వరకు, మధ్యాహ్నం 3.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు స్టడీ ఆవర్స్‌ సైతం నిర్వహిస్తున్నారు. వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు ప్రధానోపాధ్యాయులతో ఒక గ్రూప్‌, ఎంఈఓలతో ఒక గ్రూప్‌, సబ్జెక్ట్‌ ఫోరం ప్రతినిధులతో ఒక గ్రూప్‌ క్రియేట్‌ చేసి పర్యవేక్షిస్తున్నారు.

రేపు సమీక్ష సమావేశం...

 పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారులు చేసే మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెల 21న జిల్లాలోని ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో జూమ్‌ యాప్‌ ద్వా రా ఆన్‌లైన్‌లోసమీక్ష నిర్వహించనున్నారు. మండలాల వారీగా కేంద్రాల్లో ప్రస్తుతం స్థితి, ఇంకా కావాల్సి న సదుపాయాలు ఏ మైనా ఉన్నాయా అనే అంశాలతో పాటు ప లు అంశాలపై ఎలాంటి లోపాలు లేకుండా పరీక్షలను సమర్థ్దవంతంగా నిర్వహించేందుకు సమావేశం నిర్వహించనున్నట్లు ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి పి మదన్‌మోహన్‌  ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.