శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - May 16, 2020 , 03:22:36

పంటలకు గిట్టుబాటు ధర : కలెక్టర్‌

పంటలకు గిట్టుబాటు ధర : కలెక్టర్‌

కొత్తగూడెం: పంటలకు గిట్టుబాటు ధర తప్పకుండా అందించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు ఒకే రకమైన పంట పండిస్తే మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గుతున్నదని, ధరలు పడిపోతున్నాయని వివరించారు. దీనిని అధిగమించేందుకు పంట మార్పిడి ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. క్రాప్‌ కాలనీలు ఏర్పడాలని ప్రభుత్వం భావిస్తున్నదని తెలిపారు. ప్రజల ఆహారపు అలవాట్లను రైతులు గమనించి, డిమాండ్‌ ఎక్కువగా ఉన్న పంటలను పండించి అధిక లాభాలను పొందాలని కోరారు. దానికి ప్రభుత్వ మద్దతు ధర కూడా లభిస్తుందని పేర్కొన్నారు. సన్న రకాల బియ్యం, కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు వంటి చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఉల్లి, క్యారెట్‌, ఆలుగడ్డ, టమాటా, కాకర, కంచె కాకర కూరగాయ పంటలు, బొప్పాయి, అరటి, పుచ్చ, కర్బూజా, నిమ్మ వంటి పండ్లు, ఆయిల్‌పాం వంటి వ్యాపార పంటలు పండిస్తే గిట్టుబాటు ధర ఉంటుందని, అధిక లాభాలు ఆర్జించవచ్చని వివరించారు. ఈ విషయంలో వ్యవసాయ, ఉద్యానవన అధికారుల సలహాలు పాటించాలన్నారు. 

ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులపై ఆగ్రహం..

ములకలపల్లి : మిషన్‌ భగీరథ నీటిని ప్రజలకు అందించాలని, ఎలాంటి సమస్యలున్నా వెంటనే తెలియజేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. ములకలపల్లి మండలంలోని ఆనందాపురం, పాతూరు, పూసుగూడెం, సీతారాంపురం గ్రామాల్లో శుక్రవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఆనందాపురం గ్రామంలో పోయం మధులత అనే మహిళ ఇంటికి వెళ్లి భగీరథ నీరు వస్తుందా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్‌బీఎం ద్వారా నిర్మించిన మరుగుదొడ్లపై రంగులతో అందంగా రాయించాలని డీఆర్డీఏ పీడీకి సూచించారు. సీతారాంపురం పంచాయతీలోని పాతూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు.  గ్రామంలో క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తుల వివరాలు నమోదు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పూసుగూడెంలో హరితహారం మొక్కలను పరిశీలించారు. ఆయన వెంట డీఆర్‌డీఏ పీడీ మధుసూదన్‌రాజు, డీపీవో ఆశాలత, డీఎస్‌వో చంద్రప్రకాశ్‌, డీఎం ప్రసాద్‌, జిల్లా వైద్యాధికారి భాస్కర్‌రావు, ఆర్డీవో స్వర్ణలత, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ అర్జున్‌రావు, తహసీల్దార్‌, ఎంపీడీవో, సర్పంచ్‌లు పాల్గొన్నారు.