శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - May 14, 2020 , 02:15:47

కలెక్టర్‌ పాలనకు వంద రోజులు

కలెక్టర్‌ పాలనకు వంద రోజులు

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: కలెక్టర్‌గా డాక్టర్‌ ఎంవీ రెడ్డి బాధ్యతలు చేపట్టి గురువారంతో వంద రోజులు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 4న కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడిన తరువాత ప్రథమ కలెక్టర్‌గా రాజీవ్‌గాంధీ హన్మంతు, రెండో కలెక్టర్‌గా రజత్‌కుమార్‌శైనీ పనిచేశారు. మూడో కలెక్టర్‌గా డాక్టర్‌ ఎంవీ రెడ్డి పనిచేస్తున్నారు. జిల్లాలో కరోనా ప్రబలకుండా నియంత్రించడంలో కలెక్టర్‌ విశేష కృషిచేశారు. రెడ్‌ జోన్‌లో ఉన్న జిల్లాను నిరంతరం శ్రమించి గ్రీన్‌ జోన్‌లోకి తెచ్చారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న భద్రాచలం, కొత్తగూడెం డయాలసిస్‌ కేంద్రాలకు అదనంగా భద్రాచలంలో అదనంగా ఒకటి, పాల్వంచలో మరొకటి ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.38.50 లక్షల అంచనాతో ప్రభుత్వానికి నివేదికలు పంపారు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న జగ్గారం ఆదివాసీలకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు. ప్రతి అంశంపైనా ఆయనకు విశేష అనుభవముంది. బాధ్యతలు స్వీకరించిన వంద రోజుల్లోనే ప్రజల కలెక్టర్‌గా పేరు సంపాదించకున్నారు.