గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - May 13, 2020 , 02:54:16

ఇంటర్‌ మూల్యాంకనం ప్రారంభం

ఇంటర్‌ మూల్యాంకనం ప్రారంభం

 జిల్లాలో ఇంటర్‌ మూల్యాంకనం మంగళవారం ప్రారంభమైంది. నగరంలోని మూడు కేంద్రాల్లో కేటాయించిన సబ్జెక్టుల ఆధారంగా ఆయా సబ్జెక్టుల అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, స్క్రూట్నీవైజర్లు రిపోర్ట్‌ చేశారు. ఉదయం 8:30 గంటల వరకే అధ్యాపకులు స్పాట్‌ కేంద్రాలకు చేరుకున్నారు. సంస్కృతానికి 42 మంది, ఇంగ్లిష్‌కు 116 మంది, గణితానికి 189 మంది, సివిక్స్‌కు 75 మంది ఎగ్జామినర్లు అసిస్టెంట్‌ క్యాంపు అధికారులకు రిపోర్ట్‌ చేశారు. నయాబజార్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏసీవోగా కేఎస్‌ రామారావు, బాలికల జూనియర్‌ కళాశాల ఏసీవోగా రాయ్‌, శ్రీచైతన్య కళాశాల ఏసీవోగా కుతుంబాక శ్రీనివాస్‌ వ్యవహరిస్తున్నారు. మూల్యాంకనం ప్రారంభానికి ముందు పాల్గొన్న వారందరికీ బోర్డు పంపించిన మాస్కులు అందించారు. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేయించారు. ప్రతి గదిలో 20 మంది అధ్యాపకులు వాల్యూయేషన్‌ చేస్తున్నారు. భౌతిక దూరం పాటించేలా ఏసీవోలు చర్యలు తీసుకుంటున్నారు. స్పాట్‌ అధ్యాపకులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించారు.

11 బస్సులు ఏర్పాటు..

వాల్యూయేషన్‌లో పాల్గొనే వారికి రవాణా సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వ సహకారంతో ఆర్‌టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. వాల్యూయేషన్‌లో పాల్గొనే అధ్యాపకులను ఉదయం 8:30 గంటల వరకు క్యాంపునకు తీసుకురావడం, సాయంత్రం 5:30 గంటల తరువాత వారి ప్రాంతాలకు చేర్చడం కోసం 11 బస్సులను వినియోగిస్తున్నారు. భద్రాచలం, అశ్వారావుపేట, కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లి, మధిర, ఏన్కూరు, ఇల్లెందు ప్రాంతాలకు బస్సులు కేటాయించారు. మంగళవారం బోర్డు ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో క్యాంపు ఆఫీసర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇతర ప్రాంతాల్లోని వారికి స్పాట్‌లో అవకాశం ఇవ్వాలని, 3 గంటల ప్రయాణం కలిగిన భద్రాచలం వంటి ప్రాంతాలకు బస్సు కాకుండా వసతి సౌకర్యం కల్పించాలని క్యాంపు ఆఫీసర్‌ రవిబాబును ఆదేశించారు. స్పాట్‌లో ఆరోగ్య శాఖకు చెందిన ఒక ఏఎన్‌ఎం విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి మూడు రోజులకొకసారి సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో కేంద్రాలను శానిటైజ్‌ చేయనున్నారు.

వసతికి కళాశాలల ఎంపిక..

స్పాట్‌లో పాల్గొనే మహిళా అధ్యాపకులకు, పురుషులకు వసతి కల్పించేందుకు జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రవిబాబు ఉన్నతాధికారుల మార్గదర్శకాలకు అనుగుణంగా రెండు కళాశాలలను ఎంపిక చేశారు. మహిళా అధ్యాపకులకు న్యూవిజన్‌ జూనియర్‌ కళాశాలలో, పురుషులకు కృష్ణవేణి జూనియర్‌ కళాశాలలో పూర్తిస్థాయి సదుపాయాలతో వసతి కల్పించేందుకు ఆయా కళాశాలల యాజమాన్యాలతో చర్చించారు.