శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - May 11, 2020 , 02:08:25

‘అమ్మ’కు అవమానం

‘అమ్మ’కు అవమానం

  • ఆస్తి కోసం ఇంటికి తాళం వేసి కన్నతల్లిని గెంటేసిన కొడుకు
  • ఏడు పదుల వయసులో న్యాయం కోసం తల్లి మౌన పోరాటం

నవ మాసాలు మోసింది.. పురిటి నొప్పులను భరించి జన్మనిచ్చింది.. అపురూపంగా పెంచుకున్నది.. పెద్దవాడిని చేసింది.. కానీ వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకుంటాడనుకున్న కొడుకు నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేశాడు. మాతృ దినోత్సవం నాడు ఓ ‘అమ్మ’కు జరిగిన అవమానం వెలుగు చూసింది. ఈ ఘటన ఆదివారం సారపాకలో జరిగింది.. వృద్ధురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సారపాకలోని పాత పంచాయతీ రోడ్‌లో అయిలూరి వెంకట కోటమ్మ (70) నివాసం ఉంటున్నది. భర్త అయిలూరి రంగారెడ్డి మూడు నెలల క్రితం మృతిచెందాడు. వెంకటకోటమ్మకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. భర్త బతికి ఉన్న సమయంలోనే వెంకట కోటమ్మ కుమార్తెలకు, కుమారునికి పెళ్లిళ్లు చేసింది. కొడుకు ఇంట్లో ఉండకుండా తన సొంత ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నది. భర్త మరణం తర్వాత తనను చేరదీసి కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కొడుకు అయిలూరి శ్రీనివాసరెడ్డి తరచూ వేధిస్తున్నాడని, ఈనెల 8న తాను ఉంటున్న ఇంటికి వచ్చి చేయిచేసుకున్నాడని, స్థానికులు చేరదీశారని వాపోయింది. సొమ్మసిల్లి పడిపోగా స్థానికుల సాయంతో భద్రాచలంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందానని చెప్పింది. ఖర్చుల కోసం రూ.36 వేలు తీసుకున్నాడని, తిరిగి ఇవ్వలేదని బోరున విలపించింది. కొడుకుపై ఆదివారంబూర్గంపహాడ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన కుమారుడి వేధింపుల నుంచి కాపాడాలని మౌన పోరాటం చేస్తున్నది.

-సారపాక