సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - May 11, 2020 , 02:08:26

పేదలకు సర్కార్‌ అండ..

పేదలకు సర్కార్‌ అండ..

  • రెండు నెలలకు గాను రూ.1500, రేషన్‌ బియ్యం అందజేత
  • లాక్‌డౌన్‌లో ఆదుకుంటున్న ప్రజాప్రతినిధులు

కొత్తగూడెం: లాక్‌డౌన్‌లోనూ తెలంగాణ ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు చేయూతనిచ్చింది.  కులవృత్తులు, చేతివృత్తులను నమ్ముకొని జీవించే పేద కుటుంబాలకు భరోసా కల్పించింది. ఎవరూ పస్తులుండకూడదని ప్రతి కుటుంబానికి రూ.1500తో పాటు ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యాన్ని అందించింది సర్కార్‌. నెల రోజులకు పైగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో ప్రజలు బయటకు రాకుండా ఇంటికే పరిమితమయ్యారు. 40 రోజుల అనంతరం లాక్‌డౌన్‌లో కొన్ని మినహాయింపులు ఇవ్వడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులు జిల్లావ్యాప్తంగా భారీ సాయాన్ని అందించి అండగా నిలిచారు. అంతేకాకుండా స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకొచ్చి ఎవరికి తోచిన విధంగా వారు సాయం చేశారు. 

కుటుంబానికి రూ.1500తో అండ.. 

ఆపత్కాలంలో పేదలకు అండగా ఉండేందుకు తెలంగాణ సర్కార్‌ పేద కుటుంబాలకు నెలకు రూ.1500 చొప్పున వారి ఖాతాల్లో జమ చేసింది. దీంతో 40 రోజుల పాటు వారికి ఆసరా కలిగింది. ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించి రూ.3 వేల చొప్పున ఆర్థిక సాయం అందించింది. అంతేకాదు జిల్లాలోని 2,83,442 తెల్లరేషన్‌ కార్డులు కలిగిన కుటుంబాలకు ఒక్కొక్కరికీ 12 కేజీల బియ్యం కూడా అందించింది. పట్టణం, పల్లె తేడా లేకుండా పనులు లేని కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించి వేసవిలోనూ అండగా నిలిచింది. మరోవైపు ప్రజాప్రతినిధులు కూడా సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు సాయం అందిస్తున్నారు.

రెండోసారి కూడా డబ్బులు వచ్చాయి..

ఇప్పుడు ఎలాంటి పనులు లేవు. బయటకు పోయే దారి లేదు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం గుర్తించి మాకు డబ్బులిచ్చింది. రెండు నెలలకు సరిపడా రూ.3 వేలు అందాయి. బియ్యం కూడా ఉచితంగానే ఇచ్చారు. ఇంతకంటే మాకు ఏం కావాలి. ఆపద సమయంలో ఆదుకున్నోళ్లే గొప్పోళ్లు. పేదల కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్‌ చాలా గొప్పోడు.

-లావుడ్యా విజయ, రుద్రంపూర్‌

రేషన్‌ బియ్యం బాగున్నాయి..

పేదలకు బియ్యం, డబ్బులు ఇచ్చారు. లాక్‌డౌన్‌ సమయంలో పనులు లేని కూలీలకు, పేదలకు ఇవి చాలా ఆసరాగా ఉన్నాయి. ప్రస్తుతం పనులు కూడా దొరుకుతున్నాయి. కష్టకాలంలో ఆదుకున్న వారికి ఎప్పటికీ రుణపడే ఉంటాం. రైతులకు అండగా ప్రభుత్వం ఉంది. లాక్‌డౌన్‌లో కూడా పనులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 

-గుగులోత్‌ ఢోలా, సుజాతనగర్‌