శుక్రవారం 04 డిసెంబర్ 2020
Badradri-kothagudem - May 04, 2020 , 02:01:11

గ్రీన్‌ జోన్‌ దిశగా.. ఖమ్మం జిల్లా

గ్రీన్‌ జోన్‌ దిశగా.. ఖమ్మం జిల్లా

  • కరోనా కట్టడికి అధికారుల చర్యలు భేష్‌
  • ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్న కలెక్టర్‌, సీపీ
  • ఐసోలేషన్‌ వార్డుల్లో మెరుగైన వైద్య సేవలు
  • ప్రజాసేవలో పోలీస్‌శాఖ

ఖమ్మం, నమస్తే తెలంగాణ: జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం సఫలీకృతమవుతున్నది. మొదటి నుంచీ పటిష్టమైన చర్యలు చేపట్టినప్పటికీ అనివార్య పరిస్థితుల కారణంగా ఖమ్మం జిల్లాలో 8 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఖమ్మం నడిబొడ్డున కేసులు బయటపడటంతో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంటుందని, ఫలితంగా ఎక్కువ కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని ప్రజలు భయపడ్డారు. అయితే మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆదేశాలకు అనుగుణంగా ఖమ్మం కలెక్టర్‌ కర్ణన్‌, సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ సంయుక్తంగా చేపట్టిన చర్యలు ఫలించాయి. దీంతో పాజిటివ్‌ కేసులు పెరగకుండా నియంత్రణలోనే ఉన్నాయి. దీంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పాజిటివ్‌ కేసులు బయటపడిన ప్రదేశాలను అధికారులు వెంటనే రెడ్‌ జోన్‌లుగా ప్రకటించి పటిష్టమైన చర్యలు చేపట్టారు. దీంతో వైరస్‌ మరో చోటుకు వ్యాప్తి చెందకుండా నియంత్రించినట్లయింది. ఈ నేపథ్యంలో పొరుగున ఉన్న సూర్యాపేట జిల్లాలో పాజిటివ్‌ కేసులు ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో జిల్లా అధికారులు వేగంగా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా సమీప గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించి సరిహద్దులను మూసివేశారు. చెక్‌పోస్టులనూ పటిష్ట పరిచి వైరస్‌ ఇటు వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఖమ్మం నగరంలోని రెడ్‌జోన్లలో మంత్రి, కలెక్టర్‌, సీపీ పర్యటించి అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పి అవగాహన కల్పించారు. ఆయా జోన్ల నుంచి ప్రజలెవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, వాటర్‌ క్యాన్లు, పాల ప్యాకెట్లు కూడా ఇంటింటికీ పంపిణీ చేయించారు. దీంతో రెడ్‌ జోన్లలో కూడా వైరస్‌ వ్యాప్తిని నిలువరించారు. ఆదివారం సాయంత్రం వరకూ జిల్లా మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు ఎనిమిది మాత్రమే ఉన్నాయి. ఇందులో నలుగురు వ్యక్తులు ఇప్పటికే పూర్తిగా కోలుకొని ఇళ్లకు కూడా చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగుతున్నది. 

జిల్లా వ్యాప్తంగా ఐసోలేషన్‌ వార్డులు..

కరోనా అనుమానిత వ్యక్తులను కలిసిన వారికి, వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. అనుమానితులను రెండు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి రక్త నమూనాలను, గొంతు, ముక్కుకు చెందిన శ్లాబ్‌ నమూనాలను కాకతీయ మెడికల్‌ కాలేజీకి పంపుతున్నారు. ఈ రిపోర్టుల ఫలితాలు నెగెటివ్‌గా వస్తే సదరు వ్యక్తులను ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించి 14 రోజుల పాటు చికిత్స అందిస్తున్నారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో 250 పడకల ఐసోలేషన్‌ వార్డు, ఖమ్మం మమత వైద్యశాలలో 146 పడకలు, తిరుమలాయపాలెంలో 20 పడకలు, పెనుబల్లిలో 20 పడకలతో జిల్లాలోని ఐసోలేషన్‌ వార్డుల్లో సదరు బాధితులకు సేవలందుతున్నాయి. వైద్యపరీక్షల్లో నెగెటివ్‌గా రిపోర్ట్స్‌ వచ్చిన అనంతరం వారిని ప్రభుత్వ క్వారంటైన్‌లలో ఉంచి పౌష్టికాహారం అందిస్తూ 14 రోజుల పాటు సేవలందిస్తున్నారు. రఘునాథపాలెం మండలంలో శారద ఇంజినీరింగ్‌ కళాశాలలో 500 పడకలు, ఖమ్మం రూరల్‌ మండలం మద్దులపల్లిలోని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో 150 పడకలు, పాలేరులోని ఓ కాలేజ్‌లో 180 పడకలు, వరంగల్‌ క్రాస్‌రోడ్‌ ఎస్‌బీసీఈలో 200 పడకలు, లక్ష్య కళాశాలలో 200 పడకలు, అంబేద్కర్‌ భవన్‌లో 200 పడకలతో ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేసి సదరు వ్యక్తులకు సేవలందిస్తున్నారు.  

ప్రభుత్వ క్వారంటైన్‌లలో పౌష్టికాహారం..

ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లలో 14 రోజుల పాటు సేవలు పొందే వ్యక్తులకు ఉదయం టిఫిన్‌ ఒక రోజు ఉప్మా, మరో రోజు ఇడ్లీ, మరో రోజు కిచిడీ, రెండు పూటల టీ, స్నాక్స్‌, సన్న బియ్యంతో రెండు పూటలా శుచికరమైన భోజనం, ఆదివారం చికెన్‌తో భోజనం, వ్యాధి నిరోధక శక్తిని పెంచే నారింజ, బెల్లం, అరటిపండ్లు, ప్రతి రోజు రెండు పూటల ఉడకబెట్టిన గుడ్లు అందిస్తున్నారు. అంతేకాకుండా సబ్బు లు, టూత్‌ బ్రెష్‌, పేస్ట్‌, శాంపులు, రెండు బెడ్‌ షీట్స్‌ అందిస్తున్నారు. క్వారంటైన్‌ గడువు పూర్తి అయిన తరువాత సదరు వ్యక్తులకు హోం క్వారంటైన్‌లో 28 రోజుల వరకు ఉండాల్సిందిగా ప్రభుత్వం నిర్దేశించింది. దీంతో జిల్లావ్యాప్తంగా 266 మంది వ్యక్తులు హోం క్వారంటైన్‌లో స్వీయ నియంత్రణలో ఉన్నారు.