సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Apr 18, 2020 , 00:51:32

ఆయకట్టు అదరహో..

ఆయకట్టు అదరహో..

  • నెర్రెలు వారిన నేలకు జవసత్వాలు
  • ఖరీఫ్‌తో పోటీపడి యాసంగి వరిసాగు
  • సాధారణం కంటే రెండింతలు పెరుగుదల 
  • అధిక దిగుబడులతో అన్నదాతల ఆనందం
  • ఊరూరా కొనుగోలు కేంద్రాలతో కలిగిన ప్రయోజనం

ఖమ్మం వ్యవసాయం: ఒక సీజన్‌కు నీరుంటే, మరో సీజన్‌కు కటకట.. తలాపున సాగర్‌ కాలువ పరవళ్లు.. అయినా చుక్కనీరు లేక అల్లాడిన నేలలు.. పాలమూరును తలపించే పాలేరు గోస.. యాసంగి వచ్చిందంటే చాలు అన్నదాత పడే అవస్థ అంతా ఇంతాకాదు.. చాలీచాలని కరెంట్‌.. ఇదీ తెలంగాణ సాధనకు ముందు జిల్లాలో ఎవుసం తీరు. స్వరాష్ట్ర సాధన అనంతరం సాగుకు సరికొత్త వెలుగులు వచ్చాయి. తడి ఆరడం కాదు కదా.. కనీసం చెరువు మత్తడి తగ్గడం కూడా చూడలేని పరిస్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే వానాకాలం సాగుతో యాసంగి సాగు పోటీ పడుతున్నది. దీంతో నేడు జిల్లాలో ఎక్కడ చూసినా వరి, మక్క పంటలు కళకళలాడుతున్నాయి. నిండు వేసవిలో సైతం కాలువల్లో నీరు ప్రవహించడంతో ఉద్యాన పంటల సాగు సైతం ఆశాజనకంగా ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఖరీఫ్‌లో వరిసాగు ఊహించని విధంగా ఉంది. అయితే యాసంగి సీజన్‌లో సైతం అదే ఒరవడి కొనసాగింది. దీంతో జిల్లాలో నేడు ఏ గ్రామంలో చూసినా వరి పంటే కనపడుతున్నది. పండించిన మొత్తం పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకుగాను ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించింది. జిల్లా విభజన తరువాత యాసంగిలో సాధారణ సాగు విస్తీర్ణం కేవలం 30వేల హెక్టార్లు (75వేల ఎకరాలు) మాత్రమే ఉండేది. ఈ సంవత్సరం అనూహ్యంగా 81,375 వేల హెక్టార్లు(సుమారు 2లక్షల ఎకరాల పైబడి..) పెరిగింది.  తక్కువ ఖర్చు, ఎక్కువ మొత్తంలో దిగుబడి వస్తుండటంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

‘భక్త రామదాసు’తో పాలేరు సస్యశ్యామలం..

జిల్లాలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఉపయోగించుకోవడంలో అప్పటి పాలకుల నిర్లక్ష్య ధోరణితో మాగాణులు సైతం బీడు భూములుగా మారిపోయాయి. దీంతో జిల్లా రైతాంగం అప్పుడప్పుడు సాగర్‌ నీరు మీదే ఆధారపడాల్సి వచ్చింది. మిగిలిన మండలాల రైతులు మాత్రం వర్షంపైనే ఆధారపడి సాగు చేసేవారు. భక్తరామదాసు ప్రాజెక్టు నిర్మాణంతో పాలేరు నియోజకవర్గంలో భూ గర్భ జలాలు ఒక్కసారిగా పెరిగాయి.  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్‌కాకతీయ ద్వారా నేడు దాదాపు వందల చెరువులు కొత్తరూపు సంతరించుకున్నాయి. దీంతో ఖరీఫ్‌, యాసంగి పంటలకు సైతం సాగునీటి ఇబ్బంది లేకుండా పోయింది. 

పంటల పెట్టుబడితో ఆదుకున్న సర్కార్‌.. 

రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం పంటలకు పెట్ట్టుబడి సాయం అందించడంతో మేలు చేకూరినైట్లెంది. ఖరీఫ్‌లో ఎకరానికి రూ. 5వేలు, యాసంగి సీజన్‌లో సైతం మరో రూ. 5వేలు అందిస్తున్నది. అనుకున్న రీతిలో సాగు జరగడం, పంటల దిగుబడి సైతం అధికం కావడంతో ప్రభుత్వం మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే జిల్లాలో దాదాపు 430 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సొసైటీలు, ఐకేపీల ద్వారా కొనుగోళ్లు ప్రారంభించింది.