సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Apr 18, 2020 , 00:49:57

గస్తీకి డ్రోన్‌ కెమెరాలు

గస్తీకి డ్రోన్‌ కెమెరాలు

  • ఖమ్మం పోలీసుల సరికొత్త వ్యూహం
  • కంటైన్మెంట్‌ జోన్లలో వినియోగం
  • ఇల్లు దాటి బయటకు వస్తే కేసులు
  • జిల్లాలో పక్కాగా లాక్‌డౌన్‌ అమలు

ఖమ్మం క్రైం: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నది. కరోనా పాటిజివ్‌ కేసులు ఉన్న కంటైన్మెంట్‌ జోన్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఖమ్మం నగరంలో పోలీసులు ‘నో ఎంట్రీ.. నో ఎగ్జిట్‌' విధానాన్ని అమలు చేస్తున్నారు. అయినప్పటికీ ఆ ప్రాంతాల్లో ఇళ్ల నుంచి ఎవరైనా బయటకు వస్తే తెలుసుకునేందుకు డ్రోన్‌ కెమెరాలతో గస్తీ నిర్వహింపజేస్తున్నారు. మంచి ఫలితాలు సాధిస్తున్నారు. 

కంటైన్మెంట్‌ జోన్లలో..

జిల్లాలోని ఖమ్మం నగరంలో ఇప్పటికి వరకు ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఖిల్లా, మోతీనగర్‌, పెద్దతండా ప్రాంతాలను పోలీసులు పూర్తిగా నిర్బంధించారు. ప్రజలెవరూ ఈ ప్రాంతాల నుంచి బయటకు రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. కరోనా తగ్గే వరకూ అక్కడి ప్రజలెవరూ ఇళ్లు దాటి బయటకు రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా పరిస్థితిని సమీక్షించేందుకు డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఆంక్షలను అతిక్రమించి ఎవరైనా బయటకు వచ్చినా, మరెవరైనా దుకాణాలు తెరిచినా సులభంగా గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కరోనా లాక్‌డౌన్‌ ఖమ్మం జిల్లావ్యాప్తంగా పక్కాగా అమలవుతున్నది.  

ఆంక్షలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు : సీపీ తఫ్సీర్‌

“కరోనా వ్యాప్తి అరికట్టేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలి. జిల్లాలో ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ కేసులున్న ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించాం. ఆ ప్రాంతాల్లో ఎవరైనా ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. డ్రోన్‌ కెమెరాలతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం.”