శనివారం 05 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Apr 11, 2020 , 02:54:05

దళారులను ఆశ్రయించొద్దు..

దళారులను ఆశ్రయించొద్దు..

  • మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
  • మంచుకొండలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

రఘునాథపాలెం:ప్రైవేటు వ్యాపారులు, దళారులను రైతులు ఆశ్రయించి మోసపోవద్దని, ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూపన్ల ప్రకారం ధాన్యాన్ని కేంద్రాన్ని తీసుకరావాలని సూచించారు. వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలన్నారు. రైతులు నష్టపోవద్దని కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని చెప్పారు. గన్నీబ్యాగులు కొరత రాకుండా ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టిందన్నారు. వలస కూలీలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. కోటపాడు గ్రామంలో మహారాష్ట్ర నాందేడ్‌ నుంచి వచ్చిన వలస కూలీలకు ఏర్పాటు చేసిన వసతులపై మంత్రి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్‌ కూరాకుల నాగభూషణం, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, వెస్‌ చైర్మన్‌ పిన్ని కోటేశ్వరరావు, అదనపు కలెక్టర్‌ ఎన్‌.మధుసూదన్‌రావు, ఆర్డీఓ రవీంద్రనాథ్‌, తహసీల్దార్‌ నర్సింహా రావు, ఎంపీడీఓ శ్రీదేవి, ఎంపీపీ గౌరీ, జడ్పీటీసీ ప్రియాంక, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికా రులు తదితరులు పాల్గొన్నారు. 

ఖిల్లా ప్రాంతంలో నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

ఖమ్మం, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ఎవరూ గడపదాటొద్దని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రజలకు సూచించారు. శుక్రవారం నగరంలోని ఖిల్లా ప్రాంతంలోమంత్రి పువ్వాడ , కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌తో కలిసి పర్యటించారు. ఖిల్లా ప్రాంతంలోని వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో అక్కడ పకడ్బందీగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చేపట్టిన చర్యలను మంత్రి పరిశీలించారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు, పాలు, కూరగాయలు ప్రతిరోజు అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఖిల్లాలోని పలు గృహాలకు వెళ్ల్లి కూరగాయలు, నిత్యావసర వస్తువులను మంత్రి అందించారు. నివాసితులకు మంత్రి పలు సూచనలు చేశారు. ఖిల్లా ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన పర్సనల్‌ శానిటైజర్‌ ఎన్‌క్లోజర్‌ (డిస్‌ఇన్ఫ్‌క్షన్‌ టన్నెల్‌)ను మంత్రి ప్రారంభించారు. నగర మేయర్‌ పాపాలాల్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఖమర్‌, కార్పొరేటర్‌ షౌకత్‌ అలీ, నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి రమేశ్‌, ఖమ్మం రెవెన్యూ డివిజనల్‌ అధికారి రవీంద్రనాథ్‌, అర్బన్‌ తహసీల్దార్‌ శ్రీనివాసరావు, వైద్యశాఖ, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.