శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Apr 11, 2020 , 02:49:55

లోక కల్యాణార్థం నిత్యపూజలు

లోక కల్యాణార్థం నిత్యపూజలు

  • కరోనా విపత్తు నుంచి రక్షణ కోరుతూ ‘సుదర్శన శతక పారాయణం’
  • భారతీయుల ఆచార, వ్యవహారాలతో ఆరోగ్య సంరక్షణ  
  • కరోనా విపత్తు నుంచి సీఎం కేసీఆర్‌ తప్పిస్తారు
  • ‘నమస్తే’ భద్రాద్రి రామాలయ ప్రధాన అర్చకుడు పొడిచేటి రామానుజాచార్యులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సనాతన సంప్రదాయాలు, ఆచారాలకు పెద్దపీట వేస్తూ భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో అర్చకులు నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ తగిన జాగ్రత్తలు పాటిస్తూ నిత్యం అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజలు చేపడుతున్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం వైధికంగా కావాల్సిన అన్ని వనరులను సమకూరుస్తున్నది. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఏ లోటు రాకుండా కైంకర్యాలను కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నది. నిరాడంబరంగా నిర్వహించాలని, సామూహికంగా ఉత్సవాలను నిర్వహించకూడదనే సంకల్పంతో ఇటీవల ఆలయ అధికారులు సాదాసీదాగా ఆలయంలోనే శ్రీనవాహ్నిక బ్రహ్మోత్సాలు ముగించారు. మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు మరికొందరు అతిథుల సమక్షంలో ఈ ఉత్సవాలు ముగిశాయి. ఇప్పటికీ నిత్య కైంకర్యాలూ నిరాడంబరంగా కొనసాగుతున్నాయి. భద్రాద్రి రామాలయ ప్రధాన అర్చకుడు పోడిచేటి సీతారామానుజాచార్యులుతో ప్రత్యేక ఇంటర్వ్యూ..

నమస్తే : సీతారామచంద్రస్వామివారికి పూజాధికాలు ఎలా నిర్వహిస్తున్నారు ?

ప్రధాన అర్చకుడు: కరోనా కట్టడికి భక్తులను ఆలయాల్లోకి అనుమతించడం లేదు. ఆలయంలో నిత్యం జరిగే విధంగానే సీతారామచంద్రస్వామికి ఉదయం సుప్రభాత సేవ మొదలుకొని పవళింపు సేవ వరకు యథాప్రకారంగా కొనసాగిస్తున్నాం. పూజలను శాస్ర్తోక్తంగా, వైధికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వనరులనూ సమకూరుస్తుంది. పూజలకు ఎలాంటి లోటు లేదు. లోక కల్యాణార్థం ఉదయం నుంచి రాత్రి వరకు జరగాల్సిన పూజలకు రోజువారీగా ఇద్దరు అర్చకులు ఆలయానికి వెళ్తున్నారు.

నమస్తే : మహావిపత్తులు రావడానికి గల కారణం..?

ప్రధాన అర్చకుడు:  మనిషి సన్మార్గంలో నడవటం అనేది ఇప్పుడున్న కాలంలో అత్యవసరం. ఏది ఎప్పుడు జరగాలో, ఎవరికి ఏ విధంగా జరగాలో అంతా దైవమే నిర్ణయిస్తుంది. ఈ జగత్తులో భగవత్‌లీలానుసారంగానే ఏదైనా జరుగుతుంది. ప్రకృతిని ప్రతిఒక్కరూ కాపాడాలి. ప్రకృతి విధ్వంసానికి పాల్పడిన పాపమే రుగ్మతలకు కారణభూతం. మానవ తప్పిదాలే విపత్తులకు మూలకారణమని నా నమ్మకం. 

నమస్తే:భారత సంస్కృతి,సంప్రదాయాలపై మీ అభిప్రాయం.?

ప్రధాన అర్చకుడు: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవి. అవి ఆచరించినంతకాలం మనుషులకు ఎలాంటి ఆపద రాలేదు. ఇప్పటివరకు మన ఆచారాలే మనల్ని కాపాడుతూ వచ్చాయి. రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి పెద్దలను గౌరవించడం, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తప్పనిసరిగా చేతులను అడ్డుపెట్టుకోవడం, బయటకు వెళ్లివచ్చిన అనంతరం వాకిట్లోనే కాళ్లు, చేతులు శుభ్రం చేసుకొని ఇంట్లోకి రావడం లాంటి పనులు ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో ఉపకరిస్తాయి. 

నమస్తే : ‘వైద్యో నారాయణో హరి..’ అన్నారు మన పెద్దలు.. దీనిపై మీ అభిప్రాయం ?

ప్రధాన అర్చకుడు: దైవం మనిషి రూపంలో ఉండి అందరికీ సహాయపడుతూ ఉంటాడు. వైద్యో నారాయణో హరి.. అని వైద్యుడిని దైవంతో పోల్చుతారు. మనిషికి ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు దైవం మనిషి (వైద్యుడు) రూపంలో వచ్చి ప్రాణాలను కాపాడుతూ ఆపద నుంచి గట్టెక్కిస్తారు. ప్రతిఒక్కరూ ఆపద వస్తే భారమంతా దేవునిపైనే వేస్తారు, వారికేదైనా మంచి జరగనప్పుడు మరో రకంగా తలుస్తారు. ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. ఏదైనా దైవానుసారమే జరుగుతుందని నా తలంపు.. దైవేచ్ఛ ప్రకారమే ముల్లోకాలు నడుస్తున్నాయి. దైవం లేకపోతే ఈ సకలచరాచర జీవకోటి మనుగడే లేదు. 

నమస్తే : కరోనా విపత్తుకు మీ తక్షణ తరుణోపాయం ఏమిటి ?

ప్రధాన అర్చకుడు:  కరోనా మహమ్మారి నుంచి సకల జీవకోటిని కాపాడాలని నిత్యం పూజాధికాలు నిర్వహిస్తున్నాం. విపత్తు నుంచి మనదేశంతో సహా ప్రపంచ దేశాలన్నీ బయటపడాలని ‘సుదర్శన శతక పారాయణం’ నిర్వహిస్తున్నాం. ఈ మహమ్మారి మూలాన భక్తులు లేకుండానే ఈ నిత్య పూజలు నిర్వహించడం బాధాకరంగానే ఉంది. కానీ ఈ మహావిపత్తు నుంచి విముక్తి పొందేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విపత్తు సమయంలో సముచిత నిర్ణయాలే తీసుకుంటున్నది. ఎప్పుడూ ఏ నిర్ణయం తీసుకోవాలో విజ్ఞుడైన సీఎం కేసీఆర్‌కు పూర్తిగా తెలుసు. ఆయన చేతుల్లో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఈ విపత్తు సమయంలో రాష్ట్ర ప్రజలతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీతారామాచంద్రస్వామిని వేడుకుంటున్నాం.