మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Apr 07, 2020 , 03:40:18

సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు

సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు

  • సీఎం కేసీఆర్‌కు రూ.2 కోట్ల చెక్కు అందజేసిన మంత్రి పువ్వాడ 
  • దాతల నుంచి రూ. 1.75 కోట్లు, మమత నుంచి రూ. 25 లక్షలు 
  • మంత్రి అజయ్‌కుమార్‌ను అభినందించిన ముఖ్యమంత్రి 

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పదం కలిపి.. కదం తొక్కి.. కరోనాను పారదోలుదాం.. అంటూ ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను పాటించడమే కాకుండా కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనందించేందుకు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నేతృత్వంలో ఖమ్మం ప్రజలు కలిసికట్టుగా నడుంబిగించారు. రాష్ట్రంలో ఎక్క డా లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. కేవలం మంత్రి అజయ్‌ ఇచ్చిన ఒక్క పిలుపుతోనే పెద్ద ఎత్తున వ్యాపారస్తులు, విద్యాసంస్థల అధినేతలు, సేవా సంస్థలు ముందుకొచ్చాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే సుమారు రూ.1.75 కోట్లు విరాళాలు అందాయి. రాష్ట్రంలో ఏ మంత్రి చేయని విధంగా విరాళాల సేకరణలో ప్రజలను భాగస్వామ్యం చేసిన ఘనత పువ్వాడ అజయ్‌కుమార్‌కే దక్కింది. సాక్షాత్తు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపునకు దాతలు తమ విరాళాలను అందించి కరోనా మహమ్మారిని తరిమి వేసేందుకు భాగస్వాములవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఖమ్మం జిల్లా నుంచి పలువురు దాతలకు సూచించడంతో విరాళాలు వెల్లువలా వచ్చాయి. ఖమ్మం నుంచి వివిధ రంగాల వ్యాపారులు, విద్యా,వైద్య సంస్థలు, వర్తక వ్యాపారులు, కాంట్రాక్టర్లు ముందుకొచ్చి రూ. 1.75కోట్లు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు అందజేశారు. ఈ క్రమంలోనే మమత వైద్య విద్యా సంస్థల చైర్మన్‌, మంత్రి అజయ్‌కుమార్‌ కూడా భారీ మొత్తంలో రూ. 25 లక్షలు విరాళమిచ్చారు. అంతేకాకుండా కొవిడ్‌-19 మహమ్మారిపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా తన నియోజకవర్గమైన ఖమ్మంలో భారీ స్థాయిలో విరాళాలు సేకరించారు.సోమవారం మధ్యా హ్నం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఆ మొత్తాన్ని సీఎంకు అందజేశారు. దీంతో మంత్రి అజయ్‌కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఖమ్మం జిల్లాలో కరోనా నియంత్రణ కోసం చేపట్టిన చర్యలను మంత్రి అజయ్‌కుమార్‌ సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. కరోనా నివారణ ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం మరింతగా పునరంకితమవుతూ తోటి రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇలాంటి ఎన్నో విపత్కర సవాళ్లు ఎదురైనప్పుడు దాతలు అండగా నిలిచారని ఆయన గుర్తుచేశారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి, వైరస్‌వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం జరిపే పోరాటానికి అండగా నిలవడానికి దాతల సహాయం అభినందనీయమన్నారు. సీఎం పిలుపుతో తాను చేసిన విన్నపం మేరకు ఖమ్మం జిల్లాలో ముం దుకు వచ్చి విరాళాలను అందించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ బృహత్కార్యంలో పలువురు భాగస్వాములై తమ వంతు సహాయం అందించడం స్ఫూర్తిదాయకమన్నారు. సీఎం కేసీఆర్‌ మార్గ నిర్దేశాలతో కరోనా నియంత్రణ కోసం వైద్యులు, వైద్యసిబ్బంది చేస్తున్న సేవలకు తెలంగాణ సమాజం అభినందనలు చెబుతుందన్నారు. కొవిడ్‌-19 వంటి ప్రజారోగ్య సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ఇలాంటి మహమ్మారిని కట్టడి చేయడానికి సమిష్టి కృషి అవసరమన్నారు. ప్రజలు స్వీయ నిర్బంధంగా ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. కరోనాని అరికట్టడంలో మనమంతా భాగస్వాములవ్వాలని మంత్రి పిలుపునిచ్చారు.