గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Apr 06, 2020 , 01:34:10

రానున్న పది రోజుల్లో అప్రమత్తంగా ఉండాలి

రానున్న పది రోజుల్లో అప్రమత్తంగా ఉండాలి

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి 

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: రానున్న పది రోజుల్లో కరోనా వైరస్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీరెడ్డి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐసీయూ, ఐసోలేషన్‌ వార్డులతో పాటు క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పారు. రానున్న రోజులను దృష్టిలో ఉంచుకొని పకడ్బందీగా చర్యలు చేపట్టాలని, అవసరమైన పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఇతర రాష్ర్టాలనుంచి జిల్లాలోకి ప్రవేశించే ప్రజలను పరిశీలించేందుకు ప్రతి చెక్‌పోస్టులో స్క్రీనింగ్‌ యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. జిల్లాకు ఇతర రాష్ర్టాల నుంచి 15,029 మంది వ్యవసాయ, ఇతర కార్మికులను గుర్తించి వారి జీవనోపాధికి 12 కేజీల బియ్యం, రూ.500 నగదు పంపిణీ చేశామన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో భాస్కర్‌ నాయక్‌, ఆస్పత్రుల సమన్వయ అధికారి రమేశ్‌, జిల్లా ఆఫీసర్‌ చేతన్‌ మణుగూర్‌ క్వారంటైన్‌ కేంద్రం పర్యవేక్షకుడు నరేష్‌, డీఎస్‌వో చంద్రప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మహిళా సంఘాల ద్వారా మాస్క్‌లు తయారు చేయించాలి

  • రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : కరోనా వ్యాధి నియంత్రణకు కొరత రాకుండా మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా మాస్క్‌లు తయారు చేయించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రానున్న పది రోజులు అత్యంత కీలకమైనవని, ప్రజలు బయటకు  రాకుండా నియంత్రించేందుకు మొబైల్‌ వాహనాల ద్వారా వస్తువులు విక్రయించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మర్కజ్‌ నుంచి వచ్చిన 10 మందిని గుర్తించి మణుగూరులో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రానికి తరలించామని, కుటుంబ సభ్యులు, సన్నిహితులు 56 మందిని గర్తించి ఇంటిలో క్వారంటైన్‌ చేశామన్నారు. నాలుగు పాజిటివ్‌ కేసుల్లో ఇద్దరు వ్యక్తులు గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం వైద్యులు వారిని డిశ్చార్జ్‌ చేశారని, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో భాస్కర్‌ నాయక్‌, డీసీహెచ్‌ఎస్‌ రమేష్‌, జిల్లా ఆఫీసర్‌ చేతన్‌, మణుగూరు క్వారంటైన్‌ సెంటర్‌ ఇన్‌చార్జి నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

నాణ్యతలేని రేషన్‌ బియ్యం సరఫరా చేస్తే 

  • కఠిన చర్యలు : కలెక్టర్‌

చండ్రుగొండ: రేషన్‌ షాపుల్లో నాణ్యతలేని బియ్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వాటిని పక్కన పెట్టి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ ఎంవీరెడ్డి డీలర్లకు సూచించారు. చండ్రుగొండ మండలంలో ఆయన అకస్మికంగా పర్యటించారు. రేషన్‌షాప్‌లను తనిఖీ చేసి మ్యానువల్‌గా ఉచిత బియ్యం సరఫరా చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రధాన సెంటర్‌లోని పండ్లు, కూరగాయల దుకాణాలను తనిఖీ చేశారు. అధికారుల ఫోన్‌నెంబర్లు, ధరల డిస్లే చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి, రేపటి నుంచి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. చండ్రుగొండకు చెందిన జహీర్‌హుస్సేన్‌ సౌదీ ఆరేబియా నుంచి వచ్చి, క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి చంద్రప్రకాశ్‌, కొత్తగూడెం ఆర్డీవో స్వర్ణలత, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, తహసీల్దార్‌ వై శ్రీనివాసులు,ఎంపీడీవో ఏలూరి శ్రీనివాసులు, మెడికల్‌ అధికారి డాక్టర్‌ గీత,  ఎస్సై బీ రాజేశ్‌కుమార్‌, కొత్తగూడెం ఎక్సైజ్‌శాఖ సీఐ నరేందర్‌, జిల్లా పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ రసూల్‌, సర్పంచ్‌ బానోత్‌ రన్యా పాల్గొన్నారు.