మంగళవారం 07 జూలై 2020
Badradri-kothagudem - Mar 30, 2020 , 01:04:09

గడప దాటట్లే..

గడప దాటట్లే..

  • ఇళ్లకే పరిమితమైన జనం
  • అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద 
  • పటిష్టమైన బందోబస్తు
  • ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రజలు స్వీయ నిర్బంధంలోనే ఉంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఆదివారం లాక్‌డౌన్‌కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గ్రామాల్లో వైరస్‌ విస్తరించకుండా ఉండేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు బ్లీచింగ్‌ పౌడర్‌, రసాయనాలు చల్లుతూ పారిశుధ్య పనులు చేపడుతున్నారు. సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది, ఆశాలు, అంగన్‌వాడీ టీచర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఇంటింటికీ తిరుగుతూ కరోనా లక్షణాలు ఉన్నవారి వివరాలను నమోదు చేసి అధికారులకు సమాచారం అందిస్తున్నారు. విదేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారిని క్షుణ్ణంగా పరిశీలించి అనుమానితులను వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. లక్షణాలు లేని వారిని సైతం హోం క్వారెంటైన్‌లో ఉండాలని సూచించారు. 

ఇళ్లకే పరిమితమైన జనం.. 

కరోనా బాధితులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ గృహనిర్బంధంలోనే ఉండి పిల్లాపాపలతో కాలక్షేపం చేస్తున్నారు. ఉదయం నిత్యావసరాలు మినహా దేనికీ బయటకు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌కు తమ మద్దతు తెలుపుతున్నారు. అత్యవసర సేవలకు సంబంధించిన ఉద్యోగులు మినహా మిగిలిన వారు ఇంటికే పరిమితమయ్యారు. గ్రామ పొలిమేరల్లో కంచెలను ఏర్పాటు చేసి బయటి వ్యక్తులు ఎవరూ తమ గ్రామాల్లోకి రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. 

అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టుల వద్ద పటిష్ట్ట బందోబస్తు

అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులైన అశ్వారావుపేట, భద్రాచలం చింతూరు రోడ్డు, దుమ్ముగూడెం, దమ్మపేట తదితర అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టుల వద్ద పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అత్యవసరమైన వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రా తదితర రాష్ర్టాల నుంచి జిల్లాలోకి ప్రవేశించే వారిని అడ్డుకొని తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇతరులను జిల్లాలోకి అనుమతించడం లేదు. 

నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చినా హోం క్వారంటైన్‌లోనే

విదేశాల నుంచి ఇప్పటి వరకు 180 మంది జిల్లాకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వారందరికీ వైద్య పరీక్షలు చేయించారు. జ్వరం, దగ్గు ఉన్నవారిని ఇంటి వద్దనే ఉండి వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వారిని ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పర్యవేక్షిస్తున్నారు. వారు ఇళ్ల నుంచి బయటికి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వైద్య పరీక్షలు చేయించుకొని నెగెటివ్‌ వచ్చినా సరే హోం క్వారంటైన్‌లోనే ఉండాలని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

కరోనాపై విజయమే అంతిమలక్ష్యం.. 

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శనివారం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు పాజిటివ్‌ కేసులు వచ్చిన నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేసి కరోనా వ్యాప్తి నివారణకు తమవంతు సహకరించాలని కోరారు. వీలైనన్ని ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని, సింగరేణి సీఎండీతో మాట్లాడి సింగరేణి ఆస్పత్రుల్లో కూడా వార్డులను సిద్ధం చేయాలన్నారు. ఇప్పటి వరకు తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని, పాజిటివ్‌ కేసులు నమోదైనా పరిస్థితి అదుపు తప్పకుండా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి నేతృత్వంలో తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని, రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండి కరోనాను తరిమికొట్టాలన్నారు. ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. 


logo