సోమవారం 13 జూలై 2020
Badradri-kothagudem - Mar 30, 2020 , 01:09:14

ఏప్రిల్‌ 2న శ్రీసీతారాముల కల్యాణం

ఏప్రిల్‌ 2న శ్రీసీతారాముల కల్యాణం

  • 3న శ్రీరామపట్టాభిషేకం
  • ఆలయ ప్రాంగణంలోనే నవమి వేడుకలు

భద్రాచలం, నమస్తే తెలంగాణ మార్చి 29: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ నిర్వహించారు. ఉదయం ప్రాకార మండపం వద్దకు శ్రీసీతారాముల వారిని తీసుకొచ్చారు. గోదావరి నది నుంచి అర్చక స్వాములు తీర్థబిందెను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యఃవచనం, పరిషత్‌ దక్షిణ, రక్షాబంధనం నిర్వహించారు. మూలమూర్తుల వద్దకు వెళ్లి మూలవిరాట్‌కు, ఉత్సవ మూర్తులకు, నిత్యకల్యాణ మూర్తులకు, పరివార దేవతలకు కంకణాలను అభిషేకించారు. ఆచార్య, బ్రహ్మ, రుత్వికులకు, ఆలయ అధికారులకు కంకణధారణ చేశారు. దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి జీ.నరసింహులు ఇతిహాస పురాణాది రుత్వికులు 28 మందికి దీక్షా వస్ర్తాలు సమర్పించి కంకణధారణ చేశారు. అనంతరం స్వామికి నవకలశ స్నపనం జరిపించారు. సాయంత్రం యాగశాల వద్దకు చేరుకొని అంకురార్పణ హోమం, అఖండదీపారాధన చేశారు. ఈ నెల 30న ధ్వజపట భద్రకమండలేఖనం, గరుడాదివాసం, 31న అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, ఏప్రిల్‌1న ఎదుర్కోలు ఉత్సవం, ఏప్రిల్‌ 2న శ్రీసీతారాముల కల్యాణం, ఏప్రిల్‌ 3న శ్రీరామ మహా పట్టాభిషేకం వేడుకలు నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో ఈ వేడుకలు జరగనున్నాయి. దేవస్థానం ఈవో జీ.నరసింహులు ఆలయ ప్రాంగణంలో నిర్వహించే ఈ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లను చేస్తున్నారు.  


logo