శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 30, 2020 , 01:04:09

అడుగడుగునా లాక్‌డౌన్‌

అడుగడుగునా లాక్‌డౌన్‌

  • నిరంతరం పోలీసుల తనిఖీ
  • బయటకు రావద్దంటూ విజ్ఞప్తులు
  • పర్యవేక్షించిన సీపీ తఫ్సీర్‌ఇక్బాల్‌ 

ఖమ్మం క్రైం/ మయూరి సెంటర్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌ -19) వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రభుత్వం విధించిన ఆంక్షలకు అనుగుణంగా ప్రజలను బయటికి రానివ్వకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం జిల్లాలోని సత్తుపల్లి, వైరా, మధిర, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో ఉన్న ప్రధాన రహదారుల వెంట బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను అనుమతించకుండా చర్యలు చేపట్టారు. వివిధ సబ్‌ డివిజన్లలో ఏసీపీలు నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు. ఉదయం 7 గంటల తరువాత నిత్యావసర వస్తువుల కోసం బయటికి వచ్చిన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. ఉదయం 9 గంటల తరువాత రోడ్లపై ప్రజలు లేకుండా చర్యలు తీసుకున్నారు. 

వివిధ మండలాల్లోని కూరగాయల మార్కెట్లకు ప్రజలు ఎక్కువగా రాకుండా చర్యలు తీసుకున్నారు. నాయకన్‌గూడెం, బోనకల్లు, కల్లూరు, సత్తుపల్లి సరిహద్దుల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను కట్టడి చేశారు. నిత్యావసర సరకులు రవాణా చేసే వాహనాలను మాత్రమే జిల్లాలోకి అనుమతించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ సూచనలు చేస్తూ ఖమ్మం జిల్లాలో లాక్‌డౌన్‌ను పర్వవేక్షించారు. జిల్లాలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, ఫౌండేషన్ల బాధ్యులు విధుల్లోని పోలీసులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఖమ్మం నగరంలో వివిధ మండలాల, వివిధ గ్రామాల నుంచి మిర్చి తీసుకొని మార్కెట్‌కు వచ్చిన రైతులకు పోలీసు సిబ్బంది అన్నదానం చేశారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వస్తున్న ప్రజలను బయటికిరావద్దంటూ దండాలు పెడుతూ విజ్ఞప్తి చేశారు. వివిధ ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చిన వాహనదారుల ముఖానికి మాస్కులు లేకపోవడంతో పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. బయటకు వచ్చేటప్పుడు మాస్కులు ధరించి రావాలని సూచించారు. సాయంత్రం 7 తరువాత బయటికి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్‌ చేసి స్టేషన్లకు తరలించారు. అడిషనల్‌ డీసీపీ మురళీధర్‌, ఏసీపీలు రామోజీ రమేశ్‌, వెంకటరెడ్డి, వెంకట్రావు, సీఐలు పాల్గొన్నారు.

‘వైరస్‌ నివారణకు జాగ్రత్తలు అవసరం’ 

కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ వ్యాప్తి నివారణకు జాగ్రత్తలు అవసరమని జిల్లా వైద్యారోగ్యశాఖ ఆరోగ్య విస్తరణాధికారి సీహెచ్‌వీ రమణ పేర్కొన్నారు. ఖమ్మంలోని 21, 22, 23, 24 డివిజన్లలో ఆదివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆశాలు, మెప్మా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సామాజిక దూరం పాటించండి: సీపీ 

సామాజిక దూరం పాటించి కరోనాను కట్టడి చేయాలని పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ సూచించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఖమ్మం నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఆయన పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజాలేవరూ రోడ్లపైకి రాకుండా స్వీయ నిర్బంధాన్ని కచ్చితంగా పాటించాలని సూచించారు. నిర్దేశించిన సమయంలో మాత్రమే నిత్యావసర సరుకుల కొనుగోలు చేయాలన్నారు. ఆ సమయంలో గుంపులుగా చేరకుండా జాగ్రత్తలు తీసుకొవాలన్నారు. ఖమ్మం బస్టాండ్‌, మయూరిసెంటర్‌, జడ్పీసెంటర్‌, ఇల్లెందు క్రాస్‌రోడ్‌, కాల్వొడ్డు, కమాన్‌బజార్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను సీపీ పరిశీలించారు. పోలీసులకు, వాహనదారులకు, ప్రజలకు పలు సూచనలు చేశారు. అడిషనల్‌ డీసీపీ మురళీధర్‌, ఏసీపీలు రామోజీ రమేశ్‌, వెంకటరెడ్డి, వెంకట్రావు, సీఐలు తదితరులు పాల్గొన్నారు. వైద్యారోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఐసోలేషన్‌ వార్డు సందర్శన

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలోని ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డును జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయ అధికారి, ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బీ.వెంకటేశ్వర్లు ఆదివారం సందర్శించారు. అనుమానితులకు అందుతున్న వైద్యసేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదన్నారు.