మంగళవారం 14 జూలై 2020
Badradri-kothagudem - Mar 28, 2020 , 02:11:52

మేము సైతం..

మేము సైతం..

  • కదం తొక్కుతాం.. కరోనాను తరుముతాం..
  • లాక్‌డౌన్‌కు సహకరిస్తున్న  పల్లె వాసులు
  • అధికార యంత్రాంగానికి ప్రజల సంపూర్ణ సహకారం
  • గ్రామాల్లో పారిశుధ్య పనులు 
  • బ్లీచింగ్‌, వైరస్‌ నివారణ మందుల పిచికారీ 
  • కొత్తవారు గ్రామానికి రాకుండా చర్యలు
  • రాష్ట్ర సరిహద్దుల వద్ద కొనసాగుతున్న తనిఖీలు
  • ప్రజలతో మమేకమవుతున్న ప్రజాప్రతినిధులు
  • ఇంటింటి సర్వేలో వైద్యారోగ్య సిబ్బంది
  • ముఖ్యమంత్రి సహాయ నిధికి వ్యాపారుల విరాళాలు

కొవిడ్‌-19ను కట్టడికి చేయడంలో పల్లెవాసులు అపూర్వ చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తిని స్వీకరించి స్వీయ నిర్బంధాన్ని పాటిస్తున్నారు.. గ్రామాలు, గిరిజన గూడేల్లో కరోనా మహమ్మారి వ్యాపించకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నారు.. అధికార యంత్రాంగానికి సంపూర్ణంగా సహకరిస్తున్నారు.. ఎవరి ఇంటి పరిసరాల్లో వారు పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు.. మంచినీటి సరఫరా కేంద్రాలు, కిరాణా దుకాణాల వద్ద సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇతరులకూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.. ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటిస్తూ గ్రామస్థులకు కరోనా నివారణపై అవగాహన కల్పిస్తున్నారు.. వైద్యారోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నారు..   

మామిళ్లగూడెం/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు కరోనాపై యుద్ధానికి పల్లెఅలు కదం తొక్కాయి. మహమ్మారిలా వ్యాపించే కరోనా వైరస్‌ను అక్కడికక్కడే అదుపు చేసేందుకు గ్రామాల్లో ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఎంతో చైతన్యంతో ముందుకు కదులుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వైరస్‌, బ్యాక్టీరియాల వ్యాప్తిని నిరోధించేందుకు గ్రామాల్లో పెద్ద ఎత్తున బ్లీచింగ్‌, ఇతర క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, ఇతర ప్రభుత్వ అధికారులు ఇంటింటికీ తిరిగి ప్రజలను కరోనా వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని చైతన్య పరుస్తున్నారు. అంతేకాకుండా జిల్లాలోని 584 గ్రామపంచాయతీ  కార్యదర్శులకు కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ సూచనల మేరకు జిల్లా అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి (స్థానిక సంస్థలు) గ్రామాల్లో చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు.  

తీసుకుంటున్న చర్యలు ఇవే..

గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు, వీఆర్‌ఏలు, అంగన్‌వాడీ, ఆశ వర్కర్లు, ఇతర ప్రభుత్వ సిబ్బందితో గ్రామాల్లో ప్రత్యేక సర్వేలను నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఉండే కిరాణ, ఇతర దుకాణాల్లో జనం గూమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క షాపు ముందు మీటరు దూరం సామాజిక దూరాన్ని పాటించే విధంగా ముగ్గులను వేసి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి రోజు గ్రామాల్లో పారిశుధ్య పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. ప్రతి దుకాణం ముందు కొనుగోలు దారులు చేతులు శుభ్రం చేసుకునే విధంగా సబ్బు, నీళ్లతో పాటు శానిటైజర్లను ఏర్పాటు చేయిస్తున్నారు. ఇతర దేశాలు, రాష్ర్టాల నుంచి ఆయా గ్రామాలకు వచ్చిన వారి వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందజేస్తున్నారు. ప్రధానంగా గ్రామాల్లో ఇప్పటికే వివిధ రకాల జబ్బులతో బాధపడే వారి జాబితాతో పాటు ప్రస్తుతం జ్వరం, దగ్గు, జలుబు, ఇతర లక్షణాలు కలిగిన వారి వివరాలు సేకరించి వెంటనే వైద్యం అందించేందుకు ఉన్నతాధికారులకు నివేదికలను ఎప్పటికప్పుడు పంపిస్తున్నారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను పెంచకుండా దుకాణ వ్యాపారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. గ్రామాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ద్విచక్ర వాహనాలపై ఒకరూ, నాలుగు చక్రాల వాహనాలల్లో ఇద్దరు మాత్రమే ప్రయాణించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి పూట ప్రజలెవరూ బయట సంచరించకుండా చాటింపు వేయించి గస్తీ కాస్తున్నారు. ప్రతి గ్రామంలో దేవాలయం, చర్చి, మసీదుల్లో సామూహిక మత ప్రార్థనలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా పెండ్లిలు, రాజకీయ సాంస్కృతిక, వినోద, క్రీడా కార్యక్రమాలను నిర్వహించకుండా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు, గ్రామీణ వ్యవసాయ పనులకు వెళ్తున్న కూలీలకు జాగ్రత్తలు సూచిస్తున్నారు. గ్రామాల్లో పండిన పంటలు ఆ గ్రామాల్లోనే వినియోగించేలా ప్రజలను చైతన్యపరుస్తున్నారు. కరోనా వ్యాప్తిపై ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో గ్రామాల్లో లాక్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రజలు కూడా సహకారాన్ని అందిస్తున్నారు. 


logo