శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 28, 2020 , 02:09:11

స్వచ్ఛందంగా నిర్బంధం పాటించండి..

స్వచ్ఛందంగా నిర్బంధం పాటించండి..

  • అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దు
  • లాక్‌డౌన్‌కు పతిఒక్కరూ సహకరించండి
  • మనకోసం మనం మరో20 రోజులు కష్టపడాలి
  • మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
  • లాక్‌డౌన్‌ పరిశీలన.. 
  • అధికారులు, ప్రజలకు సలహాలు, సూచనలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వం చేపట్టిన లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ప్రజలకు సూచించారు.. శుక్రవారం ఆయన ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కూరగాయల విక్రయ కేంద్రాలను పరిశీలించారు.. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.. సూపర్‌ మార్కెట్లలో ధరల నియంత్రణ పాటించాలని అత్యధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు..  

ఖమ్మం, నమస్తే తెలంగాణ: ‘లాక్‌డౌన్‌ను ప్రజలు అర్థం చేసుకోండి.. అత్యవసరమైతే తప్ప ఇంటినుంచి బయటకు రావద్దు.. నిత్యావసరాలు ప్రజలందరికీ సరిపడా నిల్వలు ఉన్నాయి. కూరగాయలను కూడా డివిజన్ల పరిధిలోనే అందిస్తున్నాం.. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలందరూ స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం పాటించాలి..’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌తో కలిసి నగరంలో పర్యటించారు. హోల్‌సేల్‌ వ్యాపారస్తులు రిటైల్‌ వ్యాపారం చేయరాదన్నారు. ప్రజలందరూ ఒకేచోట గుమికూడరాదన్నారు. హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని సరిహద్దు రాష్ర్టాల నుంచి దిగుమతి అయ్యే ఆయిల్‌, పప్పు ధాన్యాలు, పంచదార రవాణాకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. నిత్యావసర దుకాణాలు, మందుల దుకాణాల వద్ద సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను సందర్శించారు. వ్యాపార లావాదేవీలపై ఆరా తీశారు. వైరా రోడ్‌లోని మోర్‌ సూపర్‌ మార్కెట్‌, గాంధీచౌక్‌లోని హోల్‌సేల్‌ కిరాణ షాపులు, గాంధీనగర్‌లోని కూరగాయల మార్కెట్లను మంత్రి పరిశీలించారు. గాంధీచౌక్‌లోని కిరాణం, హోల్‌సేల్‌ వ్యాపారస్తులతో మాట్లాడారు. అధిక ధరలకు సరుకులు విక్రయించరాదని హెచ్చరించారు. పోలీస్‌, రెవెన్యూ, వైద్యారోగ్యశాఖ అధికారులు, మీడియా మిత్రులు తమ కుటుంబాలకు దూరమై మనకు సేవలు అందిస్తున్నారని, దీన్ని గమనించి ప్రజలు సహకరించాలని కోరారు. జిల్లా సరిహద్దు రాష్ర్టాల నుంచి వచ్చే లారీ నెంబర్లు సేకరించి, ఆ మార్గంలో వారికి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. సంబంధిత కలెక్టర్లతో మాట్లాడుతామన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, అదనపు కలెక్టర్‌ ఎన్‌.మధుసూదన్‌రావు, రెవెన్యూ డివిజనల్‌ అధికారి రవీంద్రనాథ్‌, అర్బన్‌ తహసీల్దారు శ్రీనివాసరావు ఉన్నారు.

నేడు మంత్రి పువ్వాడ పర్యటన

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: మంత్రి అజయ్‌కుమార్‌ శనివారం భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. జడ్పీ చైర్మన్‌, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి కరోనా నివారణ చర్యలు గురించి తెలుసుకోనున్నారు. కొత్తగూడెం క్లబ్‌లో ఉదయం 11 గంటలకు సమీక్షించనున్నట్లు అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు.