గురువారం 02 ఏప్రిల్ 2020
Badradri-kothagudem - Mar 22, 2020 , 02:58:52

అటవీ భూములకు రక్షణ

అటవీ భూములకు రక్షణ

  • భూమి సరిహద్దుల వెంట రక్షణ వలయాలు
  • ప్రహరీ నిర్మాణాలతో పాటు ఫెన్సింగ్‌ ఏర్పాటు
  • నిర్మాణాలకు రూ.4.85 కోట్ల కేటాయింపు

లక్ష్మీదేవిపల్లి: అటవీ భూములను సంరక్షించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపట్టింది. ఆక్రమణదారులు పోడు పేరుతో అటవీ భూమిని ఆక్రమించడం, ఇతరులు భూములను ఆక్రమించుకుని సాగు చేస్తుండటంతో వందల ఎకరాల అటవీ భూమికి ముప్పు వాటిల్లుతున్నది. అటవీ సిబ్బంది ఈ భూములను రక్షించేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా వివాదమవుతున్న నేపథ్యంలో భూమిని రక్షించేందుకు అటవీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా అటవీ భూముల సరిహద్దులను గుర్తించి ప్రహరీ నిర్మించనున్నారు. ఫెన్సింగ్‌ నిర్మాణంతో పాటు కందకాలు తవ్వి వదిలేస్తున్నారు. వీటిని అతిక్రమించి లోనికి వస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

భద్రాద్రి జిల్లాలో అధిక విస్తీర్ణం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4,33,483 హెక్టార్ల అటవీ భూమి ఉంది. ఎక్కువగా గిరిజన ప్రాంతం ఉండటంతో పోడు వ్యవసాయం చేసే వారు ఎక్కువ. దీంతో గత కొన్ని దశాబ్ధాలుగా అటవీ ప్రాంతాన్ని నరికి పోడు వ్యవసాయం చేస్తున్నారు. దీంతో అటవీ భూమి విస్తీర్ణం ఏటికేడు తగ్గుతూ వస్తున్నది. ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న అటవీ సిబ్బందిపై పోడుదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, వైల్డ్‌లైఫ్‌ కిన్నెరసాని డివిజన్ల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ రక్షణ చర్యలు చేపట్టారు.  

ఏడు కిలోమీటర్లకు పైగా ప్రహరీ..

జిల్లాలోని కొత్తగూడెం డివిజన్‌ పరిధిలోని లక్ష్మీదేవిపల్లి అటవీ ప్రాంతంలో ప్రహరీ నిర్మాణానికి నిర్ణయించారు. డివిజన్‌ పరిధిలోని 7.55 కిలోమీటర్ల పరిధిలో గోడల నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తి చేశారు. ఇందుకోసం రూ.4.85కోట్లను కేటాయించారు. దీంతో అటవీ భూములకు పూర్తిస్థాయిలో రక్షణ ఏర్పడినట్లయింది. జిల్లాలోని అన్ని డివిజన్లలో మొదటగా కొత్తగూడెం డివిజన్‌లో ఈ గోడల నిర్మాణాన్ని చేపట్టారు. ప్రహరీ నిర్మాణాల తర్వాత కందకాలు తవ్వి సరిహద్దులను నిర్ణయించారు. జిల్లావ్యాప్తంగా 81.94 కిలోమీటర్ల పరిధిలో ఈ కందకాలను తవ్విస్తున్నారు. 

అటవీ భూముల రక్షణకు ప్రాధాన్యం 

అటవీ భూముల రక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నది. అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం అటవీ భూమి సరిహద్దులను గుర్తించి చుట్టూ ప్రహరీ నిర్మిస్తున్నాం. ట్రెంచ్‌, ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఈ చర్యలతో అటవీ భూములకు రక్షణ ఏర్పడనున్నది. జిల్లాలో ప్రహరీ నిర్మాణాలు పూర్తి కాగా ఫెన్సింగ్‌, ట్రెంచ్‌ పనులు కొనసాగుతున్నాయి.

- లక్ష్మణ్‌ రంజిత్‌నాయక్‌, డీఎఫ్‌వో


logo