మంగళవారం 31 మార్చి 2020
Badradri-kothagudem - Mar 22, 2020 , 02:59:53

భవన నిర్మాణానికి సులువుగా అనుమతులు

భవన నిర్మాణానికి సులువుగా అనుమతులు

  • ఏప్రిల్‌ 2 నుంచి బీ-పాస్‌ అనుమతులు
  • ఆన్‌లైన్‌లో అన్ని పనులు పూర్తి
  • నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా
  • టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందికి తొలి విడుత శిక్షణ పూర్తి

కొత్తగూడెం అర్బన్‌: భవన నిర్మాణాల అనుమతులను సులభతరం చేసి ఇంటి యజమానులకు ఊరట కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బిల్డింగ్‌ పర్మిషన్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌(బీ-పాస్‌)ను నూతనంగా ప్రవేశపెట్టబోతున్నది. వచ్చే నెల 2 నుంచి ఈ నూతన విధానం అమలుకానున్నది. దీంతో కొన్నేళ్లుగా ఇంటిని నిర్మించుకునేందుకు, షాపింగ్‌ మాళ్ల అనుమతులు తీసుకునేందుకు అన్ని కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తరుగుతున్న యజమాను సమయం వృథా, అనుమతులలో జాప్యంతో పాటు అధిక వ్యయ ప్రయాసకు ఫుల్‌స్టాప్‌ పడనుంది. నూతన మున్సిపల్‌ చట్టం-2019 ప్రకారం ఈ బీ-పాస్‌ విధానాన్ని ఏప్రిల్‌ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో లాంఛనంగా మున్సిపల్‌శాఖ ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు.

21 రోజుల్లో అనుమతులు

ఇండ్లు, షాపింగ్‌ మాళ్లు నిర్మించుకునే యజమానులు అన్ని రకాల అనుమతులను ఇచ్చేందుకు ప్రభుత్వం 21రోజుల వ్యవధి ఇచ్చింది. భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు పక్కాగా ఉంటే ఆన్‌లైన్‌లో ఎవరికి వారే సొంతంగా స్వీయ ధ్రువీకరణతో అనుమతులను ఇచ్చేలా బీ పాస్‌ను రూపొందించారు. 75 గజాల నుంచి 200 చదరపు గజాల్లో జీ ప్లస్‌ ఇంటిని నిర్మిస్తే ప్లాన్‌ లేకుండానే టీఎస్‌ బీ-పాస్‌ విధానం ద్వారా భవన నిర్మాణాల అనుమతి స్వీయ ధ్రువీకరణ ఆధారంగా రూ.1తో వెంటనే ఆన్‌లైన్‌లో అనుమతులను ఇచ్చేలా రూపకల్పన చేశారు. 200 చదరపు గజాల నుంచి 500 చదరపు గజాల వరకు గల ప్లాట్లలో జీ ప్లస్‌ టూ అంతస్థుల వరకు గృహ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంతో పాటు స్వాధీన ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది. ఏరియాను బట్టి, స్థల విస్తీర్ణాన్ని బట్టి, మార్కెట్‌ విలువ ప్రకారం తొలుత సాధారణ ఫీజును ఆ తర్వాత అనుమతి వచ్చాక 14రోజుల అనంతరం 21 రోజుల లోపు మిగతా ఫీజు చెల్లించి స్వేచ్ఛగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భవనాలు నిర్మించుకునేలా ఈ విధానాన్ని అమలు చేయనున్నది. 200 చదరపు గజాల నుంచి 500 చదరపు గజాల కంటే ఎక్కువ స్థలంలో ఇంటిని కానీ, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లను కానీ జీ ప్లస్‌ టూ 10 మీటర్ల ఎత్తు నిర్మించే భవనాలను నిర్మించదలిస్తే ఇంటి యజమాని, అర్కిటెక్ట్‌ ద్వారా ధ్రువీకరించి స్వీయ ధ్రువీకరణ ద్వారా అక్యూపెన్సీ సర్టిఫికెట్‌ను 15 రోజుల్లోగా జారీ చేయనున్నారు.

లే ఔట్లకు అనుమతులు..

లే ఔట్‌ అనుమతుల విషయానికి వస్తే తాత్కాలిక లే ఔట్‌ ప్లాన్‌ అనుమతి, లే ఔట్‌ పూర్తి చేసిన అనంతరం డెవలప్‌ సంతకం, లైసెన్స్‌ టెక్నికల్‌ పర్సన్‌తో అటెస్టెడ్‌ చేసిన స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఆన్‌లైన్‌లోనే జిల్లా కమిటీ అమోదించి, ఆమోదించిన ఫైనల్‌ లే ఔట్‌ డెవలపర్‌కు ఆన్‌లైన్‌లోనే అనుమతులు ఇస్తారు. అనధికార కట్టడాలు, లే ఔట్లను గుర్తించేందుకు కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ప్రభుత్వం నియమిస్తుంది. అనుమతులు వచ్చాక ఆరు నెలలలోపు భవన నిర్మాణాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. రెండు సంవత్సరాలలోపు నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. 

నియమాలు అతిక్రమిస్తే చర్యలు..

నూతనంగా తీసుకువస్తున్న బీ-పాస్‌ విధానంలో నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానా విధించేలా నిబంధనలు ఉన్నాయి. సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ (స్వీయ ధ్రువీకరణ) ఇచ్చిన వివరాలతో ఇంటిని నిర్మిస్తే యజమానులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనుమతులు ఇచ్చిన తర్వాత మున్సిపల్‌, పోలీస్‌, రెవెన్యూ, అగ్నిమాపకశాఖ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీం రంగంలోకి దిగి వచ్చి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. నిర్మాణానికి అనుమతి తీసుకునే ముందు సమర్పించిన ధ్రువపత్రాలు, నిర్మాణాల పరిధి వివరాలు సక్రమంగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ భవన యజమానికి సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌లో భవన నిర్మాణ అనుమతులు పొందే సమయంలో దరఖాస్తుదారుడు సమర్పించిన ధ్రువపత్రాలు, భవన నిర్మాణ స్థలంలో తేడాలు ఉంటే ప్రభుత్వం నియమించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీం సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి 25శాతం అదనంగా జరిమానా విధిస్తారు. లేదా ముందస్తుగా సమాచారం ఇచ్చి నిర్మాణాన్ని కూల్చివేసే అధికారాన్ని ప్రభుత్వం కల్పించింది.

తొలి విడుత అవగాహన పూర్తి.. 

ప్రస్తుతం పైలట్‌ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని 10మున్సిపాలిటీల్లో ఈ బీ పాస్‌ విధానం అమలు చేస్తున్నారు. ఇందులో ఎదురయ్యే సమస్యలను తెలుసుకొని భవిష్యత్తులో తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది, లైసెన్స్‌డ్‌ టెక్నికల్‌ పర్సన్‌లకు వారం రోజుల క్రితం ఉన్నతాధికారులు అవగాహన కల్పించారు. ఈ వారంలో మరోసారి శిక్షణ ఇవ్వనున్నారు.

ఏప్రిల్‌ 2 నుంచి బీ పాస్‌ అమలుకు శ్రీకారం

వచ్చే నెల 2 నుంచి బీ పాస్‌ విధానాన్ని మున్సిపాలిటీల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలను చేపడుతున్నది. ఇప్పటికే టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందికి ఈ విధానంపై అవగాహన కల్పించారు. ఈ విధానం వల్ల సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ ఆధారంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు ఇస్తారు. పురపాలక శాఖ పరిధిలో భవనాలను నిర్మించుకునేవారు మీసేవ ద్వారా కానీ, సీనియర్‌ సిటిజెన్‌ సర్వీస్‌ సెంటర్‌ల్లో ఆన్‌లైన్‌లో అనుమతులు పొందవచ్చు.

-అరిగెల సంపత్‌కుమార్‌,  కొత్తగూడెం మున్సిపల్‌ కమిషనర్‌ 


logo
>>>>>>