గురువారం 02 ఏప్రిల్ 2020
Badradri-kothagudem - Mar 22, 2020 , 02:59:26

పాటిద్దాం.. తరిమేద్దాం..

పాటిద్దాం.. తరిమేద్దాం..

  • నేడు జిల్లాలో జనతా కర్ఫ్యూ
  • 24 గంటల పాటు అమలు
  • ప్రజారవాణా పూర్తిగా బంద్‌
  • కరోనా నివారణకు స్వీయ నియంత్రణే మార్గం
  •  ప్రజలందరూ ఇంటికి పరిమితమైతే..సురక్షితం
  •  కర్ఫ్యూ ప్రాముఖ్యతను వివరించిన జిల్లా యంత్రాంగం
  •  కలెక్టర్‌ ఎంవీ రెడ్డి నేతృత్వంలో అప్రమత్తమైన అధికారులు

ఒక్కరోజు మనం పాటించే స్వీయ నియంత్రణ మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని కరోనా బారి నుంచి కాపాడుతుంది.. ఒకరి నుంచి మరొకరికి ప్రాణాంతక వ్యాధి ప్రబలే గొలుసును ఛేదిస్తుంది.. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రధానమంత్రి మోదీ ఈ ‘జనతా కర్ఫ్యూ’కు పిలుపునిచ్చారు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం దానికి మద్దతు పలికి ప్రతిఒక్కరూ విధిగా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు.. ప్రజారవాణా పూర్తిగా నిలిచిపోనుందని ప్రజలందరూ సహకరించాలని కోరారు.. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించి ఇంటికే పరిమితం కావాలని సూచించారు.. ఈ మేరకు కలెక్టర్‌ ఎంవీ రెడ్డి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.. వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి కర్ఫ్యూను విజయవంతం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను మన దేశంలో వ్యాప్తి చెందకుండా దాని మూలాలను తెగ్గొట్టాలని దేశ ప్రధాని నరేంద్రమోడీ పిలుపుమేరకు జిల్లా ప్రజలు జనతా కర్ఫ్యూకు స్వచ్ఛందంగా సిద్ధమయ్యారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి తిరిగి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఏ ఒక్కరూ తమ ఇంటి నుంచి బయటికి రాకుండా వైరస్‌కు మనుగడ లేకుండా చేసి దేశంలో మరింత మందికి కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా కట్టడి చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే పాజిటీవ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరింత మందికి వైరస్‌ వ్యాప్తిచెందకుండా ఉండేందుకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రజలు సమూహాలుగా గుమికూడకుండా ఉండేందుకు పదో తరగతి పరీక్షలను సైతం రద్దు చేసింది. అదే విధంగా జనం సమూహంగా ఉండొద్దని, గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ యంత్రాంగం హెచ్చరికలు జారీ చేస్తూ వస్తుంది. స్వీయ నియంత్రణ ద్వారానే కరోనా వైరస్‌ను కట్టడి చేయవచ్చని చెప్తూ వస్తున్న సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రధాని మోడీ పిలుపునిచ్చిన నేపథ్యంలో జనతా కర్ఫ్యూకు సంపూర్ణ మద్దతును తెలిపి తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కర్ఫ్యూను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందుకు అనుగుణంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా నిత్యావసర వస్తువులన్నీ ముందే సమకూర్చుకొని ఒకరోజు స్వీయ నిర్బంధాన్ని విధించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే వారిని గుర్తించి వారిని ఐసోలేషన్‌ వార్డులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా పలు ఆస్పత్రులు, కళాశాలలు, పాఠశాలల్లో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసి కరోనా వైరస్‌ పాజిటీవ్‌ కేసులకు ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు. 

కరోనాపై సమరానికి  స్వచ్ఛందంగా సిద్ధమైన జిల్లా ప్రజలు

ఎక్కడో చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలన్నింటికీ విదేశాల నుంచి వచ్చే వారి ద్వారా వ్యాప్తిచెంది కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఎయిర్‌పోర్ట్‌లలో ప్రత్యేక స్క్రీనింగ్‌ పరీక్షలు చేసి వైరస్‌ లేదని నిర్థారించుకున్న తర్వాతనే పంపించివేస్తుంది. అంతేకాకుండా కరోనా పాజిటీవ్‌ కాకున్నా కూడా విదేశాల నుంచి వచ్చిన ప్రతిఒక్కరూ 14 రోజుల పాటు వేరే ఎవరితో కలవకుండా తమకు తాము స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సూచించారు. ఒక పాజిటీవ్‌ కేసు నుంచి ప్రారంభమై 200లకు పైగా దేశవ్యాప్తంగా పాజిటీవ్‌ కేసులు వచ్చిన నేపథ్యంలో ప్రజలందరూ సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్యం పొంది కరోనాపై సమరానికి సిద్ధమయ్యారు. అంతేకాకుండా జిల్లా యంత్రాంగం కరోనాపై అనేక రకాలుగా అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తుంది. కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి నేతృత్వంలో జిల్లా అధికారులందరూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ విదేశాల నుంచి వచ్చినవారిని సైతం గుర్తించి హైదరాబాద్‌ గాంధీఆస్పత్రికి తరలిస్తున్నారు. 

22 ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసిన జిల్లా యంత్రాంగం

ఆదివారం ప్రతిఒక్కరూ స్వీయ గృహ నిర్బంధం చేసుకొని ఏ ఒక్కరూ బయటికి రాకుండా జనతా కర్ఫ్యూ పాటించాలని దేశ ప్రధాని పిలుపునిచ్చిన నేపథ్యంలో 22వ తేదీ ప్రత్యేకతను వివరిస్తూ విజయవంతం చేయాలని ప్రజలకు సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ సాధారణంగా 12 గంటల పాటు మాత్రమే వైరస్‌ ఉన్న ప్రదేశంలో బతికే అవకాశం ఉండటంతో ప్రతి ఒక్కరూ 23 గంటల పాటు బయటికి రాకుండా ఉండి వైరస్‌ మనుగడనే ప్రశ్నార్థకం చేయాలని అధికారులు సూచిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అంగన్‌వాడీ టీచర్ల నుంచి మొదలుకొని అన్ని ప్రభుత్వశాఖల అధికారులు ఊరూరా తిరుగుతూ కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు.  

పరిస్థితిని సమీక్షిస్తున్న కలెక్టర్‌

జిల్లా వ్యాప్తంగా ప్రజలకు కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి ముందుకు సాగుతున్నారు. గురువారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన అత్యవసర, అత్యున్నతస్థాయి సమావేశంలో పాల్గొని వచ్చిన ఆయన సీఎం కేసీఆర్‌ సూచించిన విషయాలను తూచా తప్పకుండా అమలుచేసే దిశగా ముందుకు సాగుతున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూనే జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్రజల్లో వైరస్‌పై అవగాహన పెంచుతున్నారు. శనివారం ఉదయం కొత్తగూడెం క్లబ్‌లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

రైళ్లు, బస్సులు బంద్‌..

దేశవ్యాప్తంగా జనతకర్ఫ్యూ పాటించాలని ప్రధాని సూచించడంతో పాటు దేశ వ్యాప్తంగా రైళ్లు, బస్సులతో పాటు సింగరేణి భూగర్భగనులు, ఓపెన్‌కాస్ట్‌లకు కూడా ఒకరోజు విరామం ప్రకటించారు. సింగరేణి యాజమాన్యం కరోనా వైరస్‌పై కరపత్రాలు, కళాజాతాలు తదితర వాటితో అవగాహన కల్పిస్తూనే దేశవ్యాప్త జనతా కర్ఫ్యూకు తమ మద్దతును తెలిపింది.  

జనతా కర్ఫ్యూకు జై..

జిల్లా ప్రజలు నేడు జరగనున్న జనతా కర్ఫ్యూకు జై కొట్టనున్నారు. ఇప్పటికే రైళ్లు, బస్సులు బంద్‌ చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడంతో రవాణావ్యవస్థ పూర్తిగా స్తంభించనుంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారనున్నాయి. స్వయానా దేశ ప్రధానే జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చి ప్రజలందరూ సహకరించాలని కోరడంతో ఆ దిశగా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ప్రతిఒక్కరూ సామాజిక మాధ్యమాలలో నేనుసైతం జనతా కర్ఫ్యూకు, మరి మీరూ.. అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ దిశగా ప్రజలందరూ ముందే తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకొని ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి తిరిగి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు ఇళ్ల నుంచి బయటికి రాకుండా గడుపుతామని ప్రతిజ్ఞ చేస్తున్నారు.logo
>>>>>>