సోమవారం 25 మే 2020
Badradri-kothagudem - Mar 21, 2020 , 01:46:35

స్వీయ నియంత్రణ కరోనా నివారణ

స్వీయ నియంత్రణ కరోనా నివారణ

  • కలెక్టర్‌ ఎంవీ రెడ్డి నేతృత్వంలో పకడ్బందీగా చర్యలు
  • వ్యక్తిగత పరిశుభ్రతతోవ్యాధులకు చెక్‌
  • సామూహిక వేడుకలు, సభలకు దూరంగా ఉందాం..
  • నేడు కొత్తగూడెం క్లబ్‌లో వ్యాధి నివారణపై సమీక్ష
  • హాజరుకానున్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్‌

కొవిడ్‌-19 మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. దీని నివారణకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటున్నది.. ఈ మేరకు మార్గదర్శకాలు సైతం జారీ చేసింది.. జిల్లావైద్యారోగ్యశాఖ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది గ్రామగ్రామానికి వెళ్లి ప్రజలకు నివారణపై అవగాహన కల్పిస్తున్నారు.. ప్రజాప్రతినిధులు గిరిజన గూడేలకు వెళ్లి అప్రమత్తం చేస్తున్నారు.. సమష్టి బాధ్యతగా భావించి ప్రతిఒక్కరూ కరోనా నివారణకు పాటుపడాల్సిన సమయమిది.. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు స్వీయ నియంత్రణ  కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు.. శనివారం కొత్తగూడెంలోని క్లబ్‌లో కరోనా నివారణపై మంత్రి అజయ్‌కుమార్‌ సమీక్ష నిర్వహించనున్నారు.. వైద్యారోగ్యశాఖకు సలహాలు, సూచనలివ్వనున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాధి బారిన పడకుండా ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు స్వీయ నియంత్రణ పాటించాలి. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్‌ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు కలెక్టరు జిల్లాస్థాయి, మండల స్థాయి, గ్రామస్థాయి కమిటీలను నియమించారు. గ్రామస్థాయిలో ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తుల సమాచారం తక్షణం తెలుసుకునేందుకు కమిటీలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. కలెక్టర్‌ స్వయంగా రైతు మార్కెట్‌, హోటల్‌, వార్డులను తనిఖీ చేసి కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలను స్వయంగా వివరిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా భద్రాచలం, కొత్తగూడెం ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేయించారు. పాఠశాలలు, సినిమా హాళ్లు, పార్కులు, మద్యం దుకాణాలు మూసివేయించారు.  ఈ నెలాఖరునాటికి నిర్ణయించే వివాహాలకు నిర్ణీత సంఖ్యలో మాత్రమే ప్రజలు రావాలని నిఘా ఏర్పాటు చేయించాలని రెవెన్యూ, పోలీస్‌ అధికారులకు సూచించారు. వివాహాలు చేసేందుకు ముహూర్తాలు పెట్టుకొని ఫంక్షన్‌హాల్‌ను బుక్‌ చేసుకున్నా ఎక్కువ సంఖ్యలో ప్రజలను రానివ్వొద్దని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ధిక్కరించి అధిక సంఖ్యలో ప్రజలు వస్తే అటువంటి ఫంక్షన్‌ హాళ్లను తక్షణం మూసివేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసి ప్రజల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, ఉత్తర్వులను ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. హోటళ్లలో మగ్గుల ద్వారా మంచినీటి సరఫరా చేయకుండా బాటిళ్ల ద్వారా సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వీధుల్లో టిఫిన్‌ తదితర బండ్లు ఏర్పాటు చేసి విక్రయాలు నిర్వహిస్తున్న వారు తప్పనిసరిగా పరిశుభ్రమైన మంచినీరు ఏర్పాటుతో పాటు సబ్బును కూడా అందుబాటులో ఉంచాలని చెప్పారు. మున్సిపల్‌, పంచాయతీ అధికారులు తనిఖీలు నిర్వహించి రక్షణ చర్యలు తీసుకోని యజమానులకు జరిమానా విధించడంతో పాటు పరిస్థితి పునరావృతం అయితే సీజ్‌ చేయాలని చెప్పారు. ప్రజలు ఇంటికి సరిపడా నిత్యావసర సరుకులు, కూరగాయలు లాంటివి పదిహేను రోజులకు సరిపోను ఒకేసారి కొనుగోలు చేసి భద్రపర్చు కోవాలన్నారు. రానున్న 15 రోజులు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం, అధికారులు చేస్తున్న సలహాలు, సూచనలు పాటించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని చెప్పారు. 

 నిబంధనలు ఉల్లంఘిస్తే  చర్యలు

 ప్రభుత్వ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా తయారు చేయించిన ఫ్లెక్సీలను ప్రతిపరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేయించారు. ఆకస్మిక తనిఖీల్లో కార్యాలయంలో రక్షణ సూత్రాలు, నీరు, సబ్బు లేకుంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరికలు జారీ చేశారు.  వైద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయించారు. వ్యాధి నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.  వ్యాధి ఉన్న వ్యక్తులు తుమ్మినా, దగ్గినా రుమాలు, దస్తీని అడ్డుపెట్టుకోవాలని చెప్పారు. చేతులను సబ్బు లేదా శానిటైజర్లతో రెండు నిమిషాలు పాటు పరిశుభ్రంగా తరచూ శుభ్రం చేస్తూ ఉండాలని, చేతులు కడుగకుండా నోరు, ముక్కు, కళ్లను తాకొద్దన్నారు. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల ద్వారా జిల్లాలోకి ప్రవేశించే ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. చెక్‌పోస్టు ఎక్కువ ఏర్పాటు, విధులు నిర్వహించే అధికారుల సమగ్ర వివరాలను అందజేయాలని రవాణ శాఖాధికారులకు సూచించారు. 

కరోనా నియంత్రణపై నేడు సమీక్షించనున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

 శనివారం ఉదయం 11 గంటలకు కొత్తగూడెం క్లబ్‌లో రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ జిల్లా అధికారులతో కరోనా వ్యాధి నియంత్రణపై సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు. సమావేశానికి అన్నిశాఖల జిల్లా అధికారులు, వైద్యాధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలతో నిర్దేశిత సమయంలోగా సమావేశానికి హాజరుకావాలని ఆయన స్పష్టం చేశారు.

కరచాలనం వద్దు.. నమస్కారం చాలు 

కొవిడ్‌ -19 వైరస్‌కు చెక్‌ పెట్టేందుకు ప్రపంచ దేశాలు భారతీయుల సనాతన శైలిని ఆచరణలోకి పెడుతున్నాయి. ప్రాచీన భారతంలో మన పూర్వీకుల జీవనశైలినే నేడు ప్రపంచం ఆచరిస్తున్నది. షేక్‌హ్యాండ్‌ ద్వారా ఒకరి నుంచి ఒకరికి కరోనా ప్రబలే అవకాశం ఉన్నందున నమస్కారం చేయడమే ఉత్తమం. రెండు చేతులు జోడించి నమస్కారం చేయడంతో కరోనా విదేశీయులు చేసే కరచాలనం కంటే నమస్కారమే శ్రేయస్కరమైందని డాక్టర్లు సైతం చెప్తున్నారు. గత దశాబ్దం వరకు చుట్టపు చూపుగా ఇంటికొచ్చే అతిథి అయినా, ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి ఇంట్లో అడుగుపెట్టే వారెవరైనా తప్పనిసరిగా కాళ్లు, చేతులు శుభ్రం చేసుకొని ఇంట్లోకి వచ్చేవాళ్లు. ఇప్పుడు మళ్లీ అలాంటి సమయం ఆసన్నమైంది. కరోనా నివారణకు వ్యక్తిగత పరిశుభ్రతే మేలు. 

శాస్త్రీయతతో ముడిపడి ఉన్న అంశాలను నమ్మితే మానవాళికి మేలు. అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్వయంగా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ కరచాలనాలకు స్వస్తి చెప్పారు. ఇదే ప్రపంచానికి ఆదర్శమని చాటి చెప్తున్నారు. నాటి భారతదేశం ఆచరించిన సంస్కృతీ, సంప్రదాయాలే ఆధునిక ప్రపంచానికి శాస్త్రీయమైన ఆధారాలుగా చెప్తున్నారు. జలుబు, దగ్గుతో బాధపడుతున్న వ్యక్తి స్వీయ నియంత్రణ పాటించి మరొకరికి ప్రబలకుండా చూడాలి.

ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

టేకులపల్లి: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియానాయక్‌ అన్నారు. టేకులపల్లి పంచాయతీ పరిధిలో గల సక్రుతండ, ఏ కాలనీ తండాల్లో కరోనా వైరస్‌ పై సర్పంచ్‌ బోడ సరిత ఆధ్వర్యంలో నిర్వహించిన  కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కరపత్రాలు అందించి సూచించారు. గ్రామాల్లో ప్రతిఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చెప్పారు.  అనంతరం సక్రుతండాలో గిరిజన మహిళలతో మాట్లాడుతూ వారికి అర్థమయ్యేలా అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండి కరోనా వైరస్‌ను తరిమివేయాలని సూచించారు. సర్పంచ్‌ బోడ సరిత, ఎంపీపీ భూక్య రాధ,  అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.


కరోనాపై భయపడొద్దు..

ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు 

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఎవరూ భయపడొద్దని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనాపై సీఎం కేసీఆర్‌ అందరినీ అప్రమత్తం చేశారని, ఎలాంటి అపోహలు నమ్మవద్దని అన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారి నుంచి ఈ వైరస్‌ వచ్చిందని, వారిని గుర్తించి అధికారులకు సమాచారం అందించాలన్నారు. పాల్వంచలో కేటీపీఎస్‌ ఉన్నతస్థాయి ఉద్యోగి కుమారుడు విదేశాల నుంచి వచ్చారని సమాచారం తెలుసుకొని వెంటనే అతన్ని హైదరాబాద్‌ పంపించామన్నారు. ప్రతి అరగంటకు చేతులు కడుక్కోవాలన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖరరావు, ఎం పీపీ బాదావత్‌ శాంతి, ఎంఏ రజాక్‌, కౌన్సిలర్లు, ఎంపీటీసీ పద్మ పాల్గొన్నారు.


logo