శుక్రవారం 05 జూన్ 2020
Badradri-kothagudem - Mar 21, 2020 , 01:45:33

‘ఉపాధి’ సహాయకులపై వేటు

‘ఉపాధి’ సహాయకులపై వేటు

  • జిల్లాలో 181 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్ల సస్పెన్షన్‌
  • సమ్మె పేరుతో విధులకు గైర్హాజరు
  • ఇటీవల ఉత్తర్వులు జారీ
  • పంచాయతీ కార్మికులకు అదనపు బాధ్యతలు

ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న క్షేత్ర సహాయకులు విధులకు గైర్హాజరు అవుతుండటాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది.. సమ్మె పేరుతో వారు కొన్నాళ్ల నుంచి విధులకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో వారిపై వేటు పడింది.. జిల్లా వ్యాప్తంగా 238 మంది పని చేస్తుండగా, వీరిలో కొన్నాళ్ల నుంచి 181 మంది విధులకు హాజరు కావడం లేదు.. వారిని సస్పెండ్‌ చేసినట్లు ఇటీవల ఇన్‌చార్జి డీఆర్డీవో మధుసూదన్‌రాజు ఉత్తర్వులు జారీ చేశారు.. మిగిలిన 57 మంది యథావిధిగా విధులకు హాజరవుతారన్నారు. 

అశ్వారావుపేట, నమస్తే తెలంగాణ: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకులపై ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు. కొన్ని నెలలుగా సమ్మె పేరుతో విధులకు గైర్హాజరు కావడంతో క్షేత్ర సహాయకులను తొలగిస్తూ డీఆర్‌డీవో మధుసూదనరాజు ఉత్తర్వులు జారీ చేశా రు. తక్షణమే ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించారు. వీరి స్థానంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మేట్ల సహకారంతో ఉపాధి పను లు కొనసాగించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 238 మంది క్షేత్ర సహాయకులు పని చేస్తుండగా వీరిలో 181 మంది ధర్నాలో పాల్గొంటుండగా మిగతా 57 మంది విధులకు హాజరవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,15,101మంది కూలీలకు క్షేత్ర సహాయకులు 2019, ఏప్రిల్‌ 1 నుంచి ఈఏడాది మార్చి 31వ తేదీ వరకు ఉపాధి పనులు కల్పించాల్సి ఉంది. మరో పది రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా నిర్ధేశించిన పని దినాలను కూలీలకు చూపించకపోగా సమ్మె పేరుతో విధులకు గైర్హాజరవుతున్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విధులకు గైర్హాజరవుతున్న క్షేత్ర సహాయకులపై చర్యలకు ఉపక్రమించింది. 

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జిల్లా వ్యాప్తంగా 238 మంది క్షేత్ర సహాయకులు పని చేస్తున్నారు. వీరు ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో జాబ్‌కార్డు కలిగిన ప్రతి కూలీకి పనులు కల్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి ఏటా కోట్ల రూపాయలు నిధులు కేటాయిన్నది. ఒక రోజు 10 మంది కూలీలు పని చేస్తే 10పని దినాలుగా, 100 మంది కూలీలు హాజరైతే 100 పని దినాలుగా అధికారులు పరిగణిస్తారు. ఈ పనులను పర్యవేక్షించాల్సింది క్షేత్ర సహాయకులు. కానీ ప్రతి ఏటా అనుకున్న పని దినాల లక్ష్యం వీరి నిర్లక్ష్యం వల్ల  పూర్తి కావటం లేదు. కూలీలకు పనులు కల్పించటమే కాకుండా క్షేత్ర సహాయకుల్లోనూ బాధ్యతను పెంచే విధంగా ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి కనీసం 30 శాతం తప్పని సరిగా పని కల్పించాలని నిబంధన విధించింది. 

పనులను బట్టి వేతనం

క్షేత్ర సహాయకులు తమ బాధ్యతను గుర్తుంచుకుని ఉపాధి కూలీలకు కనీస పని దినాలు కల్పించే విధంగా పని దినాల శాతాన్ని బట్టి వేతనాలను అందించాలని నిర్ణయించింది. ఒక్కో నెలకు 30 నుంచి 40 శాతం కుటుంబాలకు పనిదినాలు కల్పించిన క్షేత్ర సహాయకులకు రూ.10 వేలు, 20 నుంచి 30 శాతం పనిదినాలు కల్పించే వారికి రూ.9 వేలు, 10 నుంచి 20 శాతం కుటుంబాలకు పనులు కల్పిస్తే రూ.7,500,  అదేవిధంగా 10 శాతంలోపు కుటుంబాలకు మాత్రమే పని కల్పిస్తున్న క్షేత్ర సహాయకులకు రూ.5 వేలు చొప్పున నెలకు వేతనం అందిస్తున్నది. ఈనిర్ణయాన్ని ఏడాది క్రితం నుంచే అమలు చేస్తున్నప్పటికీ క్షేత్ర సహాయకులు తమకు నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేయటం లేదు. 

సమ్మె పేరుతో విధులకు గైర్హాజరు

ప్రతి ఏటా నిర్ధేశించిన కుటంబాలకు పనిదినాల లక్ష్యాన్ని పూర్తి చేయలేని క్షేత్ర సహాయకులు కొన్ని డిమాండ్లతో సమ్మెకు దిగారు. పని శాతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రతి క్షేత్ర సహాయకుడికి కనీస వేతనం రూ.21 వేలు, ప్రమాద బీమాతో పాటు మరణిస్తే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా, తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సమ్మెలో పాల్గొంటూ విధులకు గైర్హాజరవుతున్నారు. విధులకు గైర్హాజరయ్యే క్షేత్ర సహాయకులను షోకాజ్‌ నోటీసులు జారీ చేసి తాత్కాలికంగా విధుల నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. కలెక్టర్‌ ఆదేశానుసారం డీఆర్‌డీవో మధుసూదనరాజు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వాటిని స్వీకరించటానికి క్షేత్ర సహాయకులు నిరాకరించటంతో సస్పెన్షన్‌ వేటు వేశారు. 

విధుల్లో 57మంది

సమ్మెతో విధులకు గైర్హాజరవుతున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లను తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ డీఆర్‌డీవో ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లోని 481గ్రామ పంచాయతీల పరిధిలో 238 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్నారు. కానీ వీరిలో 181మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు సమ్మెలో పాల్గొంటున్నారు. వీరందరిపైనా సస్పెన్షన్‌ వేటు వేశారు. మిగతా 57 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు విధుల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం 1,348గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనుల్లో 2,15,101మంది కూలీలు పని చేస్తున్నారు. 

పనులకు ఆటంకం లేకుండా

క్షేత్ర సహాయకులను తొలగించిన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు ఉపాధి పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా తగిన చర్యలు చేపట్టారు. తొలగించిన క్షేత్ర సహాయకుల స్థానంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా మేట్ల సహకారంతో పనులు కొనసాగించేలా కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు తీసుకున్న చర్యలతో కూలీలు ఊపిరి పీల్చుకున్నారు. క్షేత్ర సహాయకుల సమ్మెతో పనులు నిలిచిపోతాయని భావించిన ఉపాధి కూలీలకు ఊరట కలిగింది. 

ప్రభుత్వ ఆదేశాలతో చర్యలు

సమ్మె పేరుతో విధులకు గైర్హాజరవుతున్న ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులపై ప్రభుత్వ ఆదేశానుసారం సస్పెన్షన్‌ వేటు వేయటం జరిగింది. తొలుత షోకాజ్‌ నోటీసులు జారీ చేసినప్పటికీ స్వీకరించటానికి నిరాకరించారు. తదుపరి చర్యల్లో భాగంగా విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు. జిల్లా వ్యాప్తంగా 181 మందిని విధుల నుంచి తొలిగించగా, మరో 57 మంది విధుల్లో కొనసాగుతున్నారు. 

- వలపర్ల ఉదయ్‌ కుమార్‌,  ఏపీడీ, డీఆర్‌డీఏ, ములకలపల్లి 


logo