బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Mar 20, 2020 , 01:34:29

రోడ్లన్నీ ఖాళీ

రోడ్లన్నీ ఖాళీ

  • కరోనా ఎఫెక్ట్‌తో బోసిపోయిన రహదారులు..
  • నగరమంతా కర్ఫ్యూ వాతావరణం
  • కరోనా వైరస్‌ వ్యాప్తితో అప్రమత్తమైన జిల్లా ప్రజలు 
  • అత్యవసరమైతే తప్ప బయటికి రాని వైనం
  • బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో తగ్గిన ప్రయాణికులు 
  • సన్నగిల్లిన వ్యాపారాలు
  • మూతపడిన సినిమా థియేటర్లు, స్టేడియాలు, బార్లు..
  • స్వీయ నిర్బంధన రక్షణ చర్యలు 

కరోనా వైరస్‌తో ఖమ్మం జిల్లా అప్రమత్తమైంది. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకున్నది. ఈ వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలను చైతన్యం చేసే దిశగా నడుం బిగించింది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వంలోని అన్ని శాఖలూ సంయుక్తంగా ముందుకు సాగుతున్నాయి. దీంతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్లయింది. ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు. రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లడం లేదు. అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. 

ఖమ్మం, నమస్తే తెలంగాణ: మరో 15 రోజుల పాటు ప్రజలందరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగానే సీఎం కేసీఆర్‌ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి కరోనా వ్యాప్తిచెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. థియేటర్లు, స్టేడియాలు, విద్యాసంస్థలు మూతపడడం, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో నగరంలో అనధికార కర్ఫ్యూ విధించినట్లయింది. మంత్రి అజయ్‌కుమార్‌ నాలుగు రోజుల ముందుగానే జిల్లా ప్రజలను అప్రమత్తం చేశారు. అధికారులు కూడా మొత్తం ప్రజలను చైతనం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాలు, కూడళ్లు కూడా బోసిపోయి కన్పిస్తున్నాయి. ప్రజలు కొన్ని శుభకార్యాలను వాయిదా వేసుకుంటున్నారు.  గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది. ప్రతి ఒక్కరూ మాస్కులను ధరిస్తున్నారు. రానున్న పది రోజులు అత్యంత క్లిష్టమైనవి కాబట్టి ప్రజలందరూ తమను తాము స్వీయ నిర్బంధంలో ఉంచుకుంటూనే రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. 

బోసిపోయిన రోడ్లు.. 

కరోనాను తరిమికొట్టేందుకు ప్రజలు కూడా నడుం బిగించారు. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ బోసిపోయాయి. రోడ్లపైకి జనాలు పెద్దగా రావడంలేదు. అత్యవసర పనుల కోసం మాత్రమే అడుగు బయట పెడుతున్నారు. స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు, పార్కులు, గ్రౌండ్‌లు మూతపడ్డాయి. ఎక్కడా జన సమూహాలు కనబడటం లేదు. పెళ్లిళ్లకు, దైవదర్శనాలకు వెళ్లేందుకు కూడా ప్రజలు జంకుతున్నారు. ‘చేతులు శుభ్రం చేసుకొని లోపలికి రాగలరు’ అంటూ కొన్ని దుకాణాలు, కార్యాలయాల వద్ద బోర్డులు దర్శనమిస్తున్నాయి. నీళ్ల బకెట్‌, సబ్బు, మగ్గులను ఏర్పాటు చేస్తున్నారు. మెడికల్‌ షాపుల్లో మాస్కులు దొరకడం లేదు.  

తగ్గిన ప్రయాణికులు

ముందస్తు చర్యల్లో భాగంగా చాలామంది ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ముఖ్యమైన పనులైతేనే ప్రయాణాలు చేస్తున్నారు. వ్యాపారాలు తగ్గుముఖం పట్టాయి.  ఆర్టీసీ బస్టాండ్‌, రైల్వేస్టేషన్లలో పెద్దగా ప్రయాణికులు ఉండడం లేదు. అయినా వైరస్‌ నివారణకు రైల్వే, ఆర్టీసీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఖాళీ సీట్లతో దర్శనమిస్తున్నాయి. రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫాంల మీద ఉండే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. రైళ్లలో ప్రయాణం చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. 

స్టేడియాలు, పార్కుల మూసివేత..

నగర ప్రజలు ప్రతి రోజూ వేలాదిమంది ఖమ్మంలోని పటేల్‌ స్టేడియం, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానం, లకారం ట్యాంక్‌బండ్‌, పెవిలియన్‌ గ్రౌండ్‌, నయాబజార్‌ కళాశాల గ్రౌండ్‌లలో ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌, జాగింగ్‌ చేయడానికి వచ్చేవారు. సెలవు రోజుల్లో క్రీడాకారులు, విద్యార్థులు కూడా వందల సంఖ్యలో వచ్చేవారు. వీటిని మూసివేయడంతో అవన్నీ ఇప్పుడు బోసిపోయాయి. 

సన్నగిల్లిన వ్యాపారాలు..

ఏటా వేసవిలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సీజన్‌ ఉంటుంది. దీనిపై అనేక వ్యాపారాలు ఆధారపడి ఉంటాయి. పెళ్లిళ్లకు జనం రావడం తగ్గడంతో ఆ వ్యాపారాలన్నీ దెబ్బతింటున్నాయి. అసలు సాధారణ జనాలు కూడా బయటకు రాకపోవడంతో ఇతరత్రా వ్యాపారాలు కూడా సన్నగిల్లాయి. ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో ఉన్న దుకాణాలన్నీ వెలవెలబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. ఆటో కార్మికులు కూడా ప్రయాణికుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీధి వ్యాపారాల పరిస్థితి కూడా అలాగే ఉంది. టీ షాపుల్లో  కూడా రద్దీ తగ్గింది.