ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 16, 2020 , 04:08:14

కోల్డ్‌స్టోరేజీలకు ఎర్రబంగారం

కోల్డ్‌స్టోరేజీలకు  ఎర్రబంగారం
  • మార్కెట్‌ యార్డుకు తగ్గుతున్న మిర్చిపంట
  • నేటి వరకు దాదాపు 4లక్షల బస్తాల నిల్వ
  • అంతర్జాతీయ మార్కెట్‌ను అనుసరిస్తున్న వ్యాపారులు
  • అదే బాటలో రైతాంగం నిర్ణయం

ఖమ్మం వ్యవసాయం, మార్చి 15: ప్రస్తుతం మార్కెట్లో నిలకడగానే ధరలు ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో అటు  రైతులు, ఇటు వ్యాపారులు శీతలగిడ్డంగుల వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే ఖమ్మం నగరంలోని కోల్డ్‌ స్టోరేజీల వద్ద మిర్చి బస్తాలతో వాహనాలు బారులు తీరుతున్నాయి.  ఖమ్మం మార్కెట్‌ పరిసర ప్రాంతాలతో పాటు నగర శివారులో కలిపి 17 కోల్డ్‌స్టోరేజీలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం ఖమ్మం రూరల్‌ మండలంలో మరో శీతలగిడ్డంగి ప్రారంభమైంది. సీజన్‌ ఆరంభంలో ఒక్కసారిగా మార్కెట్లో ఎర్రబంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. ఏకంగా క్వింటాకు రూ.22వేల వరకు గరిష్ట ధర పలికింది. ఎగుమతిదారుల నుంచి భారీగా ఇండెంట్‌ ఉండటంతో స్థానిక కొనుగోలుదారులు పోటీపడి మిర్చి కొనుగోళ్లు చేపట్టారు. దీంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సరాసరి నలభైవేల బస్తాలు వచ్చాయి. అయితే వారం రోజులు గడవకముందే క్రమక్రమంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో స్థానిక వ్యాపారులతోపాటు, ఇతర రాష్టాల వ్యాపారులు, ఖమ్మం నగరం సమీపంలోని చైనా కంపెనీ ప్రతినిధులు మాత్రమే పంటను కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం జిల్లాలో సుమారు 60 వేల ఎకరాల్లో మిర్చిపంట సాగు జరిగింది. మే నెల వరకు పంట భారీగా వచ్చే అవకాశం ఉందని జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారులు, ఖమ్మం మార్కెట్‌ కమిటీ అధికారులు అభిప్రాయపడ్డారు. మార్చిలోనే శీతలగిడ్డంగులకు పంట చేరుకుంటున్నది.

 సీజన్‌ ఆరంభంలోనే కోల్డ్‌ స్టోరేజీలు ఖాళీ

గతేడాది సీజన్‌ ఆరంభం నుంచి మార్కెట్లో మిర్చిపంటకు ఆశించిన ధర రాలేదు. దీంతో దాదాపు 50 శాతం మంది రైతులు కోల్డ్‌స్టోరేజీల్లో పంటను నిల్వ చేసుకున్నారు. దీంతో గత సంవత్సరం మార్కెట్లో అడపాదడపా మాత్రమే క్రయవిక్రయాలు జరిగాయి. కొత్త మిర్చి పంట మార్కెట్‌కు రావడం ప్రారంభమైన తొలిరోజుల్లోనే ఏసీ మిర్చి క్వింటాకు రూ.18 వేల నుంచి రూ 20 వేలకు చేరింది. రికార్డు స్థాయి ధర రావడంతో పంటను నిల్వ చేసుకున్న రైతులకు కలిసివచ్చినట్లయింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలోని అన్ని కోల్డ్‌స్టోరేజీలూ ఖాళీ అయ్యాయి.

ఇప్పటి వరకు 4 లక్షల బస్తాలు నిల్వ..

గత నెలలో కొందరు మాత్రమే పంటను కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసుకునేందుకు ఆసక్తి చూపారు. మార్కెట్లో మంచి ధర ఉండటంతో పొలం నుంచి పంటను నేరుగా మార్కెట్‌కు తీసుకొచ్చి అమ్మకానికి పెట్టారు. పది రోజులనుంచి మార్కె ట్లో క్విం టాకు రూ.13 వేల నుంచి రూ.14 వేలు వరకు మాత్రమే గరిష్ట ధర పలుకుతున్నది. ఈ సీజన్లోనే తొలిపంటను క్వింటాకు రూ.18 వేల నుంచి రూ.20 వేలకు అమ్ముకున్న రైతులు తిరిగి అదే ధర వస్తుందనే ఆశాభావంతో కోల్డ్‌స్టోరేజీలను ఆశ్రయిస్తున్నారు. దీంతో నిన్నామొన్నటి వరకు వెలవెలబోయిన కోల్డ్‌స్టోరేజీలు తిరిగి పంట ఉత్పత్తులు రావడంతో కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం ఖమ్మం మార్కెట్‌ పరిధిలో ఉన్న 17 కోల్డ్‌స్టోరేజీల్లో ఈ నెల 7 వరకు అధికారుల గణంకాల ప్రకారం దాదాపు 4.10 లక్షల బస్తాలను రైతులు, వ్యాపారులు నిల్వ చేసుకున్నారు. మిగిలిన ఈ వారం రోజుల్లో మరో లక్ష బస్తాలు నిల్వ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.