శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 16, 2020 , 04:03:58

రాములోరి పెళ్లికి భద్రగిరి ముస్తాబు

రాములోరి పెళ్లికి భద్రగిరి ముస్తాబు

శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణానికి భద్రగిరి ముస్తాబవుతున్నది. ఈ నెల 25 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.. షామియానాలు, చలువ పందిళ్లు, స్వాగత ద్వారాల ఏర్పాటుతో భద్రాచలం కొత్తకళను సంతరించుకున్నది.. ఆలయ ప్రధాన వీధుల్లో సందడి కనిపిస్తున్నది.. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కలెక్టర్‌ ఎంవీ రెడ్డి నేతృత్వంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు..

  • పట్టణానికి కల్యాణ శోభ
  • షామియానాలు, పందిళ్లతో కళకళ
  • కనువిందు చేస్తున్న స్వాగత ద్వారాలు
  • శ్రీరామనవమికి పకడ్బందీగా ఏర్పాట్లు

భద్రాచలం, నమస్తేతెలంగాణ: రాముడు నడియాడిన వేద భూమి భద్రగిరి. శ్రీసీతారామచంద్రస్వామివారు సతీసమేతంగా నడిచిన పుణ్యధామం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. పుణ్యక్షేత్రంలో ఎక్కడ చూసినా రామ య్య పెళ్లి పనులే కొనసాగుతున్నాయి.ఈ నెల 25 నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారరంభం కానున్నా యి. ఇందులో భాగంగా ఏప్రిల్‌2న శ్రీసీతారాముల క ల్యాణం, ఏప్రిల్‌3న శ్రీ రామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ వేడుకల విజయవంతం కోసం అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు.

ఎటు చూసినా రామయ్య పెళ్లి పనులే... 

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో రాములోరి కల్యాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దేవస్థానం ఇప్పటికే వైదికపరమైన ఏ ర్పాట్లను చేస్తోంది. తలంబ్రాలు కలుపు ప్రక్రియ ప్రారంభం కావడంతో ఇక ఇతరత్ర పనులపై దేవస్థానం అధికారులు దృష్టి సారించారు. కల్యాణ టిక్కెట్ల విక్రయం ఆన్‌లైన్‌లో కొనసాగుతోంది. తలంబ్రాలు, ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించే మిథిలా ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నారు. సెక్టార్ల వారీగా పనులు నిర్వహిస్తున్నారు. కల్యాణ మండపానికి, స్టేడియం చుట్టూ రంగులు వేశారు. రామాలయం పరిసరాల్లో చలువ పందిళ్లు ఏర్పా టు చేశారు. పట్టణ పురవీధుల్లో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. పంచ రంగులతో ఆర్చీ గేట్లను సిద్ధం చేశారు. ఆహ్వాన పత్రికలను కూడా సిద్ధం చేస్తున్నారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రికి, గవర్నర్‌లకు ఆహ్వాన పత్రికలను అందజేయనున్నారు. మరోవైపు పట్టణంలో పారిశుధ్య పనులను నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ పనులు కొనసాగుతున్నాయి. తాత్కాలిక మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. భక్తులకు వసతి సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరకట్ట ప్రాంతాన్ని అందంగా ముస్తాబు చేస్తూ, శిల్పాలకు రంగులు వేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి వివిధశాఖల అధికారులతో నిత్యం మాట్లాడుతూ శ్రీరామనవమి పనులను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎస్పీ సునిల్‌దత్‌ నేతృత్వంలో భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటుకు తగు ప్రణాళికలు రూ పొందించు కుంటున్నారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు మార్చి25 నుంచి ప్రారంభంకానున్నాయి. 29న ఉత్సవాలకు అం కురారోపణం జరుగుతోంది. శ్రీసీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం వేడుకలకు దేశ వ్యాప్తంగా భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో అందుకు తగ్గ ఏర్పాట్లను చేసేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించుకొని పనులను చేపడుతున్నారు.