సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 16, 2020 , 04:02:27

చిన్న పంచాయతీలకు చేయూత

చిన్న పంచాయతీలకు చేయూత

రాష్ట్రంలో అత్యధిక గిరిజన జనాభా కలిగిన జిల్లాల్లో భద్రాద్రి ఒకటి.. ఇక్కడ ఆదివాసీ గూడేలు ఎక్కువ.. గతంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ గూడేలు సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో పంచాయతీలుగా ఏర్పడ్డాయి.. అంతేకాదు సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి బాట పట్టాయి.. వాటి రూపురేఖలు మారుతున్నాయి.. అందుకు తోడ్పాటుగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది.. ఒక్కో చిన్న పంచాయతీకి ఏటా రూ.5 లక్షల నిధులు మంజూరు చేయనున్నది.. దీంతో జిల్లాలో సుమారు 80 పంచాయతీలకు నిధులు అందనున్నాయి.. ప్రగతి పథంలో నడుస్తున్న పల్లెలకు ఈ నిధులతో మరిన్ని మౌలిక సౌకర్యాలు సమకూరనున్నాయి.

  • సీఎం కేసీఆర్‌ చొరవతో మారుమూల పల్లెలకు మహర్దశ
  • గ్రామానికి ఏడాదికి రూ.5 లక్షల చొప్పున నిధులు
  • బడ్జెట్‌ సమావేశాల్లో కీలక ప్రకటన
  • మరింత మెరుగుపడనున్న ‘పల్లె ప్రగతి’
  • ప్రజానీకం నుంచి హర్షాతిరేకాలు

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : గ్రామాలు పచ్చగా కళకళలాడాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల సాకారమవుతున్నది. గూడేలు, తండాలను గ్రామపంచాయతీలుగా మా ర్చడంతో, ‘పల్లెప్రగతి’లో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ఇంకా కొన్ని పంచాయతీల్లో జనాభా తక్కువ కారణంగా నిధుల కొరత ఉండటంతో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ చూపి చిన్న గ్రామపంచాయతీలకు నెలకు రూ. 5లక్షల నిధులు ఇస్తున్నట్లు ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. జనాభా ఎక్కువగా ఉన్న పంచాయతీలతో సమానంగా చిన్న పంచాయతీలు అభివృద్ధి చెందాలని కేసీఆర్‌ లక్ష్యం నెరవేరబోతున్నది. రెండేళ్ల క్రితం  ఎక్కువ గ్రామాలుగా ఉన్న గ్రామపంచాయతీలను విభజించి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పంచాయతీలను ఏర్పాటు చేశారు. పల్లెలకు కొత్తందాలు తెచ్చిపెట్టారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో ప్రతి పంచాయతీలో నర్సరీ ఏర్పాటు చేయాలని, పంచాయతీకి ఒక ట్రాక్టర్‌, ట్యాంకర్‌ ఉండాలని పల్లె ప్రగతి ద్వారా కార్యాచరణ చేశారు. రెండు విడుతల్లో నిర్వహించిన ప్రగతి ప్రణాళికల్లో కార్యాచరణ పూర్తి చేసుకున్న గ్రామ పంచాయతీలు ప్రతి  పంచాయతీకి ట్రాక్టర్లు కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీలకు ట్రాక్టర్లు కొనుగోలు చేయడంతోపాటు ట్యాంకర్లు, ట్రక్కులను కూడా సమకూర్చుకున్నది. మేజర్‌ గ్రామ పంచాయతీల్లో సరిపడా నిధులు ఉన్నందున మూడు పరికరాలను కొనుగోలు చేశారు. చిన్న పంచాయతీల్లో కేవలం ట్రాక్టర్లకే పరిమితం కావడంతో ట్రక్కు, ట్యాంకర్లను కూడా దాతల సహకారంతో కొనుగోలు చేసుకున్నారు. దీంతో గ్రామ పంచాయతీల్లో సమస్యలు ఒక కొలిక్కి వచ్చాయి. 

కనీస గ్రాంటుగా రూ. 5లక్షలు..

జిల్లాలో మొత్తం గ్రామపంచాయతీలు 479 ఉండగా, వాటిలో దాదాపు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. అన్ని చిన్న పంచాయతీలుగానే ఉండిపోయాయి. గిరిజన ప్రాంతం కావడంతో జనాభా ఉన్నప్పటికీ సరిపడా ఆదాయం లేక కొన్ని సమస్యలు తలెత్తాయి. ఇటీవల జరిగిన పల్లెప్రగతిలో సమస్యలను గుర్తించిన సీఎం కేసీఆర్‌ ఈ విషయంపై సానుకూలంగా స్పందించారు. చిన్న గ్రామపంచాయతీలకు నెలకు రూ. 5లక్షల నిధుల కేటాయిస్తూ  శాసనసభలో ప్రకటన చేశారు. దీంతో ఏజెన్సీలోని గ్రామపంచాయతీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ట్రాక్టర్లు  కొనుగోలు చేయడంలో ఇబ్బందులు తలెత్తాయి. చిన్న పంచాయతీలకు ఇక నుంచి అలాంటి సమస్యలకు పరిష్కారం లభించనుంది.

నీటి సౌకర్యానికి  ఇబ్బంది లేదు..

పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పంచాయతీలకు కొత్త ట్రాక్టర్లు,   ట్యాంకర్లను మంజూరు చేశారు. దీంతో మొక్క లు పెంచడానికి ఢోకా లేదు. నర్సరీల్లో నీటి సౌకర్యం కలిసొచ్చింది. గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే మోటార్‌ సౌకర్యం ఉన్నందున ఆ నీటిని నర్సరీల్లోని మొక్కలకు అందించేందుకు ఉపయోగిస్తున్నారు. పల్లె ప్రగతిలో నాటిన మొక్కలను పెంచేందుకు కూడా వాటర్‌ ట్యాంకర్‌ ఎంతో ఉపయోగపడుతున్నది. ప్రతి ఏటా నర్సరీలను పెంచి గ్రామాల్లో పచ్చదనాన్ని కల్పించనున్నారు. పారిశుధ్యం మెరుగుపర్చేందుకు పల్లె ప్రగతి ఉపయోగపడటంతో నర్సరీలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. 

80పంచాయతీలకు చేకూరనున్న లబ్ధి

గ్రామపంచాయతీలకు వార్షిక బడ్జెట్‌ తక్కువ ఉండటంతో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక నిధులు కేటాయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదలకానున్నాయి. జీవో నెంబర్‌ 137 ప్రకారం నిధులు కేటాయింపుపై ఊరట లభించనుంది. ఈ నిర్ణయం పట్ల జిల్లాలోని గ్రామపంచాయతీల సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన పల్లెప్రగతి కార్యచరణలో పనులు జరిగినప్పటికీ నిధుల వినియోగానికి గ్రాంట్‌ లేనందున నిధుల సమస్య పంచాయతీలకు భారంగా మారింది. ఇక నుంచి ఆ సమస్య తీరిపోనున్నది.      

చిన్న పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయి.. 

కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు అభివృద్ధి  చేరువైంది. ప్రతి అవసరానికి గ్రామపంచాయతీలకు వచ్చేందుకు కార్యాయాలు దగ్గరకు వచ్చాయి. చిన్న పంచాయతీలకు నిధులు తక్కువగా ఉన్నందున ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి, ప్రత్యేకంగా రూ.5లక్షల నిధులను కేటాయించింది. దీనివల్ల చిన్న పంచాయతీల్లో అభివృద్ధి పనులు వేగవతం కానున్నాయి. కొత్తగా మంజూరైన నిధుల వల్ల గ్రామాల్లో రహదారులు, డ్రైన్‌ల నిర్మాణాలు చేపట్టవచ్చు.

-ఆర్‌ఏఎస్‌పీ ఆశాలత, డీపీవో

నిధులు మంజూరు చేయడం హర్షణీయం 

గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత ఉన్నందున కొన్ని పనులకు ఆటంకాలు  ఏర్పడుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఇంటి పన్నుల వసూళ్లు సమస్యగానే మారుతున్నది. పూరిగుడిసెలు, రేకుల షెడ్లు ఉన్న పంచాయతీల్లో పన్నుల వసూళ్లు తక్కువగానే ఉంది. దీంతో రహదారుల అభివృద్ధి, కాలువల మరమ్మతులకు నిధులు సరిపోవడం లేదు. సీఎం కేసీఆర్‌ చొరవతో చిన్న పంచాయతీలకు నిధులు మంజూరు చేయడం శుభపరిణామం. 

-ఈ జగదాంబ, అంబేద్కర్‌ నగర్‌ పంచాయతీ సర్పంచ్‌