ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 09, 2020 , 23:51:09

సప్తవర్ణాల హోలీ

సప్తవర్ణాల హోలీ

మయూరి సెంటర్‌, మార్చి 9: హోలీ పండుగ జిల్లావ్యాప్తంగా సప్తవర్ణశోభితం చేసింది.. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు హోలీ సంబురాల్లో మునిగిపోయారు. సోమవారం ఖమ్మం జిల్లా యువత వసంతకాలానికి స్వాగతం పలికారు. నగరంలో మహిళలు సైతం రోడ్లెక్కి సంబురాలు జరుపుకున్నారు. ప్రతి ఒక్కరూ ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి హోలీ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి  జిల్లాలో పలు కూడళ్లల్లో కామ దహనం చేశారు. ఖమ్మంతో పాటు మధిర, సత్తుపల్లి, పాలేరు, వైరా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వాడవాడలా పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ప్రతీ గ్రామంలో కులమతాలకు అతీతంగా నిర్వహించుకున్న ఈ వేడుకలు మానవీయ సంబంధాలను మరింత దగ్గర చేశాయి. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలన్నింటికీ సెలవు కావడంతో ఇంటిల్లిపాది హోలీ వేడుకల్లో మునిగితేలారు. ప్రధానంగా యువతులు, మహిళలు వాడల్లో రోడ్లమీదకు వచ్చి రంగులు చల్లుకుని నృత్యాలు చేశారు. యువకులు ద్విచక్ర వాహనాలపై కేరింతలు కొట్టుకుంటూ నగరంలో హల్‌చల్‌ చేశారు. రంగులతో పాటు కోడిగుడ్లను సైతం కొడుతూ ఉత్సాహపూరిత వాతావరణంలో వేడుకలు జరుపుకున్నారు. కరోనా ప్రభావంతో చాలా చోట్ల వేడుకలకు దూరంగా ఉన్నారు.