శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 09, 2020 , 23:47:41

రామయ్యకు పెండ్లి కళ..

రామయ్యకు పెండ్లి కళ..

భద్రాచలం, నమస్తే తెలంగాణ : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో సోమవారం నిర్వహించిన స్వామి డోలోత్సవం, వసంతోత్సవం, కల్యాణ తలంబ్రాలు కలుపు తంతు ప్రక్రియ అంగరంగ వైభవంగా జరిగింది. పాల్గుణ ఫార్ణమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. తొలుత అర్చకులు రామయ్యను పెళ్లికొడుకుగా, సీతమ్మను పెళ్లి కూతురుగా అలంకరించారు. అంతరాలయం నుంచి స్వామి శేష మాలికలను ఆలయ ఈవో జీ నరసింహులు శిరస్సుపై ధరించి మంగళవాయిద్యాలతో చిత్రకూట మండపానికి చేరుకున్నారు. అక్కడ విశ్వక్సేన ఆరాధన, పుణ్యఃవచనం జరిపారు. బియ్యంపై పుణ్య జలాలను చల్లారు. తొమ్మిది మంది వైష్ణవ ముత్తైదువులు రోలు, రోకలిలో లక్ష్మి, సరస్వతిని ఆవాహనం చేసి రోకలికి కంకణధారణ చేసి పసుపు కొమ్ములు రోళ్లలో దంచారు. అనంతరం గుక్కా గులాలు, అత్తర్‌,పన్నీర్‌, ఆవు నెయ్యి, సెంట్‌, బియ్యం, పసుపు, కుంకుమలు, తొమ్మిది రకాల ద్రవ్యాలతో ఆవాహనం చేసి 1108మంది భక్తురాళ్లు తలంబ్రాలను కలిపా రు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తయారు చేసిన గోటి తలంబ్రాలను ఈ తలంబ్రాలలో కలిపారు. వైష్ణవులు ఈ తలంబ్రాలను ఉత్సవ మూర్తుల వద్దకు తీసుకురాగా, దృవమూర్తులకు చూపించి భద్రపరిచారు. అనంతరం ఉత్సవ పెరుమాళ్లకు అభిషేక తిరుమంజనం నిర్వహించారు. తలంబ్రాలు కలుపు ప్రక్రియలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాగా యాగశాలలో మ హా పూర్ణాహుతి జరిపి మూల మూర్తుల వద్ద మహా కుంభప్రోక్షణ నిర్వహించారు. అనంతరం కనుల పండువగా డోలోత్సవం జరిపారు. ఆస్థాన హరిదాసులు లాలలు, జోలలు, కీర్తనలు ఆలపించారు. గుక్కా గులాలతో అంతరాలయానికి చేరుకొని వసంతాన్ని రామయ్యకు ప్రోక్షించారు. పసుపు ముద్దలను ఒక దానిని రాముని శిరస్సుపై ధరింపజేసి, రెండో పసుపు ముద్దను అమ్మవారి మంగళసూత్రం వద్ద, 3వ పసుపు ముద్ద లక్ష్మణస్వామి వక్షస్థలంపై ఉంచారు. దీంతో రామయ్య పెళ్లి కొడుకుగా అయినట్లు అర్చకులు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు  హోలీ ఆడి సంబురాలు జరుపుకున్నారుకార్యక్రమంలో దేవస్థానం ఈవో జీ నరసింహులు, ఆలయ ప్రధాన అర్చకులు సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్‌చార్యులు, స్థానాచార్యులు స్థలసాయి, వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, ముఖ్య అర్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యులు, అమరవాది శ్రీనివాసరామానుజాచార్యులు, అమరవాది కిశోర్‌, విష్ణువర్ధనాచార్యులు, ఆలయ ఏఈవో శ్రావణ్‌కుమార్‌, డీఈ రవీందర్‌, ఈవో సీసీ అనిల్‌కుమార్‌, భక్తరామదాసు వంశీయులు కంచర్ల శ్రీనివాస్‌, ఆలయ అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.