శుక్రవారం 05 జూన్ 2020
Badradri-kothagudem - Mar 09, 2020 , 23:45:31

పెళ్లి కుమారుడిగా ముస్తాబైన పర్ణశాల రామయ్య

పెళ్లి కుమారుడిగా ముస్తాబైన పర్ణశాల రామయ్య

పర్ణశాల, మార్చి 9: పవిత్ర పుణ్యక్షేత్రమైన పర్ణశాలలో డోలు శుద్ధి పూర్ణిమ సందర్భంగా పర్ణశాల రామయ్యను పెళ్లికుమారుడిగా ముస్తాబు చేశారు. హోలీ సందర్భంగా పర్ణశాల రామాలయంలో అర్చకులు ఆలయంలో ఉదయం 5 గంటల నుంచి శ్రీసీతారామచంద్రస్వామివార్ల మూలవిరాట్‌లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఉత్సవ విగ్రహాలకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక అలంకరణ చేసి వేదమంత్రాల మధ్య మేళతాళాలతో ముందుగా ఉదయం 9 గంటలకు డోలోత్సవం నిర్వహించారు. అందులో భాగంగా ఉత్సవమూర్తులను అలంకరించి వసంతోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భద్రాద్రి రాముడిని పెళ్లికొడుకుగా, సీతమ్మ వారిని పెళ్లికూతురుగా అలంకరించారు. 9 మంది ముత్తయిదువులను రోలు, రోకలి వద్ద ఉంచి లక్ష్మీ, సరస్వతుల పూజలు చేశారు. రోకలికి కంకణధారణ గావించారు. పసుపుకొమ్ములను రోటిలో పోసి ముత్తయిదువులు దంచారు. ఆ పసుపును ముద్దగా చేసి రాములోరి శిరస్సుపై ఉంచారు. రెండో పసుపు ముద్దను సీతమ్మ వారిపై మంగళసూత్రానికి అలంకరించారు. ఆ విధంగా చేసిన పసుపు ముద్ద అతి పవిత్రత సంతరించుకోవడంతో వచ్చిన మహిళా భక్తులు మాంగళ్యం పసుపు, కుంకుమలతో ఉండాలని దీవిస్తూ దానిని ఆ మహిళలకు అర్చకులు అందజేశారు. ఆ పసుపు ముద్దను భక్తులు వారి మాంగళ్యానికి రాసుకున్నారు. అనంతరం అర్చకులు రంగులను సిద్ధం చేసి వసంతోత్సవం నిర్వహించారు. వచ్చిన భక్తులందరిపై రంగు నీళ్లు చల్లుతూ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వసంతోత్సవంలో ఆలయ ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ భవానీ రామకృష్ణ దంపతులకు అర్చకులు రంగులు పూశారు. అనంతరం అర్చకులు 9 మంది ముత్తయిదువులతో 9 రకాల ద్రవ్యాలతో రాములోరి పెళ్లికి తలంబ్రాలను సిద్ధం చేయించారు. అనంతరం రాములోరిని పెళ్లికుమారుడిగా అర్చకులు అలంకరించారు. సాయంత్రం 4 గంటలకు శ్రీసీతారాములకు తిరువీధి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు కిరణ్‌కుమారాచార్యులు, భరద్వాజాచార్యులు, ఆలయ గుమాస్తా వాసు, ఆలయ సిబ్బంది శివ, రాము, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.


logo