బుధవారం 03 జూన్ 2020
Badradri-kothagudem - Mar 09, 2020 , 00:15:28

సంక్షేమ పద్దు

సంక్షేమ పద్దు

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ:తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ర్టాన్ని యావత్‌ దేశంలో అగ్రగామిగా నిలిపేలక్ష్యంతో రూపొందించిన 2020 -21 వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదివారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ. 1,82,914 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ బడ్జెట్‌ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేదిశగా ఉంది. అభివృద్ధి, సంక్షేమపథకాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి పనులకు, వివిధ సంక్షేమ పథకాలకు కొనసాగింపుగా బడ్జెట్‌లో నిధులను కేటాయించారు. ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న రైతుబం ధు, రైతుబీమా పథకాలకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి అవస రాలను తీర్చే సంకల్పంతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుగుతుందని, ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామా లకు సాగునీరు లభిస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. రైతుబంధు పథకం ద్వారా తెలంగాణలోని ప్రతి రైతుకు ఎకరానికి రూ. 10 వేలను అందిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా రైతు బీమా ద్వారా చనిపోయిన రైతు కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున అందించడం జరుగుతుందన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతురుణమాఫీని అమలు చేస్తుందని ప్రకటించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు బడ్జెట్‌లో నిధులను కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు రైతుసమన్వయ సమితులు అనే పేరు ఉన్నవాటిని ఇక ముందు రైతుబంధు సమితులుగా ప్రభుత్వం మార్చనున్నట్లు మంత్రి హరీశ్‌ వెల్లడించారు. రైతులను సంఘటిత శక్తిగా మార్చడమే ప్రధాన లక్ష్యంగా ఇవి పనిచేస్తాయన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులను కేటాయించడం జరిగిందన్నారు. ఖమ్మం జిల్లాలోని భక్తరామదాసు ప్రా జెక్టును 11 నెలల రికార్డు సమయంలో పూర్తిచేశా మన్నారు. సాగునీటి పారుదల రంగానికి ఈ బడ్జెట్‌లో రూ. 11,054 కోట్లను ప్రతిపాదించడం జరిగిందన్నారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలకు పెద్ద ఎత్తున్న నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఆసరా పింఛన్లలకు, ఎస్సీ, ఎస్టీల సం క్షేమానికి నిధులను పెంచినట్లు పేర్కొన్నారు. గొల్లకురుముల సంక్షేమానికి, కల్లుగీత కార్మికుల సంక్షేమానికి, మత్య్సకారుల సంక్షేమానికి, బీసీలకు కల్యాణలక్ష్మీ అమలు చేయడానికి ఈ ఏడాది అదనంగా రూ. 650 కోట్లను కేటాయించారు. మహిళాశిశు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. పంచాయతీరాజ్‌ చట్టాన్ని పటిష్టంగా అమ లు చేస్తున్నామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెంచుతున్నామన్నారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించామన్నారు. నూతన మున్సిపల్‌ చట్టం ద్వారా పట్టణాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. విద్యారంగానికి నిధులు అధికంగా కేటాయించామన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సంపూర్ణ అక్షరాస్యత సాధించే రాష్ట్రంగా మార్చడం కోసం ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌ అనే స్ఫూర్తిదాయక నినాదాన్ని అందించారన్నారు. రానున్న రోజు ల్లో కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబంధమైన వ్యాధుల నిర్ధారణ కోసం ప్రత్యేక కార్యాచరణను తీసుకోబో తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతున్నప్పటికీ రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి ఆటంకం రానీయకుండా బడ్జెట్‌ను రూప కల్పన చేశారు. దేశంలో పలు బహుళ జాతి సంస్థలు, ఆటోమోబైల్‌ సంస్థలు తమ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపకపోవడంతో ఉత్పత్తి తగ్గించుకున్న పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం విజయ వంతంగా కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఎలాంటి నిధుల కొరత రానీయకుండా ప్రణాళికా బద్ధంగా బడ్జెట్‌ను రాష్ట్ర ప్రజలకు అందించా రు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్ద పీట వేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు, కేటాయింపులలో ఎలాంటి సహకారం అందించకపోయినప్పటికీ రాష్ట్ర ఆదాయ, వ్యయాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను రూపొందించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి చెల్లిస్తున్న జీఎస్‌టీ పన్నుల వాటాలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ర్టాలకు కేటాయింపుల మాదిరిగానే చేశారు తప్ప  తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అదనపు బడ్జెట్‌ కేటాయించక పోవడం శోచనీయం. 


ఆర్థిక మాంద్యంలోను సంక్షేమానికే పెద్దపీట

 కాళేశ్వరం, సీతారామ వంటి సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలను మాగాణంగా చేసి రైతుల కన్నీళ్లను తుడ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. అదేవిధంగా సంక్షేమ రంగంలో ప్రధానంగా రైతుబీమా, రైతు బంధు వంటి పథకాలు దేశంలో ముందు వరు సలో ఉన్నాయన్నారు.ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకారం రైతుబంధు పథకం లో భాగంగా ఈ ఏడాది రూ.10వేల మొత్తాన్ని రైతుల ఖాతాలలో జమ చేసేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు.


జిల్లాలో 2.85 లక్షల మందికి లబ్ధి..

 రైతుబంధు పథకం ద్వారా జిల్లా లో 2.85 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. రైతుబీమా పథకానికి జిల్లాలో 1.65 లక్షల మంది రైతులకు బీమా చెల్లించేందకు ప్రభు త్వం నిధు లు కేటాయించింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఆసరా పింఛన్లు, గురుకులాలు, వసతి గృహాలు, విద్య,  వై ద్యం, మహిళా సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ రంగాల లో ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలకు నిధుల కొరత రానివ్వలేదు. ఆసరా పింఛన్ల అర్హతలను ఈ ఏడాది నుంచి 57 ఏళ్లకు కుదించారు. దీంతో మరి కొంత మంది లబ్ధిదారులు పింఛన్లు అందుకో నున్నారు.ప్రస్తుతం జిల్లాలో ప్రతి నెల 1,68093 మంది ఆసరా పింఛన్లు అందుకుటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరో 30-50 వేల మంది లబ్ధిదారులకు పెరిగే అవకాశం ఉంది. ప్రజలకు 24 గంటల నాణ్యమైన  విద్యుత్‌ సరఫరా చేసేందుకు అవసరమైన నిధుల కేటాయిం చేందుకు ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో కేటాయించింది. సీతారామ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. వైద్య ఆరోగ్యశాఖపై దృష్టిసారించిన ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న కేసీఆర్‌ కిట్లు, తల్లి బిడ్డల సంక్షేమం, అంగన్‌వాడీ సంక్షేమ పథకాలు కొనసాగించనున్నారు. 



అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లు -రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన బడ్జెట్‌ ఇది...అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావించి నిధుల కేటాయింపు జరిగింది. ఒక వైపు ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగు ణంగానే ముందుకు పోతున్నాం. ముఖ్యంగా వ్యవసాయరంగానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకు సీఎం కేసీఆర్‌ ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. రైతుబంధు, రైతు రుణమాఫీ, రైతుబీమాకు వేల కోట్లను కేటాయించడం జరిగింది. వ్యవ సాయ ఆధారిత రంగాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌లో రూపొందించారు. రైతు బాగుంటే దేశం బాగుటుందనే నానుడిని నిజం చేసే లక్ష్యంతో రైతుకు అన్ని విధాల సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభు త్వం ముందంజలో ఉంది.ఎన్నికల హామీలో భాగంగా 57 సంవత్సరాలకే పింఛన్‌ అందించాలనే ఉద్దేశంతో కేటాయింపులు చేశాం.ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అభివృద్ధ్ది చేయాలనే లక్ష్యంతో వారికి అమలుచేస్తున్న సంక్షేమపథకాలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు సీఎం కేసీఆర్‌ నిధులు కేటాయించారు. ఆసరా పింఛన్లకు అధిక మొత్తంలో నిధుల కేటాయింపు జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శాసన  సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉంది. దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగాలు ఆర్థిక మాంద్యంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రజల సంక్షేమానికి ఎలాంటి అవరోధాలు ఏర్ప డకుండా బడ్జెట్‌లో నిధులు కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి బడ్జెట్‌ గతంలో ఎన్నడు చూడలేదు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఆసరా పింఛన్ల లబ్ధిదారుల వయోపరిమితి తగ్గించడంతో  వారికి ఎంతో లాభం చేకూరనుంది. బడ్జెట్‌ వాస్తవాలకు అనుగుణంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా, అవసరాలకు అనుగుణంగా ఉంది.



దేశ చరిత్రలోనే నూతన అధ్యాయం- ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు 

బడ్జెట్‌ రూపకల్పనలో దేశ చరిత్రలోనే తెలంగాణ ప్రభుత్వం నూతన అధ్యాయాన్ని, ఒరవడిని సృష్టించింది. ఇది జనరంజకమైన బడ్జెట్‌. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు, నీటిపారుదల, మహిళా అభివృద్ధికి పెద్ద పీట వేయడం జరిగింది. అన్నదాతల సంక్షేమానికి అగ్రస్థానం ఇస్తూ వ్యవసాయ రంగానికి, సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రముఖ స్థానం ఇవ్వడం జరిగింది.రూ. 25 వేల లోపు ఉన్న రైతురుణాలను మాఫీ చేస్తామని చెప్పి రైతులకు శుభవార్త అందించారు. వీరి రుణాలను ఒకే దఫా మాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణ యం చేయడం శుభపరిణామం. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా వాస్తవిక కోణంలో బడ్జెట్‌ రూపకల్పన జరిగింది. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.. కల్యాణలక్ష్మి రూ.1350 కోట్లు కేటాయించడమే ఆయా వర్గాల పట్ల కేసీఆర్‌కు ఉన్న ప్రేమ స్పష్టమవుతుంది. మహిళలకు వడ్డీలేని రుణాలు అందించేందుకు రూ. 12,000 కోట్లు కేటాయించి సీఎం మహిళా పక్షపాతి అని తేటతెల్లమైంది. ఒక వైపు ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమ రంగానికి సీఎం అగ్రతాంబూలం వేశారు. సీఎం ఒక సామాజిక ఇంజనీర్‌లా ఆలోచించి, బడ్జెట్‌కు రూపకల్పన చేసి బడుగు జీవులకు భరోసానిచ్చారు. ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమ రంగానికి ఎక్కడా కూడా ఎటువంటి కోత విధించలేదన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,82,914 కోట్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టడం సాధారణ విషయం కాదు. గ్రామీణాభివృద్ధికి రూ. 23 వేల కోట్లు కేటాయించారు. రైతుబంధు పథకానికి రూ. 14 వేల కోట్లు కేటాయించడం ద్వారా రైతుపక్షపాతిగా మరోసారి నిరూపించుకున్నారు. సాగునీటి రంగానికి రూ. 11,054 కోట్లు కేటాయించి అన్నదాతల పెన్నిధిగా సీఎం పేరుగాంచారు. మహిళా అభివృద్దికి సీఎం అగ్రస్థానం కల్పించారు.


అభివృద్ధి సంక్షేమ రంగాలకు అధిక నిధులు.. ఖమ్మం జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు  

ఆర్థికమాంద్యం ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ రంగాలకు నిధులు కేటాయిం చడంలో సమతుల్యతను పాటించారు. ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పడుతున్న తపనకు ఈ బడ్జెట్‌ నిదర్శనం. బడ్జెట్‌లో కేటాయింపులపై ప్రతిపక్షాలకు విమర్శించే తావుకూడాలేదు. ఆర్థికంగా దేశంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా బడ్జెట్‌ రూపకల్పన చేయడం అభినందనీయం. తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు శాసన సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న సాగు, తాగు నీటి ప్రాజెక్టులకు, సంక్షేమ రంగాలకు అవసరమైన నిదులు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌  ప్రజా రంజకంగా ఉందని చెప్పవచ్చు. ప్రజలు కోరుకున్న బడ్జెట్‌ను మంత్రి ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉంది.


logo