సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 09, 2020 , 00:12:31

సహకార ఎన్నికలు ఏకగ్రీవం చరిత్రాత్మకం

సహకార ఎన్నికలు ఏకగ్రీవం చరిత్రాత్మకం

ఖమ్మం వ్యవసాయం, మార్చి 8: సొసైటీ డైరెక్టర్‌ నుంచి చైర్మన్లు మెజార్టీ సంఖ్యలో ఏకగ్రీవాలు, డీసీసీబీ పాలకవర్గం సైతం ఏకపార్టీ వశం కావడం జిల్లా చరిత్రతో ఇదే తొలిసారి అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం నగరంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయం ఆవరణలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌కు ఎన్నికైన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, పాలకవర్గ సభ్యులు అభినందన సభకు జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణంకు సొసైటీ చైర్మన్లు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకలు ఘనస్వాగతం పలికారు. మేళాతాళాలతో స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడారు. 1920 సంవత్సరంలో ఖమ్మం డీసీసీబీ తన ప్రస్థావనం ప్రారంభించడం జరిగిందన్నారు. నేటి వరకు వందేళ్లు పూర్తి చేసుకుందని, వందేళ్ల చరిత్ర కలిగిన నూతన పాలకవర్గానికి సైతం ఎంతో విశిష్టత ఉందన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌పై ఉన్న నమ్మకంతో జిల్లా పజ్రలు టీఆర్‌ఎస్‌ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మెజార్టీ చైర్మన్లు ఏకగ్రీవాలు కావడం, చివరకి నూతన పాలకవర్గం సైతం టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు కావడం సంతోషంగా ఉందన్నారు. ఇందు కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు ఒకే బాట, ఒకే మాటగా ఉండి సహకరించారన్నారు. వారు ఇచ్చిన సహకరానికి, సొసైటీ చైర్మన్లు సైతం తీసుకున్న చొరవ ఎప్పటికీ మరచిపోలేమన్నారు. సహకార బ్యాంక్‌ బాధ్యతలు తీసుకోవడం అంతా ఆషామాషీ వ్యవహారం కాదని, నిత్యం రైతుల అభివృద్ధి, బ్యాంక్‌ పురోగతిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పంట రుణాలు ఇస్తూనే, రుణాల రికవరిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అనతికాలంలోనే బ్యాంక్‌ ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం రూ.900 కోట్ల డిపాజిట్లు, రూ.1,300 కోట్ల రుణాలు ఇవ్వడం బ్యాంక్‌ సేవలకు అద్దం పడుతుందన్నారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు, చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు కష్టించి పని చేసి రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి చూపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి సొసైటీల సమస్యలను పరిష్కరించాలని మంత్రి సూచించారు. నేడు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో అన్నదాతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రైతుబంధు, రైతుబీమా కొనసాగిస్తూనే, రుణమాఫీపై ప్రకటన చేయడం జరిగిందన్నారు. తక్షణం రూ.25వేల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ నిధులు చెక్కుల ద్వారా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పంపిణీ చేయనున్నారన్నారు. అనంతరం రూ. 50వేలు, 1లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతులకు సైతం రుణమాఫీ వర్తింపచేయడం జరుగుతుందన్నారు. సాక్షత్‌ నిండు అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ఖమ్మం డీసీసీబీపై మాట్లాడటం గొప్ప విషయమన్నారు. అంటే ఖమ్మం డీసీసీబీకి సీఎం కేసీఆర్‌ ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో అర్థం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం యాసంగి సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగిందని జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి జరిగితే 10 లక్షల ఎకరాల్లో సాగు జరగనుందని మంత్రి తెలిపారు.  సుదీర్ఘ అనుభవం కలిగిన పాలకవర్గం సభ్యులు ఉన్నారని, మరింత సహకారం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి భరోస ఇచ్చారు. అన్నదాతలకు మేలు చేస్తే ఎప్పటికి మరువబోరని మంత్రి గుర్తు చేశారు. ఇందుకు తార్కాణం గత కొద్ది సంవత్సరాలుగా ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కట్టిన సందర్భాలు గుర్తు చేశారు. అనంతరం డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను మంత్రి, ఎమ్మెల్యేలు, నాయుకులు ఘనంగా సన్మానించారు. 


అన్నదాతల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలి

జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ పరిధిలోని రైతుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలకవర్గ సభ్యులు, సారథులు పనిచేయాలని ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు సూచించారు. వందేండ్ల చరిత్రకలిగిన బ్యాంక్‌ పరిధిలో లక్షలాధి మంది రైతులున్నారన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పూర్తి నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించారన్నారు. సుమారు రూ. 2,300 కోట్ల టర్నోవర్‌ కలిగిన ఈ బ్యాంక్‌ను పదవీకాలం ముగిసేసరికి మరో 300 కోట్ల పైచిలుకు టర్నోవర్‌ పెరిగే విధంగా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. రైతాంగం అభివృద్ధి కోసం తెలంగాణ సర్కార్‌ అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసేందుకు, బ్యాంక్‌ టర్నోవర్‌ను పెంచేందుకు పాలకవర్గ సభ్యులు సొసైటీ చైర్మన్లతో మమేకమవుతూ ముందుకుసాగాలని వారు సూచించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సొసైటీ చైర్మన్లకు, పాలకవర్గ సభ్యులకు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లకు వారు శుభాకాంక్షలు తెలిపారు. 


మారుమూల పల్లెలకు సేవలు విస్తరించాలి:కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ 

ప్రస్తుతం బ్యాంక్‌లో డిపాజిట్ల సేకరణ ఆశాజనకంగా ఉందని మారుమూల గ్రామాలకు డీసీసీబీ సేవలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌, బ్యాంక్‌ మాజీ పర్సన్‌ ఇన్‌చార్జ్‌ ఆర్‌వీ కర్ణన్‌ అన్నారు. ఈ అభినందన సభకు బ్యాంక్‌ పర్సన్‌ ఇన్‌చార్జ్‌గా మాత్రమే హాజరుకావడం జరిగిందన్నారు. గత కొద్ది రోజుల నుంచి బ్యాంక్‌ నిర్వహణను పరిశీలించడం జరిగిందన్నారు. సొసైటీల అభివృద్ధి కోసం ఆయా గ్రామాల్లో సొసైటీల పరిధిలో శీతల గిడ్డంగులను, గోడౌన్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత కొద్ది రోజుల క్రితమే పంట రుణాలకు సంబంధించి ప్రణాళికను రూపొందించడం జరిగిందని, ఈ సంవత్సరం మరో రూ. 100 కోట్లను అధికంగా పంట రుణాలు అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఆ నిర్ణయాన్ని పాలకవర్గ సభ్యులు ఆలోచన చేయాలని కలెక్టర్‌ సూచించారు. 


సీఎం కేసీఆర్‌ ఆశయానికి అనుగుణంగా పనిచేస్తాం..చైర్మన్‌ కూరాకుల, వైస్‌ చైర్మన్‌ దొండపాటి 

ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌ మాపై నమ్మకంతో ఈ పదవులను కట్టపెట్టడం జరిగిందని, వారి నమ్మకానికి అనుగుణంగా మేము పనిచేస్తామని డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, వైస్‌ చైర్మన్‌ దొండపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. రైతుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ జరిగే విధంగా చూడటంతో పాటు పంట రుణాలను అర్హత కలిగిన రైతులకు అందించేందుకు తమ శక్తిసామర్థ్యాల మేరకు పనిచేస్తామన్నారు. మా ఎన్నికకు సహకరించిన అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు, సొసైటీ చైర్మన్లకు, పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 


నూతన సారథులకు ఘన సన్మానం 

డీసీసీబీ సారథులుగా ఎన్నికైన నాగభూషణం, వెంకటేశ్వరరావును మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్యే కందాల, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఘనంగా సన్మానించారు. అనంతరం పాలకవర్గ సభ్యులు, డీసీఎంఎస్‌ సారథులు రాయలశేషగిరిరావు, కొత్వాల శ్రీనివాస్‌, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, ఖమ్మం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెంకటరమణ, మాజీ చైర్మన్‌ ఆర్‌జేసీ కృష్ణలు పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ పాపాలాల్‌, ఉపమేయర్‌ బత్తుల మురళీప్రసాద్‌, డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గ సభ్యులు, ఆయా సొసైటీల చైర్మన్లు, జిల్లా సంస్థ చైర్మన్‌ ఖమర్‌, డీసీసీబీ సీఈవో వసంతరావుతో పాటు నగర కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఆయా కుల సంఘాల నాయకులు, డీసీసీబీ డీజీఎంలు, ఏజీఎంలు తదితరులు పాల్గొన్నారు.