సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 09, 2020 , 00:09:11

భద్రాద్రిలో ఉత్సవాలకు అంకురార్పణ

భద్రాద్రిలో ఉత్సవాలకు అంకురార్పణ

భద్రాచలం, నమస్తే తెలంగాణ మార్చి8: కల్యాణం అంటే సీతారాముల కల్యాణమే మరి.. కల్యాణ పరమార్ధమైన దాంపత్యానికి, దివ్యత్వాన్ని అపాదించింది వారిద్దరే... భార్యభర్తల అనురాగానికి, అనుబంధానికి ప్రేమాస్పదమైన నిర్వచనాన్ని ఇచ్చిన ప్రేమ మూర్తులు శ్రీసీతారాములు... అందుకే సీతారాముల కల్యాణం జగత్‌కల్యాణం... ఆ జగత్‌ కల్యాణ వైభోగం ఒక్క భద్రాచలంలోనే భక్తులకు ప్రతీ ఏటా సాకారమవుతోంది... తెలుగువారి ఇలవేల్పు భద్రాద్రి రాముడు... ఈ ఏడాది శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది... భద్రగిరిలో మార్చి 25 నుంచి ఏప్రిల్‌8వ తేదీ వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి... అయితే ఈ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్ల ప్రక్రియ ప్రారంభం కాగా, వైదిక పరమైన పూజా కార్యక్రమాలు ప్రారంభానికి నోచుకుంటున్నాయి... సోమవారం స్వామివారి కల్యాణ తలంబ్రాలు కలుపు వేడుక నిర్వహించనున్నారు... డోలోత్సవం, వసంతోత్సవం అంగరంగ వైభవంగా జరపనున్నారు... ఈ వేడుకలతో భద్రగిరి రాముడు పెళ్లి కొడుకుగా భక్తులకు దర్శనమివ్వనున్నారు... ఈ ఉత్సవాలకు ఆదివారం దేవస్థానం అర్చకులు అంకురారోపణం గావించారు. 

భద్రాద్రిలో ఉత్సవాలకు అంకురార్పణ..

దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రగిరిలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు సంబంధించిన వైదిక పరమైన కార్యక్రమాలు ఆదివారంతో ప్రారంభమయ్యాయి. మార్చి9వ తేదీ (సోమవారం) పాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం 9 గంటలకు ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో తలంబ్రాలు కలుపు వేడుక, డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించనున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం దేవస్థానం సన్నిధిలో అర్చకులు ప్రత్యేక పూజలు గావించారు. సాయంత్రం పవిత్ర గోదావరి నది నుంచి పుణ్యతీర్ధాలను తీసుకొచ్చారు. స్వామివారికి ఆరాధన, దర్భార్‌సేవ నిర్వహించారు. ప్రత్యేక పూజలు అనంతరం యాగశాల నుంచి ఆలయ అధికారులు ఆచార్య, బ్రహ్మ, రుత్వికులు సమస్థ మంగళవాయిద్యాలతో అంతరాలయానికి చేరుకున్నారు. అక్కడ ముందుగా స్వామివారి వద్ద భగవత్‌ ప్రార్ధన నిర్వహించారు. తదుపరి యాగశాలలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యఃవచనం, రక్షా బంధన, పుట్టమట్టితో పూజ, నవధాన్యాలతో అర్చన, అఖండ దీపారాధన, ద్వారతోరణ పూజ నిర్వహించారు. వాస్తు పూజ, వాస్తు హోమం, వసంతోత్సవానికి అంకురారోపణ గావించారు. 

కల్యాణ తలంబ్రాలు కలిపేందుకు ఏర్పాట్లు సిద్ధం..

పాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా అర్చకస్వాములు భద్రాద్రి రాముడుని పెళ్లికొడుకుగా, సీతమ్మవారిని పెళ్లి కూతురుగా అలంకరించనున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను బేడా మండపంలో వేంచేయింపచేసి అంతరాలయం నుంచి స్వామివారి వద్ద శేషమాలికలను, కల్యాణ మహోత్సవానికి సంబంధించిన వస్తూ సామగ్రి అంతటిని సమస్థ మంగళవాయిద్యాలతో ఆలయ అధికారులు, అర్చకులు చిత్రకూట మండపానికి తీసుకొస్తారు. అక్కడ ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యఃవచనం జరిపి, పుణ్యజలాలను తలంబ్రాల కోసం తీసుకొచ్చిన బియ్యంపై జల్లుతారు. 9మంది వైష్ణవ ముత్తైదువులు రోలు, రోకలి నందు లక్ష్మీ, సరస్వతిలను ఆవాహన చేసి రోకలికి కంకణదారణ చేస్తారు. ముందుగా పసుపు కొమ్ములు రోళ్ల యందు పోసి ముత్తైదువులు దంచుతారు. అనంతరం గుక్కా గులాలు, అత్తర్‌, పన్నీర్‌, ఆవునెయ్యి, సెంట్‌, బియ్యం, పసుపు, కుంకుమలతో, 9 రకాల ద్రవ్యాలతో ఆవాహన చేసిన పిదప 1108 మంది మహిళా భక్తురాళ్లు వారి స్వహస్తములతో తలంబ్రాలు కలుపుతారు. ఉభయ రాష్ర్టాల నుంచి వచ్చిన గోటి తలంబ్రాలను ఈ తలంబ్రాలలో కలుపుతారు. వైష్ణవ స్వాములు ఈ తలంబ్రాలను శిరస్సుపై ఉంచి ఉత్సవ మూర్తుల వద్దకు తీసుకొస్తారు. ద్రువమూర్తులకు చూపించిన పిదప బాండాగారాములో భద్రపరుస్తారు. అనంతరం ఉత్సవ పెరుమాళ్లకు అభిషేక తిరుమంజనం గావిస్తారు. తదుపరి యాగశాలలో మహా పూర్ణాహుతి జరుపుతారు. మూల మూర్తుల వద్ద మహా కుంభప్రోక్షణ నిర్వహిస్తారు. అనంతరం డోలోత్సవం నిర్వహిస్తారు. ఆస్థాన హరిదాసులతో లాలలు, జోలలు, కీర్తనలు ఆలపిస్తారు. కుంభ, ధ్వజ, అష్ఠ, ద్వాదశ హారతులను స్వామివారి ఉత్సవ మూర్తులకు చూపిస్తారు. ప్రత్యేక పూజలు అనంతరం అర్చక స్వాములు వసంతున్ని ఆవాహనం చేసి 9 పసుపు ముద్దలను తయారు చేసి వసంత రుతునాం అనే మంత్రం పఠించి కలశములోకి వసంతుడిని అవాహనం చేస్తారు. గుక్కా గులాలతో అంతరాలయానికి చేరుతారు. అక్కడ వసంతమును రామయ్యకు ప్రోక్షిస్తారు. పసుపు ముద్దలను ఒక దానిని రామయ్య శిరస్సుపై ధరింపచేసి, రెండో పసుపు ముద్దను అమ్మవారి మంగళసూత్రం వద్ద, మూడో ముద్దను లక్ష్మణస్వామివారి వక్ష స్థలంపై ధరింపచేస్తారు. దీంతో రామయ్య పెళ్లి కొడుకు అయినట్లుగా భావిస్తారు.