శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 09, 2020 , 00:03:26

మహిళా సాధికారతకు పెద్దపీట

మహిళా సాధికారతకు పెద్దపీట

మామిళ్లగూడెం: మహిళలేనిదే...నేటి ఈ సమాజం లేదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగిన మహిళా దినోత్సవ సంబురాలలో పాల్గొన్నారు. జిల్లా మహిళా సంక్షేమాధికారి సబిత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. ప్రతి మహిళను మహిళా దినోత్సవం రోజునే గౌరవించడమే కాకుండా ప్రతి పనిలోనూ వారికి సముచితస్థానం ఇచ్చి గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. సృష్టికి మూలమైన మహిళలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నారు. స్త్రీలను గౌరవించడం, వారికి రక్షణగా నిలవడం, సంప్రదాయ సాంస్కృతులను కాపాడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వినూత్న చర్యలు తీసుకుంటుందన్నారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు పురుషులతో సమానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఏర్పడిన పంచాయతీరాజ్‌ చట్టం -2018, పురపాలక చట్టం-2019 ప్రకారం ప్రజాపాలనలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో అనేక మంది మహిళలు ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, జడ్పీచైర్మన్లుగా, కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా, మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్‌లుగా రాణిస్తున్నారన్నారు. ప్రతి ఇంటిలో మహిళ ఒక ఆర్థిక మంత్రి వంటి వారన్నారు. మహిళల రక్షణ కోసం షీటీమ్స్‌ ఏర్పాటు చేయడంతో పాటు మహిళా చట్టాలను కఠినంగా అమలుచేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ముందుందన్నారు. ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్‌ కిట్లు వంటి పథకాలతో పాటు మహిళా శిశు సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మహిళాలోకం ఎంతో ఆనందంగా ఉందన్నారు. జడ్పీచైర్మను లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు విద్యా, ఉద్యోగ, రాజకీయ, వ్యాపార రంగంలో ఎంతో ప్రతిభను కనబరుస్తున్నారన్నారు. కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ మాట్లాడుతూ మహిళలు నిత్యం ఉద్యోగ, కుటుంబ బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారన్నారు. మహిళల్లో ఎన్నో వినూత్నమైన ప్రతిభానైపుణ్యాలు కలిగి ఉంటారని, వారు చేస్తున్న పనులు పురుషుల కంటే అధికంగా కష్టపడి పనిచేస్తున్నారన్నారు. అనంతరం జిల్లాలో వివిధ పథకాల అమలులో ప్రతిభకనపరిచిన మహిళా ఉద్యోగులు, ప్రభుత్వ వైద్యులు, డీఆర్‌డీఏ ఉద్యోగులు, మెప్మా సిబ్బందిని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌లు ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముందుగా కళాకారులు మహిళా చైతన్యగీతాలను, మహిళల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మను రాయల శేషగిరిరావు, జిల్లా మహిళా సంక్షేమాధికారి సబిత, డీఆర్‌డీవో ఇందుమతి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళీప్రసాద్‌, వైరా, ఏన్కూరు జడ్పీటీసీలు నంబూరి కనకదుర్గ, బాదావత్‌ బుజ్జి తదితరులు పాల్గొన్నారు.