గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 08, 2020 , 03:00:08

సంపూర్ణ ‘సహకారం’

సంపూర్ణ ‘సహకారం’

(ఖమ్మం వ్యవసాయం)వందేళ్ల చరిత్ర కలిగిన ఈ బ్యాంక్‌.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఖాతాదారులకు, రైతులకు ఉత్తమ సేవలందించడంలో ముందంజలో ఉంది. వాణిజ్య బ్యాంకులకు దీటుగా సేవలందిస్తున్నది. సొసైటీల బలోపేతం కోసం అనేక కార్యక్రమాలనూ చేపట్టింది. దీంతో నేడు సంఘాలు లాభాల బాటలో పయనిస్తున్నాయి. తెలంగాణ రాష్ట ఆవిర్బావం తరువాత ఇటు రైతులకు మెరుగైన సేవలు అందిస్తూనే.. అటు సొసైటీలు వ్యాపారాలు చేసుకోవడాకి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్నది. అంకితభావంతో పనిచేసే అధికారులు కూడా అందుబాటులో ఉండటంతో బ్యాంక్‌ పురోభివృద్ధి సులభతరమైంది. ఒక పక్క వాణిజ్య బ్యాంకుల నుంచి వస్తున్న పోటీని తట్టుకుంటూనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని రైతులకు అన్ని రకాల సేవలనూ అందిస్తున్నది. ఏటా దాదాపు 1.66 లక్షల మంది రైతులకు రుణాలు అందించి సాగు విస్తీర్ణం పెంపుదలలో కీలకపాత్ర పోషిస్తున్నది. 


స్వరాష్ట్ర సాధనకు ముందు 107 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు గాను 10 కంటే తక్కువ సంఘాలు మాత్రమే వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ మనుగడ సాగించేవి. తరువాత పలు మండలాలు ఏపీలో విలీనం కావడంతో వాటి పరిధిలోని 6 సొసైటీలు ఆ రాష్ట్ర పరిధిలోకి వెళ్లాయి. దీంతో ఖమ్మం డీసీసీబీ పరిధిలో ప్రస్తుతం 101 సొసైటీలు మాత్రమే ఉన్నాయి. 2014 తరువాత సమూల మార్పులు వచ్చాయి. సొసైటీల వ్యాపారాలు మరింత పెరిగాయి. 101 పీఏసీఎస్‌లకు గాను దాదాపు 90 పీఏసీఎస్‌లు వివిధ వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా బలోపేతమయ్యాయి. పంట రుణాలను అందించడమే కాకుండా రైతులకు, రైతు కుటుంబాల భద్రతకు బీమా భరోసాలు, రూపే కార్డులు, మొబైల్‌ ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. రైతుల పిల్లలకు విదేశీ విద్యను అందించేందుకు సులభతరమైన రుణాలు, ద్విచక్ర వాహన రుణాలు అందిస్తున్నాయి. తనఖా రుణాలు, ఉద్యోగులకు వాహన రుణాలు అందిస్తూ ఆయా వర్గాల మన్ననలూ చూరగొంటున్నది. నిరుపేద కౌలు రైతులను ఆదుకునేందుకు జేఎల్‌జీ గ్రూపులను ఏర్పాటు చేసి దాదాపు రూ.100 కోట్లను రుణాలుగా ఇచ్చింది. విద్యార్థులకు యంగ్‌ చాంపియన్‌ పథకాన్ని వంద శాతం అమలు చేసి జాతీయస్థాయిలో ప్రత్యేకతను చాటుకుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సహకార సంఘాలకు చేరువచేయడంతో నేడు సహకార సంఘాలు సైతం మినీ బ్యాంకులుగా రూపాతరం చెందాయి. అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న ఖమ్మం డీసీసీబీపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న కథనం.


1,66,636 మంది రైతులకు రుణమాఫీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తొలి విడుత రుణమాఫీలో రాష్ట్రంలోకెల్లా ఖమ్మం డీసీసీబీలోనే ఎక్కువ మంది రైతులు  లబ్ధిపొందారు. 41 మండలాల్లో మొత్తం 99 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా వీటి పరిధిలో 35 బ్రాంచీలు ఉన్నాయి. జిల్లా మొత్తంలో అన్ని బ్యాంకుల్లో పంట రుణాలు పొందిన రైతుల రుణమాఫీ కోసం రూ.1711 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా అందులో కేవలం ఖమ్మం డీసీసీబీకి రూ.475 కోట్లను రుణమాఫీ కింద పొందింది. 1,66, 636 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. దీంతో తొలుత ఇచ్చిన రుణాల వసూళ్లు పూర్తియినట్లయింది. తద్వారా అప్పుల ఊబిలోంచి బయటపడినట్లయింది. 


స్వరాష్ట్ర సాధన తరువాత పురోగతి

స్వరాష్ట్ర సాధన తరువాత వాణిజ్య బ్యాంకులకు దీటుగా 47 బ్రాంచీలను కంప్యూటరీకరణ చేసింది. ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌, డీబీటీ (డైరెక్టు బెనిఫిషియర్‌ ట్రాన్స్‌ఫర్‌) వంటి సౌకర్యాలను కూడా అందుబాటులోకి తెచ్చింది. డీసీసీబీలోని అన్ని శాఖలనూ ఆధునీకరించారు. జిల్లా రైతుల పిల్లలు పేరొందిన విద్యాసంస్థల్లో చదువుకునేందుకు రుణాలు, విదేశీ విద్యను అభ్యసించేందుకు దాదాపు రూ 38.08 కోట్లను రుణాలుగా అందించింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు తనకా రుణాలు ఇచ్చి తద్వారా రూ 25.05 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మరో 7.28 కోట్ల మేర వాహన రుణాలను అందించింది. సెక్యూరిటీ ఓవర్‌డ్రాఫ్ట్‌ రుణాలుగా, నాన్‌ అగ్రికల్చర్‌ తనఖా రుణాలుగా రూ.164.68 కోట్లను అందించింది. సొసైటీల ద్వారా రూ 10.51 కోట్లతో ద్విచక్ర వాహన రుణాలను, డెయిరీ యూనిట్లకు మరో రూ.27.68 కోట్ల రాయితీ రుణాలను అందించింది. వీటితో ప్రభుత్వ ప్రాయోజిక సబ్సిడీ రుణాలను ఊకడా అందజేసింది. గ్రూపు ఇన్సూరెన్స్‌ ద్వారా 1.25, 617 మంది సహకార రైతులకు పర్సనల్‌ యాక్సిడెంటల్‌ ఇన్సూరెన్స్‌ పథకం ద్వారా రూ.100 లక్షల ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించింది. 


సంఘాల బలోపేతమే ధ్యేయంగా..

సహకార సంఘాల బలోపేతం కోసం అనేక సంస్కరణలు చేపట్టింది ఖమ్మం డీసీసీబీ. సంఘాలన్నింటికీ సొంత భవనాలు నిర్మించింది. అవి వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా గోదాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఎరువులు, విత్తనాల వ్యాపారాలే కాకుండా సూపర్‌బజార్లు, మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు, ఇతర వ్యాపారాలు చేసుకునేందుకు డీసీసీబీ విస్తృత అవకాశాలను కల్పించింది. తద్వారా సంఘాలు బలోపేతం అయ్యాయి. 2014-15లో మొత్తం రూ.105.59 కోట్ల వ్యాపారం చేయగా రూ.2.38 కోట్ల కమీషన్‌ను ఆర్జించింది. 2015-16లో 84 సంఘాలు వరి ధాన్యం కొనుగోలు చేసి రూ.3.84 కోట్ల కమీషన్‌ను పొందింది. 97 సంఘాలు ఎరువుల వ్యాపారం చేయగా 1.82 కోట్ల కమీషన్‌ను అందుకున్నాయి. 93 సంఘాలు విత్తనాల వ్యాపారం చేయగా రూ.30 లక్షల కమీషన్‌ పొందాయి. 2016-17లో 98 సంఘాలు ఎరువులు, విత్తనాల వ్యాపారాలు చేసి సుమారు రూ.35.54 కోట్ల కమీషన్‌ ఆర్జించాయి. 2018-19లో 74 సంఘాలు పరపతేతర వ్యాపారాలు చేసి రూ.5.66 కోట్ల కమీషన్‌ను సొంతం చేసుకున్నాయి. 71 సంఘాలు ఎరువుల వ్యాపారాలు చేసి రూ.25 లక్షలు, 55 సంఘాలు విత్తన వ్యాపారాలు చేసి రూ.25.09 కోట్లు కమీషన్ల రూపంలో సంపాదించాయి. 


మెరుగైన సేవలే లక్ష్యంగా..

ఖాతాదారులకు ప్రైవేటు బ్యాంకులకు దీటుగా సేవలిందించేందుకు డీసీసీబీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. నాలుగేళ్ల క్రితం అన్ని లావాదేవీలూ మాన్యువల్‌గా జరిగేవి. ఇప్పుడు ఆన్‌లైన్‌ సౌకర్యం ఖాతాదారులకు చేరువైంది. 47 బ్యాంకులతోపాటు సహకార సంఘాల్లో సైతం ఈ విధానం కొనసాగుతున్నది. ఏటీఎంలు కూడా అందుబాటులోకి వచ్చాయి. మారుమూల గ్రామాల రైతుల కోసం మొబైల్‌ ఏటీఎంలూ సేవలందిస్తున్నాయి. యంగ్‌ చాంపియన్‌ పథకంలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఇప్పటికే అకౌంట్‌లు తెరిచారు. 36 వేల మంది విద్యార్థులకు ఏటీఎం కార్డులను అందించారు. మరో 1.66 లక్షల మందికి రూపే కార్డులనూ అందించారు. 


కౌలు రైతులకూ రుణ సదుపాయం

కొన్నేళ్లుగా కౌలు రైతులూ పెరుగుతున్నారు. అయితే వారికి కూడా పంట రుణాలు అందిచేందుకు వాణిజ్య బ్యాంకులు ముందుకురాకపోవడంతో వారు ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు రుణాలను పొందుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన డీసీసీబీ.. కౌలు రైతులను ఆధుకోవాలనే ఉద్దేశంతో నాబార్డు సహకారంతో జాయింట్‌ లయబిలిటీ గ్రూపులను ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లాలో  సుమారు 1000 గ్రూపులను ఏర్పాటు చేసి రూ.60 కోట్ల రుణాలను అందించింది. సుమారు 60 వేల మందికి లబ్ధి కలిగింది. 


నేడు నూతన పాలకవర్గ అభినందన సభ

జిల్లా కేంద్రసహకార బ్యాంక్‌ నూతన పాలకవర్గ అభినందన సభ ఆదివారం డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు జరుగనుంది. చైర్మన్‌గా ఎన్నికైన కూరాల నాగుభూషణం ఇప్పటికే పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆదివారం వైస్‌ చైర్మన్‌ దొండపాటి వెంకటేశ్వరరావుతోపాటు మిగిలిన డైరెక్టర్లు సైతం బాద్యతలు స్వీకరించానున్నారు. అనంతరం అభినందన సభ జరగనుంది. ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ హాజరుకానున్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్‌, కార్పొరేషన్ల చైర్మన్‌లు కూడా హాజరుకానున్నారు. వీరితోపాటు ఉమ్మడి జిల్లా పరిధిలోని సొసైటీ అధ్యక్షులకు సైతం ఆహ్వానాలు అందాయి. పాలకవర్గ పదవీ బాధ్యతల స్వీకారాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సభ అనంతరం నూతన పాలకవర్గ తొలి సమావేశం చైర్మన్‌ అధ్యక్షతన జరుగనుంది.