శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 08, 2020 , 02:58:25

సంతకు పోదాం చలో..చలో..

సంతకు పోదాం చలో..చలో..

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : ఎవరు ఏ పంట పండించారు.. ఎవరి వద్ద ఏ వస్తువులు ఉన్నాయి.. ఏ ప్రాంతంలో ఎలాంటి వస్తువులు దొరుకుతాయి.. వాటి అవసరం అందరికీ ఉం టుంది. అలాంటి వస్తువులను ఒక్క చోటుకు చేర్చుకునేందుకు బ్రిటీష్‌ కాలంలో సంతలను ఏర్పాటు చేశారు. వస్తుమార్పిడి ద్వారా ప్రతి వ్యక్తికి అవసరమైన వస్తువులు అంగడిలో దొరుకుతాయని, అందుకే ఇలాంటి వస్తువులను సంతలో విక్రయాలకు కేంద్ర బిందువుగా మార్చుకున్నారు. ప్రతి ఊరికి రోజుకో సంత ఏర్పాటు చేసుకోవడం, నాటి నుంచి ఆనవాయితీగా కొనసాగింది. స్వాతంత్య్రం వచ్చాక వస్తువుల విక్రయాలు క్రమేపి పెరిగాయి. నాణేలు రద్దయిన తరువాత నోట్లు అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరికీ అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు వస్తువులను విక్రయించడం సంప్రదాయమైంది. పెరట్లో పండిన పంటను సైతం బండ్లపై సంతకు తెచ్చి విక్రయించిన సరుకులతో పాటు, డబ్బులతో వారికి అవసరమైన సరుకులను కొనుగోలు చేసుకునే వారు. పెరటి కోళ్లు, ఆవులు, గేదెలు, మేకలు సమృద్ధిగా పెరిగితే వాటిని కూడా సంతలకు తీసుకొచ్చి విక్రయాలు జరిపేవారు. దీంతో గ్రామాల్లో ఉండే పశువులు, మేకలు ఉత్పత్తి దేశమంతా పాకింది. రైతులు తోటల్లో పండిన పంటలను మార్కెట్లకు తీసుకురావడంతో వ్యవసాయంపై అందరిదృష్టి పడి సాగు చేసే ఆలోచన ఏర్పడింది. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా పండించే కూరగాయలు, అడవుల్లో దొరికే ఉత్పత్తులను  సంతలకు తీసుకురావడంతో మైదాన ప్రాంతాల్లో ఉండేవారు వాటి ని వస్తుమార్పిడి ద్వారా తీసుకునే వారు. దీంతో ఎవరి అవసరాలైనా సంతల ద్వారా తీరిపోయేవి..


నేడు అన్ని వస్తువులు అంగడిలోనే

సంతలకు ఒక ప్రత్యేకత ఉంది.. ఏ వస్తువు దొరకాలన్నా, ఎవరికి ఎలాంటివి కావాలన్నా సంతే కేంద్ర బిందువుగా మారింది. ఒక జిల్లా సమూహం తీసుకుంటే జిల్లాలోని కొన్ని ప్రాంతాలను సంత వ్యాపార కేంద్రాలుగా చేసుకొని ఆ ప్రాంతాలనే సంతలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికీ అదే పద్ధతి కొనసాగుతున్నది. ఆదివారం నుంచి శనివారం వరకు రోజుకో సంతను ఏర్పాటు చేసి వ్యాపారులు ఆర్థికాభివృద్ధికి కృషి చేసుకుంటున్నారు. కేవలం వ్యాపారంగా ఉపయోగపడే ఈ సంతలు గ్రామాలు, పట్టణాల్లో నివసించే ప్రజల అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అడవిల్లో ఎక్కువగా దొరికే తేనె, అటవీ ఉత్పత్తులు, పెరటి పంటలు, గ్రామాల్లో తయారు చేసిన కుండలు, ఇతర వస్తువులు మార్కెట్‌లోకి తీసుకురావడంతో ప్రతి ఒక్కరూ తయారు చేసిన వాటిపైనే మక్కువ చూపించి కొనుగోలు చేసుకుంటున్నారు. 


ఉమ్మడి జిల్లాలో పెద్ద సంతలు..

ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో పెద్ద సంతలు ఎక్కువగా ఉన్నాయి.  గతంలో చింతూరులో పెద్ద సంత ఉండేది. ఆ తరువాత వేలేరుపాడు, కుంట, నెల్లిపాక బంజర, మోరంపల్లి బంజర, రేగపల్లి సంతలు సుమారు అర కిలో మీటర్‌ పొడవునా వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరించుకునే వారు. రానురాను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని సంతలు ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లిపోవడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా పెద్ద సంతలు ఏర్పాటయ్యాయి. ఆదివారం కొత్తగూడెం, సోమవారం అశ్వాపురం, మంగళవారం భద్రాచలం, బుధవారం బూర్గంపాడు, గురువారం రుద్రంపూర్‌, శుక్రవారం మోరంపల్లి బంజర, శనివారం టేకులపల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంతలు నడుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో కూడా పండితాపురం, కల్లూరు ప్రాంతాల్లో పెద్ద సంతలు నడుస్తున్నాయి.