శుక్రవారం 29 మే 2020
Badradri-kothagudem - Mar 06, 2020 , 23:54:47

జల సిరుల సీతారామ

 జల సిరుల  సీతారామ

రాజీవ్‌సాగర్‌, ఇందిరాసాగర్‌ ఎత్తిపోతల ప్రాజెక్టును రీ డిజైన్‌ చేసి సీతారామ ప్రాజెక్టుగా రూపొందించారు. ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్‌ ఫిబ్రవరి 18, 2016న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రోళ్లపాడు వద్ద ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థ్దాపన చేశారు. రూ.13,057 కోట్ల వ్యయంతో శ్రీకారం చుట్టారు. మొదట రూ.7926 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తైతే 70 టీఎంసీల నీరు ఉమ్మడి జిల్లా మొత్తం పరుగులు పెట్టనుంది. సుమారుగా 6.74 లక్షల ఎకరాలు సాగులోకి రానున్నాయి. గోదావరిపై దుమ్ముగూడెం వద్ద నుంచి సీతారామ ప్రాజెక్టును లిఫ్టు ద్వారా పంపింగ్‌ చేయనున్నారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తీసుకురానున్నారు. టేకులపల్లి మండలం రోళ్లపాడు వద్ద సీతారామ ప్రాజెక్టు రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా చోట్ల బ్యాలెన్స్‌ రిజర్వాయర్లు, లిఫ్టులు చేపట్టనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో 243 కిలోమీటర్ల మేర వాలు కాలువ సరఫరా కానుంది. 9వేల క్యూసెక్కులతో కాలువ డిశ్చార్జి, 8.56 కిలోమీటర్లతో ప్రెజర్‌ మెయిన్‌ పొడవు ఉండనుంది. 


జిల్లాల వారీగా సాగవుతున్న భూములు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 42,935 ఎకరాల్లో పంట సాగవుతున్నది. సీతారామ ప్రాజెక్టు ద్వారా బీడు భూములు కలుపుకుని 1,57,574 ఎకరాలు సాగులోకి రానున్నాయి. తద్వారా మొత్తం 2,00,509 ఎకరాలు సాగవనున్నాయి.. ఖమ్మం జిల్లాలో 2,96,925 ఎకరాలు, సీతారామ ప్రాజెక్టు ద్వారా 1,62,083 ఎకరాలు కొత్తగా సాగులోకి రానున్నాయి. మొత్తం 4,59,008 ఎకరాలు సాగులోకి రానున్నాయి. మహబూబాబాద్‌ జిల్లాలో 5,674 ఎకరాలు సాగవుతున్నాయి. ప్రాజెక్టు ద్వారా 9,196 ఎకరాలు సాగులోకి రానున్నాయి. మొత్తం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇది వరకు 3,45,534 ఎకరాలు సాగవుతుండగా, ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా 3,28,853 ఎకరాలు కొత్తగా సాగులోకి రానున్నాయి. మొత్తం 6,74,387 ఎకరాలు సాగులోకి రానున్నాయి. ఇక ఇప్పటి వరకు ఫేజ్‌-1 పనులు పూర్తయ్యాయి. మొత్తం 8 ప్యాకేజీలుగా విభజించి రూ.6,232కోట్ల అంచనాల ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణను చేపట్టారు. సీతారామ ప్రాజెక్టుకు మొత్తం 13,593 ఎకరాలు పట్టా భూమి కావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఫేజ్‌-1లో 4,169 ఎకరాల భూసేకరణ ప్రతిపాదనలు జరిగాయి. 1800 ఎకరాల భూసేకరణకు 159.4కోట్లు చెల్లించడం జరిగింది. ఇక అటవీ భూమి విషయానికి వస్తే.. ప్రాజెక్టుకు 3,783 ఎకరాల అటవీ భూమి కావాల్సి ఉన్నది. కేంద్ర పర్యావరణ, అడవుల మంత్రిత్వ శాఖల నుంచి మొదటి దశ అనుమతి ఈ ఏడాది ఫిబ్రవరిలో లభించింది. రెండో దశ అనుమతి కోసం రూ. 276 కోట్లు సెప్టెంబర్‌లో చెల్లించారు. సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వ 13.150 కి.మీ కిన్నెరసాని వన్యప్రాణి అటవీ పరిధిలో ఉంది. ఇక కోర్‌ జోన్‌ పరిధిలో కాకుండా 680 ఎకరాల అటవీ భూమి, 413 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి. మొత్తంగా 1,094.55 ఎకరాలకు కేంద్ర వన్యప్రాణి బోర్డ్‌, అటవీ శాఖల అనుమతులు కోరడం జరిగింది.         


శరవేగంగా పనులు..

ఫేజ్‌-1లో ప్రధాన అడ్డంకి వన్యప్రాణి విభాగమే. ఇంతకు ముందు ఫారెస్టు క్లియరెన్స్‌ ఫేజ్‌ -2కు లభించింది. కిన్నెరసాని అభయారణ్యంలో 444 హెక్టార్ల వన్యప్రాణి విభాగం ఉంది. వన్యప్రాణి విభాగం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతులు కోరుతూ ప్రతిపాదనలు పంపించింది. మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్‌రోల్‌మెంట్‌ ఫారెస్టు (ఎంవోఈఎస్‌) ప్రతిపాదనలు స్వీకరిస్తూ నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ వైల్డ్‌ లైఫ్‌(ఎన్‌బీడబ్ల్యూ)కు అందజేసింది. ఇటీవల ఎన్‌బీడబ్ల్యూ కమిటీలో చర్చించి అనుమతులిస్తూ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ప్రధాన అడ్డంకి అయిన వన్యప్రాణి విభాగం సమస్య సమసిపోయింది. ఫేజ్‌-1 పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగనున్నాయి. కాగా, కోర్‌జోన్‌ (అడవి), బఫర్‌జోన్‌ (కోర్‌జోన్‌ ఎండింగ్‌)కు అనుమతులిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫేజ్‌-1 పరిధిలో రూ.11,880కోట్ల పనులు జరుగాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.400 కోట్ల వరకు పనులు పూర్తయ్యాయి. అందులోనే భూసేకరణ కూడా ఉంది. 


ఇప్పటి వరకు జరిగిన పనులు..

ఇప్పటి వరకు జరిగిన పనులను పరిశీలిస్తే.. రూ. 2850కోట్ల విలువైన పనులను పూర్తిచేశారు. ఇప్పటి వరకు కాంట్రాక్టులకు రూ. 2565కోట్లు చెల్లించడం జరిగింది. 640.62లక్షల ఘనపు మీటర్లు మట్టి వెలికితీతకు గాను సుమారు 538.17లక్షల మీటర్ల మట్టిని వెలికితీశారు. 11.70లక్షల ఘనపు మీటర్ల కాంక్రిట్‌ పనులకు గాను సుమారు 7.98లక్షల ఘనపు మీటర్ల కాంక్రీట్‌ పనులు జరిగాయి. 46.38 చదరుపు మీటర్ల కాంక్రీట్‌ లైనింగ్‌ పనులకు గాను, సుమారు 8.64లక్షల చదరపు మీటర్ల లైనింగ్‌ పనులు జరిగాయి. పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి నిధుల సమీకరణకు ప్రభుత్వం టీఎస్‌డబ్ల్యూఆర్‌ ఐడీసీఎల్‌ కార్పొరేషన్‌ను జీవోనెం 20 ఏర్పాటు చేసింది. 2018 ఏప్రిల్‌ 26న కార్పొరేషను ప్రారంభించారు.


గ్రావిటీ తీరుతెన్నులు..

అశ్వాపురం మండలం పాములపాడు వద్ద గ్రావిటీ ద్వారా గోదావరి నీటిని రెండు జిల్లాలకు తరలిస్తూ ప్రధాన రిజర్వాయర్‌తో పాటు చెరువులు, కుంటలు నింపడమే సీతారామ ప్రాజెక్టు లక్ష్యం. 0 నుంచి 13 కిలోమీటర్లు వద్ద బీజీ కొత్తూరు 10.5 మీటర్ల ఎత్తులో పంప్‌హౌజ్‌ను ఏర్పాటు చేసి లిఫ్ట్‌ చేస్తారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా 23 కిలోమీటర్ల వద్ద రెండో పంప్‌హౌజ్‌ ద్వారా నీటిని లిఫ్ట్‌ చేస్తారు. 58 కిలోమీటర్ల వద్ద ముల్కలపల్లి మండలం కమలాపురం వద్ద మూడో పంప్‌హౌజ్‌ను ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి గ్రావిటీ రెండు భాగాలుగా విడిపోయి ఒకటి సత్తుపల్లి వైపు, రెండు రోళ్లపాడు వైపు మళ్లుతాయి. చీమలపాడు వద్ద నాలుగో పంప్‌హౌజ్‌ ఏర్పాటు చేసి రోళ్లపాడుకు నీటిని లిఫ్ట్‌ చేస్తారు. పాములపాడు వద్ద నుంచి చీమలపాడు నాలుగో పంప్‌హౌజ్‌ వరకు ఫేజ్‌-1గా విభజించారు. మొత్తం 114 కిలోమీటర్లు ఫేజ్‌-1లో వస్తుంది. ఇందులో రెండు కిలోమీటర్లు జూలూరుపాడు మండలం వినోబానగర్‌ వద్ద టన్నెల్‌ రెండు కిలోమీటర్ల మేర తీయాల్సి ఉంటుంది. మిగతాది మొత్తం గ్రావిటీ ద్వారానే రోళ్లపాడుకు తీసుకొస్తారు. ఫేజ్‌-1లో నాలుగు వేల ఎకరాలు భూసేకరణ జరుగాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1300 ఎకరాల భూసేకరణ జరిగింది. రూ.300కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయి. ఫేజ్‌-1 పూర్తయితే, ఫేజ్‌-2 పనులను ప్రారంభించడానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది. 


మూడు జిల్లాలకు జలకళ..

సీతారామ ప్రాజెక్టు 70 టీఎంసీలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందులో ప్రధానంగా రోళ్లపాడు 10 టీఎంసీల రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయనున్నారు. మొదట 14.5 టీఎంసీల రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ఫారెస్టు క్లియరెన్స్‌ జాప్యం జరిగే అవకాశం ఉందని తెలిసి 10 టీఎంసీల రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. 14.5 టీఎంసీల రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయాల్సి వస్తే చిన్నచిన్న గుట్టలు, భారీగా అడవి మునిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం 10 టీఎంసీల రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నది. దీంతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఉన్న ప్రధాన చెరువులను బ్యాలెన్స్‌ రిజర్వాయర్‌ చేస్తూ రెండు జిల్లాలను 70 టీఎంసీలతో జలకళ ఉట్టిపడేలా ప్రతిపాదనలు ఇది వరకే సిద్ధం చేశారు. 


మూడు జిల్లాలకు వన్నె తెస్తుంది..

సీతారామ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న రోళ్లపాడు ఉమ్మడి జిల్లాకు తలమానికం కానుంది. మూడు జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి.. పచ్చదనం ఉట్టిపడేలా ప్రతిబింబించనుంది. సీఎం కేసీఆర్‌కు ఉమ్మడి జిల్లాల ప్రజలు రుణపడి ఉంటారు. మూడు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రిని సీతారాములు చల్లంగా చూడాలి. ప్రాజెక్టు పూర్తయితే ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తుంది. రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు రోళ్లపాడుకు పెరుగుతారు. సీతారామ ప్రాజెక్టు చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌ను ఉమ్మడి జిల్లాల ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు.  

-బానోత్‌ హరిప్రియనాయక్‌, ఎమ్మెల్యే ఇల్లెందు 


logo