సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 06, 2020 , 23:52:17

అకాల వర్షం

అకాల వర్షం

ఖమ్మం నగరంతో  పాటు పలు మండలాల్లో శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా అకాల వర్షం కురిసింది.. రైతన్నకు నష్టాన్ని             మిగిల్చింది. అరగంట పాటు కురవడంతో     నగరంలోని వీధులన్నీ జలమయమయ్యాయి.  ప్రజలు ఇబ్బంది పడ్డారు. నగర వ్యవసాయ మార్కెట్లో, షెడ్ల బయట ఉంచిన పంట తడిచి ముద్దయింది. లోతట్టు ప్రాంతంలో ఉంచిన బస్తాలు నీళ్లలో మునిగాయి.  పలు మండలాల్లో కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిచింది. రెండు, మూడురోజుల పాటు ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వర్షాలు పడుతుండటంతో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన    కంది కొనుగోళ్ల ప్రక్రియ  తాత్కాలికంగా నిలిపివేశారు.  

 నిన్నటి వరకు ఎండ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన జనం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం వాతావరణం చల్లబడి  భద్రాద్రి జిల్లాలోని పలు చోట్ల చిరుజల్లులతో పాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. రబీ సాగులో ఉన్న వరి పంటకు ఈ వాన కొంచెం ఊరట కలిగించింది. అకాల వర్షంతో కల్లాల్లోని పంటను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు.. కొన్ని చోట్ల ఆరబోసిన పంట పూర్తిగా తడిసి ముద్దయింది..  మండలాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.      -నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌